Begin typing your search above and press return to search.

దిల్‌రూబా హీరోయిన్.. ఆ గొడవేంటి?

సినిమా ప్రమోషన్లలో ప్రెస్ మీట్స్, ఫోటోషూట్లు సాధారణం. కానీ కొన్నిసార్లు అవి అనూహ్య పరిస్థితులకు దారి తీస్తాయి.

By:  Tupaki Desk   |   7 March 2025 10:23 AM IST
దిల్‌రూబా హీరోయిన్.. ఆ గొడవేంటి?
X

సినిమా ప్రమోషన్లలో ప్రెస్ మీట్స్, ఫోటోషూట్లు సాధారణం. కానీ కొన్నిసార్లు అవి అనూహ్య పరిస్థితులకు దారి తీస్తాయి. తాజాగా కిరణ్ అబ్బవరం, రుక్సర్ ధిల్లాన్ నటించిన దిల్‌రూబా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అలాంటి పరిస్థితే నెలకొంది. ఈ ఈవెంట్‌లో హీరోహీరోయిన్లు, ఇతర తారాగణం పాల్గొనగా, మీడియా ఫోటోగ్రాఫర్స్, హీరోయిన్ రుక్సర్ ధిల్లాన్ మధ్య చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మీడియా ఫోటోగ్రాఫర్లు ఆమెను ప్రత్యేకంగా కూర్చొని పోజ్ ఇవ్వమని కోరగా, ఆమె అసౌకర్యంగా ఫీలవుతూ కొంత అసహనంగా స్పందించిందట. సాధారణంగా సినిమా ప్రమోషన్ కోసం నటీనటులు ఫోటోషూట్లను సహజంగానే తీసుకుంటారు. కానీ ఈ ఈవెంట్‌లో రుక్సర్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్స్‌కు అనుకోని షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఆమె ఫోటోలు క్లిక్ చేయడంపై అసంతృప్తిగా స్పందించడంతో, అక్కడున్న మీడియా వ్యక్తులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

నిజానికి ఇలాంటి సంఘటనలు తరచుగా జరగవు. కానీ ఈసారి మీడియా ఫోటోగ్రాఫర్స్‌తో హీరోయిన్ మూడ్‌ కుదురుకోవడం లేదని స్పష్టంగా కనిపించింది. ఆమె అభ్యంతరం వ్యక్తం చేయడం మాత్రమే కాకుండా, మహిళలు ఇలాంటి అసౌకర్యానికి లోనైతే ఎలా ఉంటుందనే ప్రశ్నను కూడా ప్రెస్ మీట్‌లో లేవనెత్తడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో మరో కోణం కూడా తెరపైకి వచ్చింది. ఇటీవలే దిల్‌రూబా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో కూడా రుక్సర్ ధిల్లాన్ మీడియా ఫోటోగ్రాఫర్స్‌ను పూర్తిగా పక్కన పెట్టి, పర్సనల్ గా తన ఫోటోషూట్‌కు ప్రాధాన్యత ఇచ్చిందని టాక్.

మీడియా కోసం ప్రత్యేకంగా బయట వేచిచూసే వారికి కనీసం కనబడకుండా, తాను వెనుక గేటు ద్వారా వెళ్లిపోయిందని వార్తలొస్తున్నాయి. అప్పటికే ఫోటోగ్రాఫర్స్‌లో ఓ నిరాశ ఏర్పడగా, ఇప్పుడు ట్రైలర్ లాంచ్‌లో కూడా ఆమె అలాగే చేయడంతో వాళ్లంతా అంతగా ఆసక్తి చూపించలేదని సమాచారం. ఈ అసహనమే ఫోటోగ్రాఫర్స్ తీరు మారడానికి కారణమయ్యిందని అనుకోవచ్చు. సాధారణంగా ఫోటోగ్రాఫర్లు నటీనటులకు ప్రత్యేకంగా ఫోటోలు తీసేందుకు సిద్ధంగా ఉంటారు.

కానీ ఈసారి మాత్రం వారు రుక్సర్‌ను చివరికి పెట్టి గ్రూప్ ఫోటోషూట్‌లో తక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒక విధంగా ఫోటోగ్రాఫర్స్ కూడా తమ నిరసన తెలియజేయడానికి ఇది ఉపయోగించుకున్నారనే వాదన వినిపిస్తోంది. ఇక ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత ఈ ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హీరోహీరోయిన్లు, మీడియా మధ్య ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. సాధారణంగా మూవీ ప్రమోషన్‌లో నటీనటులు తమ బిహేవియర్‌పై చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇక్కడ రుక్సర్ ధిల్లాన్ ప్రవర్తనపై రెండు వేర్వేరు వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె నిజంగానే అసౌకర్యంగా ఫీలైందా? లేక మీడియా ఫోటోగ్రాఫర్స్‌కు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడమే కారణమా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.