మెగా మేనల్లుడి 10 ఏళ్ల సినీ ప్రయాణం!
ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టిన సుప్రీమ్ హీరో.. నేటితో ఫిలిం ఇండస్ట్రీలో 10 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు.
By: Tupaki Desk | 14 Nov 2024 4:20 PM GMTమెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారిలో ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఒకరు. 'మెగా' బ్రాండింగ్ తో హీరోగా పరిచయమైనప్పటికీ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకోడానికి తీవ్రంగా కష్టపడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఎన్నో విజయాలు అందుకున్నారు. ఇటీవలే 'సాయి దుర్గ తేజ్' గా పేరు మార్చుకున్నారు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టిన సుప్రీమ్ హీరో.. నేటితో ఫిలిం ఇండస్ట్రీలో 10 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు.
సాయి ధరమ్ తేజ్ ''పిల్లా నువ్వు లేని జీవితం'' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ వచ్చి ఈరోజుకి సరిగ్గా పదేళ్లు పూర్తయింది. ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ & శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై బన్నీ వాస్, హర్షిత్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. 2014 నవంబర్ 14న రిలీజైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. హీరోగా మెగా మేనల్లుడిని సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసింది. బెస్ట్ డెబ్యూ హీరోగా సైమా అవార్డు తెచ్చిపెట్టింది. ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో 10 సంవత్సరాల సెన్సేషనల్ కెరీర్‌కు నాంది పలికింది.
నిజానికి వైవీఎస్ చౌదరి తెరకెక్కించి 'రేయ్' సినిమాతో సాయి ధరమ్ తేజ్ హీరోగా బిగ్ స్క్రీన్ మీదకు రావాల్సింది. కానీ ఆర్థిక వ్యవహారాల కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వడంతో.. 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమా ముందుగా థియేటర్లలో రిలీజయింది. ఫస్ట్ మూవీ హిట్టయినప్పటికీ, తేజ్ కెరీర్ సాఫీగా సాగలేదు. ఆరంభంలోనే 'రేయ్' రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'సుప్రీమ్' సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించి అతన్ని హీరోగా నిలబెట్టాయి. ''సుప్రీమ్ హీరో" అనే బిరుదును సంపాదించిపెట్టాయి.
సాయి ధరమ్ తేజ్ తన దశాబ్దపు సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసాడు. కమర్షియల్ సక్సెస్ లు అందుకున్నాడు.. డిజాస్టర్లు కూడా రుచి చూశాడు. రెండేళ్ల గ్యాప్ లో ఆయనకు 'తిక్క' 'విన్నర్' 'జవాన్' 'నక్షత్రం' 'ఇంటిలిజెంట్' 'తేజ్ ఐ లవ్ యు' లాంటి అర డజను ప్లాప్స్ పడ్డాయి. వరుస పరాజయాలతో సతమతమవుతున్న టైములో 'చిత్రలహరి' సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన 'ప్రతిరోజూ పండగే' మూవీ కూడా కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన 'సోలో బ్రతుకే సో బెటర్' నిరాశ పరిచినా.. 'రిపబ్లిక్' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నటుడిగా తేజ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.
అయితే 'రిపబ్లిక్' విడుదలకు ముందు సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురయ్యారు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాక, కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్నాడు. మొక్కవోని ధైర్యంతో, దృఢ సంకల్పంతో దాన్నుంచి త్వరగా కోలుకొని తిరిగి షూటింగ్ లో పాల్గొన్నాడు. 'విరూపాక్ష' మూవీతో తన కెరీర్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత 'బ్రో' సినిమాతో తనకు ఎంతో ఇష్టమైన తన ఆరాధ్య గురువు, మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.
ఆన్-స్క్రీన్ విజయాల కంటే, సాయి ధరమ్ తేజ్ తన సేవా కార్యక్రమాలతో, హంబుల్ నేచర్, ఫ్రెండ్లీ యాటిట్యూడ్ తో అందరి మన్ననలు అందుకున్నాడు. తన తల్లి మీద ఉన్న ప్రేమానురాగాలతో ఆమె పేరుని జత చేసుకొని 'సాయి దుర్గ తేజ్' గా మారాడు. ప్రస్తుతం SDT18 వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. మెగా మేనల్లుడు పదేళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సాయి తేజ్ సైతం ఎక్స్ వేదికగా 'పిల్లా నువ్వు లేని జీవితం' అన్ సీన్ ప్రోమోని షేర్ చేసి, తన జర్నీని గుర్తు చేసుకున్నాడు.