Begin typing your search above and press return to search.

సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వంలో గోవింద న‌ట‌వార‌సుడు!

ఆయన 2014లో సంపూర్ణేష్ బాబు హీరోగా హృదయ కాలేయం సినిమాతో దర్శకుడిగా పరిచయమై, 2023లో బేబీ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు

By:  Tupaki Desk   |   19 Dec 2024 10:15 AM GMT
సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వంలో గోవింద న‌ట‌వార‌సుడు!
X

సాయి రాజేష్.ఎన్ తెలుగు సినిమా కథా రచయిత, దర్శకుడు. ఆయన 2014లో సంపూర్ణేష్ బాబు హీరోగా హృదయ కాలేయం సినిమాతో దర్శకుడిగా పరిచయమై, 2023లో బేబీ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. న‌వ‌త‌రం న‌టీన‌టుల‌తో అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `బేబి` 100 కోట్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. అలాగే జాతీయ ఉత్త‌మ సినిమా `క‌ల‌ర్ ఫోటో`(2020)కి అత‌డు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

ఇప్పుడు సాయిరాజేష్ ప్ర‌ముఖ బాలీవుడ్ హీరో గోవింద కుమారుడు య‌శ్వ‌ర్థ‌న్ అహూజాను వెండితెర‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఒక ప్రత్యేకమైన ప్రేమకథతో యశ్వర్ధన్ బిగ్ బ్రేక్ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమాని మధు మంతెన- అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో SKN ఫిల్మ్స్ నిర్మించ‌నుంది. ప్ర‌స్తుతం క‌థానాయిక‌ను ఎంపిక చేసే ప్ర‌క్రియ మొద‌లైంద‌ని తెలిసింది.

కొత్త కుర్రాడు య‌శ్వ‌ర్థ‌న్ స‌ర‌స‌న కొత్త‌మ్మాయినే క‌థానాయిక‌గా ఎంపిక చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. న‌టీనటుల‌ను ఎంపిక చేయడానికి ద‌ర్శ‌క‌నిర్మాతలు దేశవ్యాప్తంగా సెర్చ్ నిర్వహిస్తున్నారు. కాస్టింగ్ ఏజెంట్ ముఖేష్ ఛబ్రా నటీనటుల ఎంపికను కొన‌సాగిస్తున్నారు. 14 వేల‌కు పైగా ఆడిషన్ క్లిప్‌లు సేక‌రించిన టీమ్ న‌టీన‌టుల‌ను జ‌ల్లెడ ప‌డుతోందట‌. ఈ ప్రేమ‌క‌థా చిత్రం కోసం అద్భుత‌మైన మ్యూజిక్ ఆల్బమ్‌ను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. రొమాంటిక్ చిత్రాలలో సంగీతానికి ప్రాధాన్యత చాలా ఎక్కువ‌. మ్యూజిక్ ఆల్బ‌మ్ స‌క్సెసైతే స‌గం విజ‌యం ద‌క్కిన‌ట్టే. ప్రేమక‌థా చిత్రాల‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ట్రాక్‌లను రూపొందించాలని సాయి రాజేష్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలిసింది. ఈ సినిమా షూటింగ్ 2025 వేస‌విలో ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది.