Begin typing your search above and press return to search.

'పుష్ప 2'కి మెగా హీరో బెస్ట్ విషెస్.. ఫ్యాన్స్ అంతా ఒకే తాటి మీదకు వచ్చినట్లేనా?

ఈ నేపథ్యంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ 'ఎక్స్' వేదికగా బెస్ట్ విషెస్ అందజేశారు. ''పుష్ప-2 టీమ్‌ మొత్తానికి నా శుభాకాంక్షలు.

By:  Tupaki Desk   |   4 Dec 2024 8:03 AM GMT
పుష్ప 2కి మెగా హీరో బెస్ట్ విషెస్.. ఫ్యాన్స్ అంతా ఒకే తాటి మీదకు వచ్చినట్లేనా?
X

అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా విషయంలో మెగా ఫ్యామిలీ హీరోలంతా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా వైడ్ గా పుష్ప సీక్వెల్ మ్యానియా నడుస్తున్నా, మెగా కాంపౌండ్ మాత్రం ఈ సినిమా విషయంలో ఇప్పటి వరకూ సైలెంట్ గానే ఉన్నారు. ఈ నేపథ్యంలో బన్నీ మూవీకి 'మెగా సపోర్ట్' లభిస్తుందా లేదా? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో మెగా ఫ్యామిలీ నుంచి 'పుష్ప 2' సినిమా మీద ఫస్ట్ రెస్పాన్స్ వచ్చింది. మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటూ పోస్ట్ పెట్టారు.

'పుష్ప 2: ది రూల్' సినిమా రేపు డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ రోజు రాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ 'ఎక్స్' వేదికగా బెస్ట్ విషెస్ అందజేశారు. ''పుష్ప-2 టీమ్‌ మొత్తానికి నా శుభాకాంక్షలు. బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని బన్నీ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, ఫహద్ ఫాజిల్, రష్మిక మందన్న, దేవిశ్రీ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో సహా మొత్తం చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను'' అని తేజ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. సినిమాలోని అల్లు అర్జున్ పోస్టర్ ను పంచుకున్నారు.

'పుష్ప 2: ది రూల్' సినిమా గురించి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ మాట్లాడలేదని నెట్టింట చర్చలు జరుగుతున్న తరుణంలో, సాయి దుర్గ తేజ్ ఈ ట్వీట్ పెట్టడం హాట్ టాపిక్ అయింది. అల్లు అర్జున్ ని బన్నీ అంటూ తేజ్ ప్రేమగా సంబోధించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో మెగా Vs అల్లు ఫ్యాన్ వార్స్ కి ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ భావిస్తున్నారు. మెగా హీరోల నుంచి ట్వీట్ వచ్చింది కాబట్టి, మెగా అభిమానులంతా 'పుష్ప 2' సినిమాకి సపోర్ట్ చేస్తారనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. ఫ్యాన్స్ అంతా ఒకే తాటి మీదకు వచ్చి సినిమాని ఆదరిస్తారని అంటున్నారు. అదే జరిగితే పుష్పరాజ్ బాక్సాఫీస్ ర్యాంపేజ్‌ కి మరింత బలం చేకూరినట్లే అవుతుంది.

నిజానికి కొంతకాలంగా అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీల మధ్య అంతా సవ్యంగా లేదనే విధంగా ప్రచారం సాగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో బన్నీ తన మిత్రుడైన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రా కిశోర్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఇరు వర్గాల మధ్య వివాదానికి కారణమైంది. అప్పటి నుంచి ఒకరికొకరు దూరంగానే ఉంటున్నారని రూమర్స్ వస్తున్నాయి. సాయి దుర్గ తేజ్సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేసినట్లుగా వార్తలు వచ్చాయి. 'పుష్ప 2' ట్రైలర్ వచ్చిన తర్వాత, ఎక్కడ చూసినా పుష్పగాడి రూల్‌ గురించే మాట్లాడుకుంటుంటే.. మెగా హీరోలు మాత్రం మౌనం వహించారు.

చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, నిహారిక కొణిదెల.. ఇలా ఎవరూ 'పుష్ప 2: ది రూల్' సినిమాపై పోస్ట్ పెట్టలేదు. మామూలుగా అయితే ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. 'పుష్ప 2' బన్నీకి స్పెషల్ మూవీ కావడం, ఇరు వర్గాల మధ్య దూరం పెరిగిందనే పుకార్లు పుట్టుకురావడంతో అందరూ దీన్ని ప్రత్యేకంగా చూసారు. అయితే ఎట్టకేలకు మెగా కుటుంబం నుంచి సాయి తేజ్ ఫస్ట్ ట్వీట్ పెట్టడంతో, ఇరు వర్గాల మధ్య అన్నీ సర్దుకుంటున్నాయనే భావన కలుగుతోంది. అంతకాదు మెగా అభిమానులందరూ ఏకమై అల్లు అర్జున్ సినిమాకి సపోర్టుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.