ఈ పూట గడిస్తే చాలనుకుంటా: సాయి ధరమ్ తేజ్
సాయి తేజ్ వస్తున్నాడని తెలుసుకుని అక్కడికి ఎంతోమంది తన అభిమానులతో పాటూ మెగా అభిమానులు కూడా వచ్చారు. దర్శన అనంతరం సాయి తేజ్ వారితో ఫోటోలు దిగాడు.
By: Tupaki Desk | 11 Feb 2025 11:18 AM GMTమెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ఎగువ, దిగువ అహోబిలం విచ్చేశాడు. అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకుని, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, ఆలయ పండితుల ఆశీర్వచనాలు అందుకున్నాడు. అనంతరం నవ నరసింహుల స్వామి చిత్రపటంతో పాటూ తీర్థ ప్రసాదాలు అందుకున్నాడు.
సాయి తేజ్ వస్తున్నాడని తెలుసుకుని అక్కడికి ఎంతోమంది తన అభిమానులతో పాటూ మెగా అభిమానులు కూడా వచ్చారు. దర్శన అనంతరం సాయి తేజ్ వారితో ఫోటోలు దిగాడు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ మీడియాతో మాట్లాడాడు. అహోబిలం గుడికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు.
ఈ క్షేత్రం గురించి తాను చాలా విన్నానని, అహోబిలం ఆలయం ఎంతో ప్రశాంతతో అద్భుతంగా ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నాడు. ప్రతీ ఒక్కరూ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నానని సాయి తేజ్ చెప్పాడు. ప్రస్తుతం తాను సంబరాల ఏటిగట్టు అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్టు సాయి తేజ్ తెలిపాడు.
ఈ సందర్భంగా సాయి తేజ్ దగ్గర రాజకీయాల ప్రస్తావన తీసుకురాగా, తనకు రాజకీయాలతో పని లేదని, తాను ఈ పూటకు భోజనం చేస్తే చాలనుకుంటానని, తన ఆలోచన అలానే ఉంటుందని, నలుగురికి సాయం చేస్తూ, సినిమాలు చేసుకుంటూ, ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే తన పని అన్నాడు సాయి ధరమ్ తేజ్.
ఈ సందర్భంగా సాయి తేజ్ అందరికీ మరో ముఖ్యమైన మాటను కూడా విన్నవించుకున్నాడు. డ్రైవింగ్ చేసేటప్పుడు కచ్ఛితంగా హెల్మెట్ పెట్టుకోమని ప్రతీ ఒక్క హీరో అభిమానిని తాను కోరుతున్నట్టు సాయి తేజ్ చెప్పాడు. తనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ పెట్టుకుని ఉండకపోతే ఈ రోజు తాను ఉండేవాడే కాదని అన్నాడు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండటానికి ఏదైనా ఆటలు ఆడమని ఆయన సూచించాడు.