సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు ఘటన.. బెయిల్ కోసం పాట్లు..
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తిపోట్ల కేసులో నిందితుడికి ఇంకా బెయిల్ రాలేదు. అతడు బెయిల్ కోసం కోర్టులో అర్థిస్తున్నాడు.
By: Tupaki Desk | 29 March 2025 7:55 AMబాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తిపోట్ల కేసులో నిందితుడికి ఇంకా బెయిల్ రాలేదు. అతడు బెయిల్ కోసం కోర్టులో అర్థిస్తున్నాడు. బాంద్రా ఇంట్లో దొంగతనం ప్రయత్నం సందర్భంగా నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతిఘటించగా, తనపై దాడి చేసాడంటూ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ పై కేసు పెట్టారు. అతడు ముంబై సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. తన న్యాయవాది అజయ్ గవాలి ద్వారా సమర్పించిన తన పిటిషన్‌లో షెహజాద్ తాను నిర్దోషినని, తనపై కేసు కల్పితమని పేర్కొన్నాడు. ఎఫ్‌ఐఆర్ సరిగ్గా నమోదు చేయలేదని బెయిల్ దరఖాస్తులో ఆరోపించాడు.
షెహజాద్ దర్యాప్తునకు పూర్తిగా సహకరించాడని, అన్ని ఆధారాలు ఇప్పటికే పోలీసుల వద్ద ఉన్నాయని, దీనివల్ల ఎలాంటి ట్యాంపరింగ్ జరగడం అసాధ్యమని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు ప్రస్తుతం బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత దీనిని సెషన్స్ కోర్టుకు బదిలీ చేస్తారు. తాజా సమాచారం మేరకు... బాంద్రా పోలీసులు ఇంకా చార్జిషీట్ సమర్పించలేదు.
జనవరిలో జరిగిన దాడిలో సైఫ్ కి పలు చోట్ల గాయాలయ్యాయి. సైఫ్ ఖాన్ ఇంట్లో దొంగతనం చేసే సమయంలో సైఫ్ ప్రతిఘటించగా.. షెహజాద్ అతడిపై దాడి చేసాడు. ఛాతీ వెన్నెముక శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సైఫ్ ని లీలావతి ఆసుపత్రికి తరలించగా ఐదు రోజులు చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి బయటపడిన జనవరి 21న డిశ్చార్జ్ అయ్యాడు. ఫిబ్రవరిలో ముంబై పోలీసులు అరెస్టు చేసిన నిందితుడిపై తమ వద్ద తగినంత ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అతడు బంగ్లాదేశ్ నుండి భారతదేశంలోకి ప్రవేశించి ముంబైకి వచ్చే ముందు కోల్‌కతాలోని పలు చోట్ల ఉన్నాడని కూడా అధికారులు ధృవీకరించారు.
అయితే ఈ కేసులో నిందితుడు వేరొకరు ఉన్నారని, ఇతడి వేలి ముద్రలతో ఘటనా స్థలంలోనివి సరిపోలడం లేదని కూడా కథనాలొచ్చాయి. అయితే దీనిని అదనపు పోలీసు కమిషనర్ పరంజిత్ సింగ్ దహియా ఖండించారు. నిందితుడి వేలిముద్రలు సరిపోలడం లేదనే పుకార్లను కమీషనర్ తోసిపుచ్చారు. ఏదైనా కేసులో ఇలాంటి పుకార్లు సహజమని నిందితుడి ప్రమేయానికి సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించామని తెలిపారు. సాంకేతికంగా భౌతికంగా మేము సరైన వ్యక్తిని పట్టుకున్నాము అని ఆయన అన్నారు.