చరణ్-బన్ని విజయాలను చూసి అసూయ?
అదే మెగా కుటుంబం నుంచి వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి ప్రతిభావంతులు స్టార్లుగా రాణిస్తున్నారు.
By: Tupaki Desk | 26 Oct 2024 10:30 PM GMTచిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ త్రయం `మెగా బ్రదర్స్`గా ఇండస్ట్రీలో పాపులర్. అన్నదమ్ములు వారి రంగాల్లో అగ్రగణ్యులు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్, మేనల్లుడు (అల్లు అరవింద్ కుమారుడు) అల్లు అర్జున్ ప్రస్తుతం పరిశ్రమ అగ్ర హీరోలుగా వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. అదే మెగా కుటుంబం నుంచి వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి ప్రతిభావంతులు స్టార్లుగా రాణిస్తున్నారు.
అయితే నేటి జనరేషన్ లో చరణ్, అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్లుగా తమను తాము ఆవిష్కరించుకుని మెగా ఛరిష్మాను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. వారి స్థాయిని అందుకోవడం ఇప్పట్లో ఇతరుల వల్ల కాదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (ప్రస్తుతం సాయి దుర్ఘ తేజ్) బన్ని, చరణ్ ల ఎదుగుదలను చూసి అసూయ చెందుతారా? అని ప్రశ్నించగా, మేం నటులు అవుతామని ఎప్పుడూ ఊహించలేదని సాయిధరమ్ తెలిపారు. మొదట 9 - 5 సాధారణ ఉద్యోగం చేస్తానని నేను అనుకున్నాను. కానీ ఇంకా ఏదో సాధించాలనుకున్నాను. మా అందరి నటనా రంగ ప్రవేశం అనాలోచితంగా రొటీన్‌గా జరిగిందని అన్నారు. బన్ని, చరణ్ ల విజయాల పట్ల తనకు ఎలాంటి అసూయ కలగదని సాయి దుర్గ తేజ్ చెప్పాడు. ``వారి విజయానికి నేను అసూయపడను. ఎందుకంటే మేమంతా ఒకే మొక్కకు చెందిన పూలు. ఒకే మొక్క పువ్వులు పోటీపడవు.. అవి కలిసి వికసిస్తాయి`` అని స్పష్టం చేశారు.
కజిన్స్ ని కలిసినప్పుడు సరదా సంభాషణల్లో సినిమాల గురించి తప్ప ఇతర విషయాలన్నీ మాట్లాడుకుంటామని తెలిపాడు. సామాజిక సహకారం, ఆహారం, ఫ్యాషన్ వంటి వ్యక్తిగత ఆసక్తులు, అర్థవంతమైన చర్చలపై దృష్టి పెడతామని సాయి దుర్గ తేజ్ ఏబీపీ లైవ్ ఇంటర్వ్యూలో తెలిపారు. `బ్రో` సినిమాలో తన మామ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మామయ్యతో పనిచేయడం సంతోషంగా ఉంది. నా కెరీర్‌కు మార్గదర్శకంగా నిలిచిన ఆయనకు ఆ సినిమానే గురుదక్షిణ. అతడు నాకు చాలా సహాయం చేసాడు అని కూడా సాయి దుర్గ తేజ్ పేర్కొన్నాడు. 2021లో రిపబ్లిక్ మూవీ విడుదలకు ముందు సాయి పెద్ద మోటర్‌బైక్ ప్రమాదానికి గురై రెండు వారాల పాటు కోమాలోకి వెళ్లాడు. అతను 2023లో విరూపాక్ష అనే హారర్ చిత్రంతో తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.