నేషనల్ అవార్డుకు అమ్మమ్మ చీరతో ముడిపెట్టిన సాయి పల్లవి
అయితే రీసెంట్ గా సాయి పల్లవి నేషనల్ అవార్డు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
By: Tupaki Desk | 17 Feb 2025 6:30 PM GMTతన నటన, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సాయి పల్లవి ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఇట్టే ఒదిగిపోతుంది. ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న సాయి పల్లవి తాజాగా తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి అందరినీ మెప్పించింది. అయితే రీసెంట్ గా సాయి పల్లవి నేషనల్ అవార్డు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాను నేషనల్ అవార్డు కోసం ట్రై చేస్తున్నానని, దానికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉందని, తన అమ్మమ్మ చీర సెంటిమెంట్ ను రివీల్ చేసింది పల్లవి. తనకు 21 ఏళ్ల వయసున్నప్పుడు తన అమ్మమ్మ ఓ చీర ఇచ్చి, పెళ్లి చేసుకున్నప్పుడు అది కట్టుకోమని చెప్పిందని, అప్పటికి తానింకా సినిమాల్లోకి రాకపోవడంతో పెళ్లికే ఆ చీరను కట్టుకుందామనుకున్నట్టు సాయి పల్లవి చెప్పింది.
కానీ తర్వాత మూడేళ్లకు ఇండస్ట్రీలోకి వచ్చానని, తన ఫస్ట్ మూవీ ప్రేమమ్ కోసం వర్క్ చేశానని, ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఏదొక రోజు తప్పకుండా ఓ ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంటానని నమ్మానని, ఇండస్ట్రీలో నేషనల్ అవార్డే గొప్ప కదా అని, అందుకే ఆ అవార్డు దక్కించుకున్న రోజు అమ్మమ్మ చీర కట్టుకుని అవార్డు తీసుకోవడానికి హాజరవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది.
నేషనల్ అవార్డు అందుకున్నా అందుకోకపోయినా ఆ చీర ధరించే వరకు తనపై ప్రెజర్ ఉంటుందని సాయి పల్లవి తెలిపింది. అప్పట్లో సాయి పల్లవి నటించిన గార్గి సినిమాకు నేషనల్ అవార్డు వస్తుందని అందరూ అనుకున్నారు కానీ రాలేదు. తెరపై తాను పోషించే పాత్రలకు ఆడియన్స్ నుంచి దక్కే ప్రశంసల్నే తాను పెద్ద అవార్డుగా భావిస్తానని, అవి కాకుండా మరే ప్రశంస దక్కినా అది బోనస్ గానే భావిస్తానని చెప్తోంది సాయి పల్లవి.
ఇదిలా ఉంటే సాయి పల్లవి ప్రస్తుతం రణ బీర్ కపూర్ తో కలిసి బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణం సినిమాలో నటిస్తుంది. చిన్నప్పటి నుంచి పౌరాణిక సినిమాల్లో నటించాలని తనకెంతో ఆశ ఉండేదని, అందుకే రామాయణంలో ఆఫర్ రాగానే ఒప్పుకున్నట్టు సాయి పల్లవి తెలిపింది.