Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : రూల్స్ రంజన్

By:  Tupaki Desk   |   6 Oct 2023 10:44 AM GMT
మూవీ రివ్యూ : రూల్స్ రంజన్
X

'రూల్స్ రంజన్' మూవీ రివ్యూ

నటీనటులు: కిరణ్ అబ్బవరం-నేహా శెట్టి-వెన్నెల కిషోర్-మెహర్ చాహల్-సుబ్బరాజు-హైపర్ ఆది-వైవా హర్ష-అన్ను కపూర్-గోపరాజు రమణ-మకరంద్ దేశ్ పాండే-అజయ్-సుదర్శన్ తదితరులు

సంగీతం: అమ్రిష్

ఛాయాగ్రహణం: దులిప్ కుమార్

నిర్మాతలు: దివ్యాంగ్ లవానియా-మురళీకృష్ణ వేమూరి

రచన-దర్శకత్వం: రత్నంకృష్ణ

'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమాతో మంచి హిట్ కొట్టి.. వరుసగా అవకాశాలు దక్కించుకున్న యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం.. ఈ మధ్య వరుస ఫెయిల్యూర్లతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి కెరీర్ కు చాలా కీలకంగా మారిన సినిమా 'రూల్స్ రంజన్'. గతంలో 'నీ మనసు నాకు తెలుసు'.. 'ఆక్సిజన్' లాంటి సినిమాలతో నిరాశపరిచిన సీనియర్ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు రత్నంకృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించాడు. అతను కూడా ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి వీరి ఆశలను 'రూల్స్ రంజన్' ఏ మేర నెరవేర్చిందో చూద్దాం పదండి.

కథ:

మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) ముంబయిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే కుర్రాడు. చిన్నప్పట్నుంచి పద్ధతిగా పెరిగిన అతను.. ఉద్యోగ జీవితంలో కూడా అంతే పద్ధతిగా ఉంటాడు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ.. అమ్మాయిల జోలికి వెళ్లకుండా క్రమశిక్షణతో జీవితాన్ని సాగిస్తుంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి సన (నేహా శెట్టి) ఒక మెరుపులా వచ్చి వెళ్తుంది. ఆమె రంజన్ కాలేజీ రోజుల్లో ప్రేమించిన అమ్మాయే. కానీ అప్పుడు ఆమెకు తన ప్రేమను చెప్పడు. ముంబయిలో ఉద్యోగం కోసం వచ్చి రంజన్ ను కలిసిన సన ఒక రోజంతా తనతో గడుపుతుంది. ఆ క్రమంలో ఇద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. కానీ ఉద్యోగం రాకపోవడంతో తిరిగి ఆమె తన ఊరికి వెళ్లిపోతుంది. సన మీద ప్రేమను దాచుకోలేక తన కోసం రంజన్ ముంబయి నుంచి వచ్చేస్తాడు. అతను సనను కలిశాడా.. వీళ్లిద్దరూ ఒక్కటి కావడంలో ఎదురైన అడ్డంకులేంటి.. వాటిని ఎలా దాటారు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

హీరో బాగా స్ట్రిక్ట్. ఆఫీసులో ఎవ్వరైనా చిన్న తప్పు చేస్తే ఊరుకోడు. తనుంటే సొసైటీలో కూడా తప్పు జరిగినా కూడా మన్నించడు. అలాంటోడికి ఒక బిచ్చగాడు.. అమ్మాయి లేదు ఎంటర్టైన్మెంట్ లేదు.. ఎందుకు నీ జీవితం అని హితబోధ చేయగానే హీరోలో అంతర్మథనం మొదలైపోతుంది. సరిగ్గా అప్పుడే ఎప్పుడో కాలేజీ రోజుల్లో ఆంధ్రాలో తనతో కలిసి చదువుకున్న హీరోయిన్.. ముంబయిలో తనముందు ప్రత్యక్షం అయిపోతుంది. హీరోలో ప్రేమ భావనలు తన్నుకొచ్చేస్తాయి. ఎన్నడూ లేనిది ఆ రోజు ఆఫీసుకు డుమ్మా కొట్టేస్తాడు. ఆమెను ఇంటర్వ్యూకు తీసుకెళ్తాడు. ఉద్యోగం వచ్చిందనగానే తన రూల్స్.. ప్రిన్సిపుల్స్ అన్నీ పక్కన పెట్టి ఆమె అడిగిందని తనను పబ్బుకు తీసుకెళ్తాడు. అప్పటిదాకా మందే ముట్టని హీరోయిన్ మందులో రకాలన్నీ చెప్పి వీర తాగుబోతులా పెగ్గుల మీద పెగ్గులు లాగించేస్తుంది.

