క్రేజీ బ్యూటీకి బ్యాక్ టూ బ్యాక్ భారీ ఫ్లాపులు!
'సప్త సాగరాలు దాటి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కన్నడ కస్తూరీ రుక్మిణి వసంత్.
By: Tupaki Desk | 9 Nov 2024 4:30 PM GMT'సప్త సాగరాలు దాటి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కన్నడ కస్తూరీ రుక్మిణి వసంత్. గతేడాది 'సైడ్ A' 'సైడ్ B' అంటూ రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలు పొందింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. తెలుగులో పెద్దగా ఆడకపోయినా, ఓటీటీలో వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ అందుకుంది. రుక్మిణి తన క్యూట్ లుక్స్, యాక్టింగ్ తో డెబ్యూతోనే యువ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. దీంతో అమ్మడు సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు వరుస పరాజయాలు ఆమె క్రేజ్ ను కాస్త తగ్గిస్తున్నట్లు అనిపిస్తోంది.
'సప్త సాగరదాచే ఎల్లో' సక్సెస్ అవ్వడంతో క్రేజీ ఆఫర్లు రుక్మిణి వసంత్ తలుపు తట్టాయి. అయితే కన్నడ హీరో గణేష్ సరసన కథానాయికగా నటించిన 'బాణదరియల్లి' చిత్రం యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన 'బఘీర' సినిమా కూడా నిరాశ పరిచింది. ప్రశాంత్ నీల్ కథతో శ్రీమురళి హీరోగా రూపొందిన ఈ సూపర్ హీరో మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన విధంగా ఆడలేదు. తెలుగులో డబ్బింగ్ చేసినప్పటికీ, ఫస్ట్ వీకెండ్ లోనే వాష్ అవుట్ అయిపోయింది. ఈ క్రమంలో లేటెస్టుగా వచ్చిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమా సైతం రుక్మిణి చేదు అనుభవాన్నే మిగిల్చింది.
నిఖిల్ సిద్దార్థ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ''అప్పుడో ఇప్పుడో ఎప్పుడో''. సైలెంట్ గా అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం ధియేటర్లలోకి వచ్చింది. ఇందులో రుక్మిణి వసంత్ ఒక హీరోయిన్ గా కనిపించింది. ఇదే ఆమెకు తొలి తెలుగు సినిమా. నిజానికి అప్పుడే రిలీజ్ అయ్యుంటే ఇదే అమ్మడి డెబ్యూ మూవీ అయ్యేది. కానీ వివిధ కారణాలతో లేట్ గా విడుదలైంది. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయకపోవడంతో మినిమం ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది.
ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్ చేయకుండా 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాని విడుదల చేశారు. ఓటీటీ స్లాట్ ను దృష్టిలో పెట్టుకునే సడన్ గా రిలీజ్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరో నిఖిల్ కూడా ఈ చిత్రాన్ని పెద్దగా ప్రమోట్ చెయ్యలేదు. చందు మొండేటి, సుధీర్ వర్మలతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అంతే. విడుదలకు ముందు రోజు రుక్మిణి వసంత్ ఇంటర్వ్యూ ఒకటి వదిలారు. ఇలా మొక్కుబడిగా ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. రుక్మిణి తన ప్రతిభను చాటుకోడానికి సినిమాలో అసలు స్కోప్ లేదనే కామెంట్లు వస్తున్నాయి.
ఏదేమైనా రుక్మిణీ వసంత్ పాత్ర ఎంత వరకూ ఉందనేది పక్కన పెడితే, చాలా తక్కువ గ్యాప్ లో 'బఘీరా' & 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' లాంటి రెండు ఫ్లాప్స్ ఆమె అకౌంట్ లో చేరిపోయాయి. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యుంటే, అమ్మడి క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరేది. కానీ ఫ్లాప్ అయ్యాయి కాబట్టి, కెరీర్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాకపోతే ఆల్రెడీ కమిటైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కనుక, వెంటనే ఆమెకు ఇబ్బంది కలిగే పరిస్థితి లేదు.
రుక్మిణి వసంత్ ఈ వారంలో 'భైరతి రణగల్' అనే కన్నడ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది. శివరాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ఆమె కీలక పాత్ర పోషించింది. ఇది నవంబర్ 15వ తేదీన విడుదల కానుంది. ఇక 'ఏస్' అనే తమిళ చిత్రంతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. విజయ్ సేతుపతితో కలిసి నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం విడుదల కాకముందే మరో తమిళ్ ఆఫర్ పట్టేసింది. ఏఆర్ మురగదాస్, శివ కార్తికేయన్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది.
ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాబినేషన్ లో రానున్న డ్రాగన్ మూవీ కోసం రుక్మిణీ వసంత్ ను హీరోయిన్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల ఆమె దగ్గర ప్రస్తావిస్తే.. బజ్ నడుస్తోంది, అలాంటి క్రేజీ ఆఫర్ వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు అంటూ నవ్వేసింది. రుక్మిణి పేరు ఇలా చక్కర్లు కొట్టాలన్నా, రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలు రావాలన్నా ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాలు మంచి విజయం సాధించాల్సిన అవసరం ఉంది. మరి రుక్మిణి కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి.