Begin typing your search above and press return to search.

స్పెషల్ స్టోరీ: 3 గంటలకు తగ్గేదేలే!

'సినిమా నిడివి' ఇంతే ఉండాలని రూలేం లేదు. ఆసక్తికరమైన కథా కథనాలతో ప్రేక్షకులని ఎంత సేపైనా థియేటర్ లో కూర్చోబెట్టొచ్చు.

By:  Tupaki Desk   |   10 July 2024 5:30 PM GMT
స్పెషల్ స్టోరీ: 3 గంటలకు తగ్గేదేలే!
X

'సినిమా నిడివి' ఇంతే ఉండాలని రూలేం లేదు. ఆసక్తికరమైన కథా కథనాలతో ప్రేక్షకులని ఎంత సేపైనా థియేటర్ లో కూర్చోబెట్టొచ్చు. ఈ విషయాన్ని గతంలో అనేక చిత్రాలు నిరూపించాయి. మన బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చాలా వరకు మూడున్నర లేదా 4 గంటల నిడివితో ఉండేవి. కానీ ఆ తర్వాత కాలంలో తక్కువ రన్ టైమ్ తో, ఎక్కడా బోర్ కొట్టకుండా వీలైనంత క్రిస్పీగా కథను చెప్పడమనే కాన్సెప్ట్ వచ్చింది. సినిమాలన్నీ రెండున్నర గంటలకు కాస్త అటు ఇటుగా.. 3 గంటల కంటే తక్కువ లెన్త్ తో ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో అంతా మారిపోయింది.

ఇప్పుడు ఓ పెద్ద సినిమా థియేటర్లలోకి వస్తుందంటే, దాని రన్ టైం కనీసం 3 గంటలు ఉంటోంది. స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే మూడు గంటల పాటు సీట్లో కూర్చోవాల్సిందే అని జనాలు ఫిక్స్ అయిపోతున్నారు. ఈ మధ్యే వచ్చిన 'కల్కి 2898 AD' మూవీ నిడివి 3 గంటల 8 నిమిషాలు. ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న 'భారతీయుడు 2' డ్యూరేషన్ అక్షరాలా మూడు గంటల 4 సెకండ్లు. గతేడాది చివర్లో వచ్చిన 'సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్' రన్ టైమ్ కూడా 3 గంటల వరకూ వచ్చింది.

ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ సినిమాల్లో 'యానిమల్' అన్నిటి కంటే ముందుంది. ఆ సినిమా నిడివి ఏకంగా 3 గంటల 21 నిమిషాల 23 సెకన్లు. క్రెడిట్స్, యాడ్స్ కలిపితే మరో నాలుగైదు నిమిషాలు పెరుగుతుంది. నిజానికి మొదటి వెర్షన్ గం. 3.49 నిమిషాలు వచ్చిందట. 'మహానటి', 'పుష్ప: ది రైజ్', 'అంటే సుందరానికీ', 'ఆదిపురుష్', 'టైగర్ నాగేశ్వరరావు', 'బేబీ', 'మను', 'మహర్షి' 'ప్రస్థానం' లాంటి తెలుగు చిత్రాలు కూడా దగ్గర దగ్గర మూడు గంటల నిడివితో వచ్చాయి. ఇక 'అర్జున్ రెడ్డి', RRR సినిమాల రన్ టైమ్ 3 గంటల 6 నిమిషాలుగా ఉంది.

నిజానికి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్ద నిడివి సినిమాలు కొత్తేం కాదు. 1977లో తీసిన 'దాన వీర శూర కర్ణ' సినిమా దాదాపు 3 గంటల 46 నిమిషాలతో తెలుగులో అత్యంత పెద్ద చిత్రంగా నిలిచింది. ఆ తరువాత 'లవకుశ' (3 గంటల 28 నిమిషాలు), 'పాండవ వనవాసం' (3 గంటల 18 నిమిషాలు), 'పాతాళ భైరవి' (3 గంటల 15 నిమిషాలు), 'అల్లూరి సీతారామరాజు' (3 గంటల 7 నిమిషాలు), మాయాబజార్ (3 గం. 4 నిమిషాలు), మిస్సమ్మ (3 గం.1 నిమిషం) చిత్రాలు మూడు గంటలకు పైగా నిడివితో ఆడియన్స్ ను అలరించాయి.

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 'నువ్వు నాకు నచ్చావ్', 'నిజం' లాంటి సినిమాలు మళ్ళీ 3 గంటలకు పైగా రన్ టైమ్ ట్రెండ్ ను తెలుగులోకి తిరిగి తీసుకొచ్చాయి. అప్పటి నుంచి మినిమం గ్యాప్‌లో 'భారీ సినిమాలు' వస్తూనే ఉన్నాయి. అయితే రన్ టైమ్ ఎక్కువగా ఉండటంతో, ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పే కొత్త కాన్సెప్ట్ కూడా వచ్చింది. రెండు పార్ట్స్ ను కలిపితే కథ ఐదున్నర గంటలకు పైగానే ఉంటుంది. ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాలో 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్' 'బాహుబలి', ఎన్టీఆర్ బయోపిక్, 'రక్త చరిత్ర', 'పొన్నియన్ సెల్వన్', KGF వంటి చిత్రాలు 2 పార్ట్స్ గా వచ్చాయి. త్వరలోనే 'పుష్ప' సెకండ్ పార్ట్ రిలీజ్ కానుంది. 'దేవర' చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రకటించగా.. 'సలార్ 2', 'కల్కి 2' సినిమాలు సెట్స్ మీదకు రావాల్సి వుంది.

ఏదేమైనా సినిమాకి నిడివి అనేది సమస్య కాదని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. కంటెంట్ బాగుండి, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉంటే ఆడియన్ 3 గంటలైనా థియేటర్ లో కూర్చుంటాడు. అలా కూర్చోబెట్టగలిగే సినిమానే బాక్సాఫీస్ దగ్గర హిట్ అవుతుంది. అదంతా డైరెక్టర్ స్టైల్, విజన్‌ పై ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇచ్చేందుకు ఇంత నిడివి అవసరమని భావిస్తే.. మూడు గంటలకు పైగా కథను చెప్పొచ్చు. కొన్నిసార్లు నిడివి కూడా ప్రతికూలాంశంగా మారుతుందని 'అంటే సుందరానికి', 'టైగర్ నాగేశ్వరరావు' లాంటి సినిమాలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇప్పటి రోజుల్లో నిడివి తక్కువ ఉంటే మల్టీఫ్లెక్స్ లలో ఎక్కువ షోలు వేసుకునే అడ్వాంటేజ్ వుంది. మరి రానున్న రోజుల్లో 3 గంటలకు పైగా రన్ టైమ్ తో ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి.