లేడీ సూపర్ స్టార్ ను బీట్ చేసిన లేడీ పవర్ స్టార్
మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ తో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నారు.
By: Tupaki Desk | 4 March 2025 3:38 PM ISTఒకప్పుడంటే సినీ ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఉండేది. సినిమాలో పాత్ర ప్రాధాన్యం నుంచి రెమ్యూనరేషన్ వరకు అన్ని చోట్లా వారిదే డామినేషన్. కానీ మారుతున్న కాలంతో పాటూ సినీ ఇండస్ట్రీ కూడా అప్డేట్ అయిపోయింది. హీరోయిన్లను లీడ్ రోల్ లో పెట్టి సినిమాలు తీసి హిట్లు అందుకోవడం మొదలుపెట్టారు.
మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ తో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నారు. క్రమంగా హీరోయిన్ల రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో పెరిగింది. ఓ వైపు హీరోయిన్ల కొరతతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇబ్బందులు పడుతుంటే మరోవైపు స్టార్ హీరోయిన్లు మాత్రం కళ్లు చెదిరే రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు.
ఇప్పటివరకు సౌత్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతారకు పేరుంది. నయన్ తన క్రేజ్ తో ఎక్కువ పారితోషికం తీసుకునే రేంజ్ కు వెళ్లింది. బాలీవుడ్ లో నయన్ చేసిన మొదటి సినిమా జవాన్ కు ఏకంగా రూ.12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం. ఇప్పటివరకు సౌత్ నుంచి ఓ హీరోయిన్ అంత మొత్తంలో పారితోషికం తీసుకోవడం అదే మొదటిసారి.
అయితే రెమ్యూనరేషన్ విషయంలో ఇప్పుడు సాయి పల్లవి నయనతారను దాటుతుందని సమాచారం. ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ లో రామాయణ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రామునిగా కనిపించనుండగా, సాయి పల్లవి సీతగా కనిపించనుంది.
రామాయణ కోసం సాయి పల్లవి ఏకంగా రూ.15 కోట్లు ఛార్జ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా మొదటి భాగానికి మాత్రమే. అంటే రెండు భాగాలకు కలిపి రూ.30 కోట్లు. అయితే నిర్మాతలు కూడా పల్లవి అడిగినంత ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. సాయి పల్లవి నటించిన సినిమాల్లో ఎక్కువ భాగం విజయం సాధించినవి అవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ వార్తలు నిజమైతే మాత్రం సాయి పల్లవి రెమ్యూనరేషన్ విషయంలో నయనతాను అధిగమించినట్టే అవుతుంది. అయితే నయన్ ఈ అంశంలో నయన్ ఎప్పుడైనా మళ్లీ బౌన్స్ బ్యాక్ అయి టాప్ లో నిలబడే స్టామినా ఆమెకుంది.