బాలీవుడ్‌లో బుజ్జి తల్లి బిజీ బిజీ
ప్రస్తుతం సాయి పల్లవి దృష్టి మొత్తం బాలీవుడ్ సినిమాల ఉన్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి ప్రస్తుతం హిందీ రామాయణం సినిమాలో నటిస్తుంది.
By: Tupaki Desk | 24 Feb 2025 6:57 AM GMTనాగ చైతన్యతో కలిసి 'తండేల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి కొత్తగా తెలుగు సినిమాలకు కమిట్ కావడం లేదు. కోలీవుడ్‌లోనూ ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తుంది. కెరీర్ ఆరంభం నుంచి కూడా మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ వస్తున్న సాయి పల్లవి ఇప్పుడు కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతుంది. ఇబ్బడి ముబ్బడిగా సినిమాలకు కమిట్ కావడం లేదు. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతుంది. ప్రస్తుతం సాయి పల్లవి దృష్టి మొత్తం బాలీవుడ్ సినిమాల ఉన్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి ప్రస్తుతం హిందీ రామాయణం సినిమాలో నటిస్తుంది. సీత పాత్ర కోసం సాయి పల్లవి బల్క్ డేట్లు ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.
హిందీలో రామాయణం ప్రాజెక్ట్‌తో పాటు మరో సినిమాను సైతం సాయి పల్లవి కమిట్ అయింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా రూపొందుతున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ప్రకటించి చాలా కాలం అయినా జునైద్ ఖాన్ ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం వల్ల ఇన్నాళ్లు షూటింగ్ నత్త నడకన సాగింది. ఇటీవలే జునైద్ ఖాన్ నటించిన లవ్‌యాపా సినిమా విడుదలైంది. ఖుషీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన సినిమాకు లవ్ యాపా రీమేక్. హిందీ ప్రేక్షకులు లవ్‌యాపా ను తిరస్కరించారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ... తన ప్రాజెక్ట్‌ల ఫెయిల్యూర్ కంటే లవ్ యాపా సినిమా ఫెయిల్యూర్ తనకు ఎక్కువ బాధను కలిగించిందని అన్నారు. అయితే ఆ సినిమాలో జునైద్ ఖాన్ నటనతో పాటు, స్క్రీన్ ప్రజెన్స్ బాగున్నట్లు అమీర్ ఖాన్ పేర్కొన్నాడు. అతడి ఫిల్మ్ కెరీర్ గురించి తనకు ఎలాంటి అనుమానం లేదని, భవిష్యత్తులో కచ్చితంగా మంచి స్టార్‌డం దక్కించుకుంటాడనే నమ్మకంను, విశ్వాసంను అమీర్ ఖాన్ వ్యక్తం చేశారు. కొడుకుపై తండ్రికి ఇలా నమ్మకం ఉండటం సహజం. ప్రస్తుతం జునైద్ చేస్తున్న సినిమాపై అందరిలోనూ అంచనాలు ఉన్నాయి.
ఏ సినిమా చేసినా మినిమం హిట్‌ను సొంతం చేసుకుంటూ, తన నటనతో అందరినీ అలరిస్తున్న సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా కావడంతో జునైద్ ఖాన్ తదుపరి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జునైద్ ఖాన్, సాయి పల్లవి జంట రొమాంటిక్ లవ్ స్టోరీ కోసం హిందీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందీలో హిట్ అయితే తెలుగు, తమిళ్‌లోనూ డబ్ అయ్యి థియేట్రికల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సాయి పల్లవి ఒక వైపు రామాయణం సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు జునైద్ ఖాన్ సినిమాలోనూ సాయి పల్లవి నటిస్తోంది. మొత్తానికి బాలీవుడ్‌లో ఈ బుజ్జితల్లి బిజీ బిజీ.