బుర్ఖాలో వెళ్లి సినిమాలు చూసేదాన్ని: సాయి పల్లవి
సాయి పల్లవి టాలెంట్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. పల్లవి ఒక పాత్రలో నటించిందంటే ఆ పాత్రకు ప్రాణం పోస్తుంది.
By: Tupaki Desk | 7 Feb 2025 10:30 PM GMTసాయి పల్లవి టాలెంట్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. పల్లవి ఒక పాత్రలో నటించిందంటే ఆ పాత్రకు ప్రాణం పోస్తుంది. ప్రతీ ఒక్కరినీ ఆ పాత్రతో ట్రావెల్ అయ్యేలా చేస్తుంది. అంత గొప్ప టాలెంట్ ఉంది తన నటనకి. తెలుగు, తమిళ భాషల్లో సాయి పల్లవికి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగు ప్రేక్షకులు సాయి పల్లవిని ముద్దుగా లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. ఆమె నటించిన తండేల్ సినిమా ఇప్పుడు థియేటర్లలో రిలీజై మంచి టాక్ ను తెచ్చుకుంది. ఈ సందర్భంగా సాయి పల్లవి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
సాయి పల్లవి తల్లి డ్యాన్సర్ కావడంతో ఆమెకు కూడా డ్యాన్స్ పట్ల ఇష్టం ఏర్పడింది. తెలుగు రియాలిటీ షో ఢీ4లో అమ్మడు తన స్టెప్పులతో అందరినీ అలరించింది. బాల నటిగా ఉన్నప్పుడే సాయి పల్లవి రెండు సినిమాల్లో నటించింది. చదువుకునే రోజుల్లోనే పల్లవికి హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఇంట్లో ఒప్పుకోకపోవడంతో సినిమాలకు దూరమైంది.
ఇక్కడే ఉంటే చదువు మానేసి సినిమాలపైనే ఫోకస్ చేస్తుందేమోనని ముందు చదువు పూర్తి చేయమని ఎంబీబీఎస్ చేయడానికి జార్జియాకు పంపారు ఆమె తల్లిదండ్రులు. సినిమాలు చూడ్డానికి ఎంతో ఇష్టపడే సాయి పల్లవి బుర్ఖాలో వెళ్లి మరీ సినిమాలు చూసేదట. పౌరాణిక సినిమాల్లో నటించాలనేది ఆమె చిరకాల కోరిక కావడంతోనే బాలీవుడ్ రామాయణంలో ఛాన్స్ రాగానే ఒప్పుకున్నట్టు సాయి పల్లవి వెల్లడించింది.
సాయి పల్లవి ధరించే జపమాల తన తాతయ్యదని అది వేసుకుంటే మంచి జరుగుతుందని ఆమె బాగా నమ్ముతుందట. చిన్నప్పటి నుంచి హీరో సూర్య అంటే తనకు క్రష్ అని, లైఫ్ లో ఒక్కసారైనా ఆయనతో కలిసి నటించాలని ఆశ పడేదట. ఆ కోరికను ఎన్జీకే సినిమాతో తీర్చుకున్నట్టు తెలిపింది. శ్యామ్ సింగరాయ్ సినిమాలోని దేవదాసీ పాత్రంటే తనకెంతో ఇష్టమట. ఆ సీన్స్ లో ఎరుపు రంగు బట్టలతో కాళ్లకు పారాణి పెట్టుకుని చేసే సీన్స్ ను ఎన్నో సార్లు చూసుకుంటుందట పల్లవి.
వ్యాయామాల పరంగా రోజూ జిమ్ కు వెళ్లని సాయి పల్లవి వారంలో రెండు మూడు రోజులు బ్యాడ్మింటన్ ఆడటంతో పాటూ ఖాళీ ఉంటే డ్యాన్స్ చేస్తుందట. తన కెరీర్ మొత్తంలో రౌడీ బేబీ, ఎంసీఏలో ఏవండోయ్ నాని గారు సాంగ్స్ కోసం వేసిన స్టెప్స్ కష్టమనిపించాయని పల్లవి చెప్పింది. అంతేకాదు, అమ్మడికి హార్రర్ సినిమాలన్నా, దెయ్యాలన్నా చాలా భయమట అందుకే హార్రర్ సినిమాల జోలికి అసలు వెళ్లదట. ఫుడ్ పరంగా చాక్లెట్స్, పెప్పర్ చికెన్, స్వీట్స్ అంటే ఎంతో ఇష్టపడే సాయి పల్లవికి వంట మాత్రం రాదట. వంట చేయాలనుకున్నా చేయలేనని అందుకే వెంటనే ఆర్డర్ చేసుకుని తినేస్తానని పల్లవి తెలిపింది.