మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడి అరెస్ట్?
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు బాలీవుడ్ దిగ్గజ నటుల పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 April 2024 3:00 AM GMTమహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు బాలీవుడ్ దిగ్గజ నటుల పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు, ప్రభావశీలుడైన సాహిల్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనను బాంబే హైకోర్టు తిరస్కరించడంతో ముంబై సైబర్ సెల్ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ (సిట్) ఛత్తీస్‌గఢ్‌లో అతడిని అరెస్టు చేసింది. అతడిని మే 1 వరకు పోలీసు కస్టడీకి పంపారు.
2023 డిసెంబర్‌లో సాహిల్‌తో పాటు మరో ముగ్గురిని సిట్ విచారణకు పిలిచింది. అయితే అతడు హాజరుకాలేదు. అతడు M/s తో ఒప్పందం ప్రకారం కేవలం బ్రాండ్ ప్రమోటర్ మాత్రమేనని పేర్కొన్నాడు. Iస్పోర్ట్స్ 247, ది లయన్ బుక్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాడు. బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌తో ప్రత్యక్ష అనుబంధం ఉందనే వార్తలను తిరస్కరించాడు. అయితే అతడు యాప్‌కు సహ యజమాని అని పోలీసులు తెలిపారు. ఇప్పుడు అరెస్ట్ చేసి అతడిని రాయ్‌పూర్ మీదుగా ముంబైకి తీసుకొచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతడు లోటస్ యాప్ 247లో భాగస్వామిగా ఉన్నాడు. ముంబైకి తీసుకువచ్చిన తర్వాత ``నేను దేశంలోని న్యాయవ్యవస్థను నమ్ముతాను`` అని సాహిల్ చెప్పాడు.
తన సోషల్ మీడియాలో ప్రమోషనల్ వీడియోలను పోస్ట్ చేసినందుకు నెలవారీగా 3 లక్షలు చెల్లించడంతో పాటు తన కాంట్రాక్ట్ 24 నెలలు అని సాహిల్ గతంలో చెప్పాడు. అయినప్పటికీ చట్టవిరుద్ధమైన ఆపరేషన్‌లో అతని ప్రత్యక్ష ప్రమేయాన్ని పేర్కొంటూ కోర్టు అతని బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. స్టైల్- ఎక్స్‌క్యూస్ మీ వంటి చిత్రాల్లో తన పాత్రలకు పేరుగాంచిన సాహిల్ ఇప్పుడు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. ఫిట్‌నెస్ సప్లిమెంట్లను అందించే డివైన్ న్యూట్రిషన్‌ను స్థాపించాడు.
2023లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసుపై విచారణ జరుపుతున్న క్రైమ్ బ్రాంచ్, డిసెంబరు 15న సాహిల్ ఖాన్ సహా మరో ముగ్గురి వాంగ్మూలాలను నమోదు చేయమని సమన్లు పంపింది. అయితే సాహిల్ ఖాన్ విచారణ కోసం పోలీసుల ముందు హాజరుకాలేదు.. దానిని అలానే కొనసాగించాడు. ఆ కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నాడు.. దాంతో పాటు ``గుడ్ మార్నింగ్, జుమ్మా ముబారక్`` అనే క్యాప్షన్‌తో అతడు ఈత కొలనులో రిలాక్స్ డ్ గా కూర్చున్న ఫోటోని కూడా పోస్ట్ చేశాడు. అతడు ఉద్ధేశపూర్వకంగా పోలీసు సమన్లను పట్టించుకోకపోవడంతో ఇది దృష్టిని ఆకర్షించి చివరికి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
IANS వివరాల ప్రకారం.. సాహిల్ ఖాన్, ఫిట్‌నెస్ నిపుణుడిగా, యూట్యూబర్‌గా పాపులర్. అతడు బెట్టింగ్ యాప్‌ను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఎక్కువ మంది వ్యక్తులను దీనిని ఉపయోగించమని ప్రలోభపెట్టే ఉద్దేశ్యంతో సెలబ్రిటీ సమావేశాలను నిర్వహించాడని అధికారులు పేర్కొన్నారు. ఏజెన్సీలతో కలిసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏకకాలంలో దర్యాప్తు చేస్తున్న ఈ కేసు సమయంలోనే వివిధ బెట్టింగ్ .. గేమింగ్ యాప్‌లపై అణిచివేత తర్వాత పలువురు బాలీవుడ్ నటీనటుల పేర్లు మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చాయి. కానీ ఇప్పుడు పెద్ద పేర్లకు బదులుగా షాహిల్ ఖాన్ లాంటి వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.