ఇంటికి తీసుకెళ్లిన హీరోతో బెడ్ షేర్ చేసుకుంటుంది. ఈ మాత్రం దానికి జీవితంలో మరిచిపోలేని అనుభవాన్నిచ్చావ్.. నన్ను నాకు కొత్తగా చూపించావ్.. కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లావ్.. అంటూ హీరోయిన్ తెగ ఎమోషనల్ అయిపోయి డైలాగులు కొడుతుంది. హీరో కూడా కథానాయికతో గడిపిన ఆ కొన్ని గంటల గురించి తన్మయత్వంతో మాట్లాడేసుకుంటారు. అసలు ఇందులో ప్రేమ ఎక్కడుందో తెలియక మనం తికమక పడుతుంటే.. హీరో హీరోయిన్లు మాత్రం తమ లవ్ స్టోరీ గురించి 'మరో చరిత్ర' రేంజిలో మాట్లాడుకుంటూ ఎమోషనల్ అవడం చూసి దిమ్మదిరుగుతుంది.

ప్రేమకథ సంగతి పక్కన పెట్టి కామెడీ సంగతి చూస్తే.. డిజాస్టర్ సినిమాల్లో కూడా చిన్న సందు దొరికినా కితకితలు పెట్టించే వెన్నెల కిషోర్.. సినిమా మొత్తంలో అరగంటకు పైగా కనిపించినా.. కనీసం చిన్న చిరునవ్వు తెప్పించలేకపోయాడు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాఫ్ట్ పోర్న్ సినిమాలకు పని చేసే అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసే వెన్నెల కిషోర్ చేయించిన వెకిలి కామెడీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక హైపర్ ఆది జబర్దస్త్ లో వాడకుండా పక్కన పడేసిన జోకులన్నీ తెచ్చి ఇక్కడ పోసేశాడు. ఒక్క జోకుకైనా నవ్వు వస్తే ఒట్టు. అతడితో కలిసి వైవా హర్ష.. సుదర్శన్ చేసిందాన్ని కామెడీ అని ఎలా అనాలో అర్థం కాదు. 'గబ్బర్ సింగ్' లాంటి సినిమాల్లో విలనీతో అదరగొట్టిన అభిమన్యు సింగ్ తో ఇందులో చేయించిన పాత్రను చూస్తే దర్శకుడి అభిరుచి గురించి ఏం మాట్లాడాలో అర్థం కాదు.

మొదట్లో ముంబయి నేపథ్యంలో సాగే సాఫ్ట్ వేర్ ఆఫీస్ ఎపిసోడ్లతోనే 'రూల్స్ రంజన్' డొల్లతనం అంతా బయటపడిపోతుంది. రూల్స్ రంజన్ అనే టైటిల్ చూసి హీరో పాత్ర గురించి ఏదో అనుకుంటాం. హీరో పాత్రకు మొదట్లో ఇచ్చిన బిల్డప్ కి.. తర్వాత అతడి ప్రవర్తనకు అసలు పొంతన ఉండదు. హీరోయిన్ ఎంట్రీతోనే 'రూల్స్ రంజన్' సైడ్ ట్రాక్ పట్టేస్తుంది. నా గురించి ఇంత ఆలోచించేవాడివి సోషల్ మీడియాలో నన్నెందుకు ఫాలో కాలేదు అని హీరోయిన్ అడిగితే.. ఎన్ని రిక్వెస్టులు పెట్టినా నువ్వు యాక్సెప్ట్ చేయలేదు అంటుంది హీరోయిన్. ఈ సంభాషణ జరిగాక ఈ కాలంలో హీరోయిన్ ట్రైన్ ఎక్కి వెళ్లిపోతుంటే.. 80వ దశకంలో హీరోయిన్ని హీరో మిస్సయిపోతున్నట్లు పెద్ద డ్రామా నడిపించారు. హీరోయిన్ ఊరు.. ఇల్లు తెలిసిన హీరో సింపుల్ గా ఆమెను వెళ్లి కలిస్తే సరిపోయేదానికి మధ్య మధ్యలో ఎవరెవరినో కలుస్తాడు. హీరోయిన్ని కలవడానికి నానా పాట్లు పడతాడు. కలిశాకేమో ఆమెకు మందు కొడితే తప్ప తన మీద ప్రేమ రాదంటూ బారుకి తీసుకెళ్తాడు. అక్కడ జరిగే ప్రహసనాన్ని చూసి తట్టుకోవడం చాలా కష్టం. ఏ పాత్ర ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియనట్లు సాగిపోయే సన్నివేశాలు.. కామెడీ పేరుతో చేసిన విన్యాసాలు చూసి 'ఎండ్ కార్డ్' పడే వరకు కూర్చోవడం కూడా పెద్ద పరీక్షగా మారుతుంది. ప్రోమోలో ఆకట్టుకున్న సమ్మోహనుడా పాట తప్పితే సినిమాలో చెప్పుకోదగ్గ చిన్న విశేషం కూడా లేదంటే 'రూల్స్ రంజన్' ఎలాంటి చిత్రమో అర్థం చేసుకోవచ్చు.

