Begin typing your search above and press return to search.

సైఫ్ కేసు... ఫస్ట్ అనుమానితుడి లైఫ్ ని పోలీసులు నాశనం చేశారా?

అవును... బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై తన నివాసంలో జరిగిన దాడిలో తొలుత ఓ అనుమానితుడిని ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ లో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Jan 2025 3:41 AM GMT
సైఫ్  కేసు... ఫస్ట్  అనుమానితుడి లైఫ్  ని పోలీసులు నాశనం చేశారా?
X

కొన్ని సందర్భాల్లో పోలీసులు తీసుకునే నిర్ణయాల వల్ల చాలా మంది జీవితాలు వారి ప్రమేయం ఏమాత్రం లేకుండా ఒక్కసారిగా గతి తప్పి పోతుంటాయని అంటారు! ఈ క్రమంలో తాజాగా సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తొలి అనుమానితుడి పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైపోయిందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై తన నివాసంలో జరిగిన దాడిలో తొలుత ఓ అనుమానితుడిని ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ లో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే... విచారణలో ఇతడు అసలు నిందితుడు కాదని తేలడంతో పోలీసులు అతడిని వదిలిపెట్టారు. అయితే.. ఈ లోపు అతడి పేరు ఆకాశ్ (31) అని ఫోటోలు వైరల్ గా మారాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై ఆకాశ్ కనోజియా స్పందించాడు. ఈ వ్యవహారం తన లైఫ్ ఎలా టర్న్ అయిపోయిందని చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆ కేసులో ప్రధాన అనుమానితుడిగా పేర్కొంటూ మీడియాలో తన ఫోటోలు రావడంతో.. అవి చూసిన తన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారని తెలిపాడు.

ఈ సమయంలో తనకు కాబోయే భార్యను కలిసేందుకు వెళ్తున్న క్రమంలో దుర్గ్ లో తనను అదుపులోకి తీసుకొని రాయ్ పూర్ కు తరలించారని.. అక్కడకు వచ్చిన ముంబై పోలీసులు తనపై దాడి కూడా చేశారని ఆకాశ్ వాపోయాడు. అయితే.. ఆ నిందితుడు తాను కాదని తెలుసుకున్న తర్వాత తనను వదిలిపెట్టారని.. ఈ లోపు తన జీవితంలో జరగకూడనివన్నీ జరిగిపోయాయని అంటున్నాడట!

ఇందులో భాగంగా... ఈ విషయం మీడియాలో రావడంతో తన ఉద్యోగం కూడా పోయిందని.. తనతో వివాహం వద్దని అమ్మాయి తరుపు కుటుంబ సభ్యులు నిశ్చయించుకున్నరని చెప్పాడు. ఇలా ముంబై పోలీసులు చేసిన ఒక తప్పిదం తన జీవితాన్ని నాశనం చేసిందని ఆకాశ్ పేర్కొన్నారు. సీసీటీవీలో కనిపించిన వ్యక్తి తాను కాదని పోలీసులు గ్రహించలేకపోయారని తెలిపాడు.

సీసీటీవీలో కనిపించిన నిందితుడికి మీసాలు లేవని, అయితే తనకు ఉన్నాయని.. ఈ విషయం పోలీసులు గుర్తించడంలో ఫెయిల్ అవ్వడంతో తన లైఫ్ ఒక్కసారిగా మారిపోయిందని వాపోయాడు. ఈ నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయంపై సైఫ్ ఇంట బయట నిల్చొని ఉద్యోగం కోసం వేడుకోవాలని యోచిస్తున్నానని అన్నాడు.

కాగా ముంబై నుంచి కోల్ కతా వెళ్తున్న ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఆకాశ్ ను ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ స్టేషన్ లో రైల్వే పోలీసులు సిబ్బంది అరెస్ట్ చేసి విచారించారు. ఆ మరుసటి రోజే బంగ్లాదేశ్ కు చెందిన షరిఫుల్ ఇస్లాం ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆకాశ్ ను వదిలిపెట్టారు. ఈ గ్యాప్ లో తన జీవితం పూర్తిగా మారిపోయిందని అతడు వాపోతున్నాడు!