సాయి పల్లవి ఫుల్ సీరియస్.. ఏమైంది?
ఇప్పుడు తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
By: Tupaki Desk | 12 Dec 2024 5:58 AM GMTస్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వరుస సినిమాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. రీసెంట్ గా అమరన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దివంగత మేజర్ ముకుంద వరదరాజన్ బయోపిక్ గా వచ్చిన ఆ సినిమాలో సాయి పల్లవి తన నటనతో అందరినీ ఫిదా చేశారు. తన నేచురల్ యాక్టింగ్ తో ఓ రేంజ్ లో ఆకట్టుకున్నారు.
ఇప్పుడు తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యతో పాటు సాయి పల్లవి లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ సినిమా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కానుంది. మూవీ నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన సాయి పల్లవి లుక్స్, గ్లింప్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని సత్తా చాటాయి.
తండేల్ లో డీగ్లామర్ రోల్ చేస్తున్న సాయి పల్లవి.. అదే సమయంలో బాలీవుడ్ రామాయణలో సీతగా నటిస్తున్నారు. ఇప్పటికే సాయి పల్లవి లుక్స్ లీక్ అయిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆ సినిమాను బాలీవుడ్ నిర్మాతలతో కలిసి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే రామాయణ మూవీ కోసం సాయి పల్లవి తన అలవాట్లు మార్చుకున్నారని కోలీవుడ్ కు చెందిన ఓ మీడియా సంస్థ రీసెంట్ గా వార్త ప్రచురించింది. మాంసాహారం మానివేశారని అందులో తెలిపింది. ఏ హోటల్ లో కూడా ఆమె తినడం లేదని, అంతే కాకుండా విదేశాలకు వెళ్ళినప్పుడు వంట వాళ్లను తీసుకువెళ్తున్నారంటూ తమ కథనంలో వెల్లడించింది. దీంతో సాయి పల్లవి ఫుల్ సీరియస్ అయ్యారు. గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఎలాంటి ఆధారం లేకుండా పోస్టులు పెడితే ఇకపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. తనపై ఎన్నో సార్లు రూమర్స్ వచ్చాయని, కానీ అలా వచ్చిన ప్రతిసారి కూడా తాను మౌనంగా ఉన్నట్లు గుర్తు చేశారు. దీంతో రూమర్స్ ను తెగ స్ప్రెడ్ చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన టైమ్ వచ్చిందని చెప్పారు. తనకు సంబంధించి ఎలాంటి నిరాధారమైన వార్త ప్రచురించినా.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సాయి పల్లవి తెలిపారు. సినిమా రిలీజులు, యాడ్స్, కెరీర్.. ఏ విషయంలోనైనా యాక్షన్ తీసుకుంటానని వెల్లడించారు. ఇన్నాళ్లు సహించానని, ఇక సహించనని తెలిపారు. ప్రస్తుతం సాయి పల్లవి పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.