నటీనటులు:

కిరణ్ అబ్బవరం ఏమీ మారలేదు. అదే నటన.. అవే హావభావాలు. మొదట్లో కొంచెం కొత్తగా అనిపించిన అతడి రాయలసీమ యాస.. డైలాగ్ డెలివరీ.. ఇప్పుడు బోర్ కొట్టిస్తున్నాయి. 'రూల్స్ రంజన్'లో తన లుక్.. యాక్టింగ్.. డైలాగ్ డెలివరీ అన్నీ కూడా చాలా సాధారణంగా అనిపిస్తాయి. పాత్ర పరంగా ఏ విశేషం లేకపోవడం.. కిరణ్ పెర్ఫామెన్స్ కూడా రొటీన్ గా సాగిపోవడంతో రంజన్ గా అతను ఇంపాక్ట్ వేయలేకపోయాడు. హీరోయిన్ నేహా శెట్టి మరోసారి తన గ్లామర్ తో ఆకట్టుకుంది. సమ్మోహనుడా పాత్రలో ఆమె కుర్రాళ్లను కట్టి పడేస్తుంది. సినిమా అంతా కూడా ఆమె గ్లామరస్ గానే కనిపించింది. నటనకు పెద్దగా అవకాశమున్న పాత్ర కాదు తనది. వెన్నెల కిషోర్ ఏమాత్రం నవ్వించలేకపోయిన అతి కొద్ది సినిమాల్లో ఇది ఒకటి. హైపర్ ఆది జబర్దస్త్ జోకులను ఇక్కడా రిపీట్ చేశాడు. సుదర్శన్ సైతం నవ్వించడానికి విఫలయత్నం చేశాడు. అజయ్.. అభిమన్యు సింగ్.. గోపరాజు రమణ.. సుబ్బరాజు.. ఇలా చాలామంది పేరున్న నటులున్నా ఎవరూ తమదైన ముద్ర వేసే అవకాశం ఆయా పాత్రలు ఇవ్వలేదు.

సాంకేతిక వర్గం:

'రూల్స్ రంజన్'లో చెప్పుకోదగ్గ ప్లస్ అంటే సంగీతమే. 'సమ్మోహనుడా' పాటతో అమ్రిష్ తన ప్రతిభను చాటాడు. ఆ పాట వినసొంపుగా ఉంది. ఆ పాట విజువల్ గా కూడా బాగుంది. మిగతా పాటలు కూడా పర్వాలేదు. నేపథ్య సంగీతంలో మాత్రం ఏ విశేషం లేదు. దులీప్ కుమార్ ఛాయాగ్రహణం సాదాసీదాగా సాగిపోయింది. నిర్మాణ విలువలు పర్వాలేదు. రైటర్ కమ్ డైరెక్టర్ జ్యోతికృష్ణ ఆ పేరుతో తీసిన సినిమాలే కొంచెం నయం. అంతో ఇంతో విషయం ఉండేవి. కానీ రత్నంకృష్ణగా పేరు మార్చుకుని.. మరీ పేలవమైన సినిమా తీశాడు. కథ.. కథనం.. ఇలాంటి వాటికి సంబంధించి అతను బేసిక్స్ కూడా మరిచిపోయాడనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. రైటింగ్.. డైరెక్షన్ ఇలా ఎందులోనూ కనీస స్థాయిలో కూడా మెప్పించలేకపోయాడు రత్నంకృష్ణ.

చివరగా: రూల్స్ రంజన్.. తల బొప్పి కట్టిస్తాడు

రేటింగ్ - 1.5/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater