Begin typing your search above and press return to search.

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ఐదు సందేహాలు

సైఫ్ భవనం లోపల కానీ బ‌య‌ట కానీ నిరంతరం సీసీటీవీ నిఘాలో ఉంటుంది. ఆ భ‌వ‌నంలోని నివాసితులలో విదేశీ దౌత్యవేత్తలు కూడా ఉన్నారని క‌థ‌నాలొచ్చాయి.

By:  Tupaki Desk   |   27 Jan 2025 5:16 PM GMT
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ఐదు సందేహాలు
X

చాలా కాలం క్రితం దివ్య‌భార‌తి, ప్ర‌త్యూష వంటి తార‌ల మ‌ర‌ణాలు అనుమానాస్ప‌ద మ‌ర‌ణాలుగా రికార్డుల‌కెక్కాయి.ఐదు సంవత్సరాల క్రిత యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణం దేశాన్ని కుదిపేసింది. నేటికీ అతడి మరణం ఒక‌ మిస్టరీగానే మిగిలి ఉంది. సీబీఐ సహా ఐదు వేర్వేరు ద‌ర్యాప్తు సంస్థలు ప‌రిశోధించినా ఇది హత్య లేదా ఆత్మహత్య అనేది నిర్ధార‌ణ కాలేదు. ఇవ‌న్నీ ముగింపు అన్న‌దే లేని కేసులుగా మిగిలాయి.

సుశాంత్ కేసులానే సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసును పరిశీలిస్తే సమాంతరంగా స‌న్నివేశం క‌నిపిస్తోంది. ఈ రెండిటిలోను బాలీవుడ్ తార‌ల ప్ర‌మేయం ఉంది.. రెండిటిపైనా రాజ‌కీయ బుర‌ద జ‌ల్లారు. లెక్క‌లేన‌న్ని సిద్ధాంతాలు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఈ కేసును చాలామంది నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. పోలీసుల క‌థ‌నాల‌పై సందేహాలు లేవ‌నెత్తుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ కేసును క్లిష్టతరం చేసిన‌ ఐదు కీలక విష‌యాలు ఇలా ఉన్నాయి.

పోలీసుల క‌స్ట‌డీలో ఉన్న బంగ్లాదేశ్ వ్యక్తి నిజమైన నిందితుడా? కాదా అనేది మొద‌టి సందేహం. సంఘటన జరిగిన రోజు విడుదలైన సీసీటీవీ ఫోటో పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తికి భిన్నంగా ఉంది. ఈ ఫుటేజ్‌లో నిందితుడు చిన్నవాడిగా అందంగా కనిపిస్తున్నాడు. అయితే అరెస్టు చేసిన వ్యక్తి పెద్దవాడిగా, ముదురు రంగులో ఉన్నాడు. ఇద్ద‌రి ముఖ క‌వ‌ళిక‌లు వేరు. అలాగే దాడి తర్వాత షరీఫుల్ వేరే రాష్ట్రానికి పారిపోయే బదులు థానేలోని మడ అడవుల్లో దాక్కున్నాడనే వాదన సందేహాలను లేవనెత్తుతుంది. కేసును పరిష్కరించడానికి లేదా ఎవ‌రినో కాపాడటానికి తీవ్ర ఒత్తిడిలో పోలీసులు తొందరపడి తప్పు చేయలేదని భావించాలి.

