సాయి ధరమ్ తేజ్.. లేటైనా సాలీడ్ నిర్మాతే దొరికాడు!
సినీ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 2 April 2024 5:52 AM GMTమెగా కాంపౌండ్ నుండి వచ్చిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్(సాయి దుర్గ తేజ్).. రోడ్డు ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష మూవీతో భారీ హిట్ కొట్టారు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. అనంతరం మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమా చేయగా.. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది.
ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క చిత్రాన్ని కూడా విడుదల చేయలేదు సాయి ధరమ్ తేజ. గత ఏడాది దర్శకుడు సంపత్ నందితో కలిసి గంజా శంకర్ సినిమా ప్రకటించారు. అయితే ఆ మూవీ టైటిల్.. వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కు చెందిన కొందరు అధికారులు గంజా శంకర్ టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. బడ్జెట్ సమస్య కూడా ఉన్నట్లు టాక్ వినిపించింది.
ఆ మధ్య సాయి ధరమ్ తేజ్.. ఓ మీడియా సమావేశంలో గంజా శంకర్ సినిమా ఉందా ఆగిపోయిందా అన్న విషయం తనకు తెలియదని చెప్పి షాక్ ఇచ్చారు. మీరు (మీడియా) చెబితేనే తెలుస్తుందన్నారు. ముఖ్యంగా కొన్ని వెబ్ సైట్లలో చూశాక ఆ విషయం తెలిసిందని, ఏదైనా మీరు చెప్తే తెలుస్తుందని పరోక్షంగా సెటైర్లు వేశారు. కానీ ఇప్పటి వరకు ఆ సినిమా షూటింగ్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. కాబట్టి ఈ మూవీని పక్కన పెట్టినట్లు అర్థమవుతోంది.
సినీ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. హనుమాన్ చిత్ర నిర్మాత కె. నిరంజన్ రెడ్డితో మెగా మేనల్లుడు సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీని ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యిందట. ఇక త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా మొదలుకానున్నట్లు టాక్.
ఈ సినిమాకు గాను సాయి ధరమ్ తేజ్ కు సాలీడ్ రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట నిరంజన్ రెడ్డి. ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు విషయంలో త్వరలోనే ఒక అఫీషియల్ క్లారిటీ రానుంది. అయితే నిరంజన్ రెడ్డి.. నితిన్ తో కూడా సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ మూవీని నిరంజన్ రెడ్డి రూపొందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి హనుమాన్ నిర్మాత.. కొత్త చిత్రాలతో ఎలాంటి హిట్లు కొడతారో చూడాలి.