బాలయ్య ఎంట్రీ ఇస్తే `జైలర్ -2` నెక్స్ట్ లెవల్లోనే!
తాజాగా ఈ సినిమా నేడు తమిళనాడులో కూడా రిలీజ్ అవుతుంది. దీంతో అక్కడా బాలయ్య సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తుంది.
By: Tupaki Desk | 17 Jan 2025 6:44 AM GMTఇటీవలే రిలీజ్ అయిన నటసింహ బాలకృష్ణ `డాకు మహారాజ్` ఎలాంటి విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. బాలయ్య కెరీర్ లోనే భారీ వసూళ్ల చిత్రం దిశగా దూసుకుపోతుంది. బాబి మార్క్ యాక్షన్ కంటెంట్తో నందమూరి అభిమానులు ఫిదా అయ్యారు. తమన్ బాదుడు దెబ్బకి స్పీకర్లు పగిలిపోతున్నాయి. ఈ విషయంలో తనకెలాంటి సంబంధం లేదని థమన్ ముందే హెచ్చరించాడు. ఇప్పుడు అతడు చెప్పినట్లే జరుగుతోంది.
`గేమ్ ఛేంజర్` సంక్రాంతి రేస్ నుంచి ఎగ్జిట్ అవ్వడంతో `డాకు మహారాజ్` కు తిరుగు లేకుండా పోయింది. పోటీగా రెండు రోజుల గ్యాప్ అనంతరం సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయినా డాకు పై ఆ ప్రభావం పెద్దగా పడలేదు. ఏ సినిమాకి వెళ్లాల్సిన జనాలు ఆ సినిమాకు వెళ్తున్నారు. తాజాగా ఈ సినిమా నేడు తమిళనాడులో కూడా రిలీజ్ అవుతుంది. దీంతో అక్కడా బాలయ్య సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తుంది.
కోలీవుడ్ లోనూ బాలయ్య కు మంచి అభిమానులున్నారు. ఆయన డైలాగులను అలరించే ఫ్యాన్స్ ఎంతో మంది. అతడి మాస్ యాంగిల్ కి ఫిదా అయ్యేవారు మరెంతో మంది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ కు, బాలయ్యకు స్టార్ మేకర్ నెల్సన్ దిలీప్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేసాడు. రిలీజ్ తేదీని గుర్తుచేస్తూ టీమ్ అందరితో పాటు స్పెషల్ గా బాలయ్య ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమాకు నెల్సన్ కూడా బాగానే కనెక్ట్ అయినట్లున్నాడు.
నెల్సన్ కూడా మంచి యాక్షన్ ఫిల్మ్ మేకర్. `జైలర్` విజయంతో అతడికి మంచి పేరొచ్చిన సంగతి తెలిసిందే. అందుకే `జైలర్ -2`ని మళ్లీ అదే రజనీకాంత్ తో మొదలు పెడుతున్నాడు. నెల్సన్ ట్వీట్ పై నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్సన్ సినిమా చూసి అతడికి నచ్చే ట్వీట్ చేసారా? అన్న సందేహం వ్యక్తమవుతుంది. సాధారణంగా తెలుగు సినిమాలు తమిళ్ లో రిలీజ్ అవుతున్నాయంటే కొంత మంది హీరోలు మాత్రమే స్పందిస్తారు తప్ప దర్శకులు ఎలాంటి కామెంట్ చేయరు. కానీ నెల్సన్ మాత్రం `డాకు మహారాజ్ పై స్పందించి అంచనాలు పెంచేసారు.
అయితే నెల్సన్ స్పందన వెనుక మరో బలమైన కారణ కూడా వినిపిస్తుంది. `జైలర్ -2` లో బాలయ్య నటిస్తున్నారా? అన్న సందేహాలు బలపడుతున్నాయి. ఎందుకంటే `జైలర్ -2` లో స్టార్ హీరోలు మొదటి భాగం తరహలోనే యాడ్ అవుతారని ఇప్పటికే ప్రచారంలో ఉంది. మొదటి భాగాన్ని మించి స్టార్ క్యాస్టింగ్ ఉంటుందని....నెల్సన్ ఆ పనుల్లో బిజీగా ఉన్నట్లు కూడా ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమాకు నెల్సన్ అల్ ది బెస్ట్ చెప్పడం వెనుక అసలు కారణంగా `జైలర్ -2`లోకి బాలయ్య ఎంట్రీనా? అన్నది రెండు ఇండస్ట్రీలోనూ గట్టిగా వినిపిస్తోన్న మరో మాట. అదే జరిగితే `జైలర్ -2` స్పాన్ అంతకంతకు రెట్టింపు అవుతుంది.