సైఫ్ భవనం లోపల కానీ బ‌య‌ట కానీ నిరంతరం సీసీటీవీ నిఘాలో ఉంటుంది. ఆ భ‌వ‌నంలోని నివాసితులలో విదేశీ దౌత్యవేత్తలు కూడా ఉన్నారని క‌థ‌నాలొచ్చాయి. ఇది హై-సెక్యూరిటీ జోన్‌. సైఫ్ ఫ్లాట్‌లోకి ప్రవేశించడానికి బయోమెట్రిక్ స్కాన్ అవసరం. కానీ షరీఫుల్ భవనం డక్ట్ ఎక్కి బాత్రూమ్ కిటికీ గుండా ప్రవేశించాడనే పోలీసుల వాదనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది అత‌డు ఏమైనా స్పైడర్‌మ్యాన్ అయి ఉంటాడా? అంటూ జోకులేస్తున్నారు. అది సైఫ్ ఇల్లు అని తనకు తెలియదని నిందితుడు పేర్కొన్నాడు. 10 అంత‌స్తులు వ‌దిలేసి అత‌డు కేవ‌లం సైఫ్ ఉంటున్న అంత‌స్తుకే ఎందుకు వెళ్లాడు? అనే సందేహం అలానే ఉంది.

దొంగతనం అసలు ఉద్దేశమా కాదా? అంటే సైఫ్ భార్య కరీనా కపూర్ తన నగలు బ‌య‌టే క‌నిపిస్తున్నా వాటిని క‌నీసం తాకకుండా వదిలేశారని చెప్పింది. న‌గ‌ల దొంగ‌త‌నానికి బ‌దులుగా, అగంత‌కుడు తమ పనిమనిషిని కత్తితో బెదిరించి రూ.1 కోటి డిమాండ్ చేసాడు. ఆ త‌ర‌వాత ఖాళీ చేతుల‌తోనే ప‌రిగెత్తుకు వెళ్లాడ‌ని చెప్పింది. సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుడు భయంతో పారిపోకుండా ప్రశాంతంగా మెట్లు దిగుతున్నట్లు కనిపిస్తోంది. ఇది దొంగ‌త‌నం కోస‌మేనా? లేక ఈ క‌థ‌లో పైకి క‌నిపించ‌ని కోణం ఇంకేదైనా ఉందా? అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

నిందితుడు దాడికి ఉప‌యోగించిన‌ది హెక్సాబ్లేడ్ లేదా కత్తి? అన్న‌ది తేల‌లేదు. సైఫ్ పనిమనిషి మొదట్లో దాడి చేసిన వ్యక్తి హెక్సాబ్లేడ్ తెచ్చాడ‌ని పేర్కొంది. కానీ సైఫ్ గాయాలు చూశాక‌ కత్తితో జ‌రిగిన దాడి అని అర్థ‌మైంది. షరీఫుల్ కూడా కత్తిని ఉపయోగించినట్లు అంగీకరించాడు. ఆయుధం విష‌యంలో ఒక్కొక్క‌రి మాట ఒక్కోలా ఉండ‌డం గందరగోళాన్ని మరింత పెంచింది.

దాడి జరిగిన ఐదు రోజుల తర్వాత సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రి నుండి బయటకు నడుస్తున్న దృశ్యాలు ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా కనిపించారు. చేతికి నల్లటి బ్యాండ్ తప్ప, రక్తంతో తడిసిపోయి ఆసుపత్రికి తరలించినట్లుగా క‌నిపించ‌లేదు. సైఫ్ పై జరిగిన దాడి నిజమైనదా లేదా అతిశయోక్తి కోస‌మా? అని శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ , బిజెపి మంత్రి నితేష్ రాణే ప్రశ్నించడంతో ఊహాగానాలు పెరిగాయి.

ప్ర‌స్తుతానికి పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడి దుస్తులను సైఫ్ రక్తంతో సరిపోల్చడానికి వేలిముద్రల‌ విశ్లేషణ, రక్త నమూనా పరీక్షలు వంటి కీలక ఆధారాలు ఇంకా రిపోర్ట్ లు రావాల్సి ఉంది. పోలీసులు తమ వెర్షన్‌ను అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. ఈ లోగానే చాలా త‌ప్పుడు స‌మాచారం బ‌య‌ట‌కు వెళుతోంది. ఈ కేసును కూడా సాగ‌దీస్తూ చివ‌రికి నీరుగారిస్తారా? అన్న‌ది కూడా వేచి చూడాలి.