Begin typing your search above and press return to search.

కారు రెడీగా లేదు.. గాయాల‌తో ఆటోలో సైఫ్‌ ఆస్ప‌త్రికి

గురువారం రాత్రి జరిగిన దుండ‌గుడి కత్తి దాడితో తీవ్రంగా రక్తస్రావం అవుతున్న సైఫ్ ఖాన్‌ను అతడి పెద్ద కుమారుడు ఇబ్రహీం ఆటో రిక్షాలో లీలావతి ఆసుపత్రికి తరలించారు

By:  Tupaki Desk   |   16 Jan 2025 4:42 PM GMT
కారు రెడీగా లేదు.. గాయాల‌తో ఆటోలో సైఫ్‌ ఆస్ప‌త్రికి
X

గురువారం రాత్రి జరిగిన దుండ‌గుడి కత్తి దాడితో తీవ్రంగా రక్తస్రావం అవుతున్న సైఫ్ ఖాన్‌ను అతడి పెద్ద కుమారుడు ఇబ్రహీం ఆటో రిక్షాలో లీలావతి ఆసుపత్రికి తరలించారు. 23ఏళ్ల‌ ఇబ్రహీం ఘ‌ట‌న అనంత‌రం ధైర్యంగా స్పందించాడు. అత‌డు త‌న తండ్రిని ర‌క్షించేందుకు ఆస్ప‌త్రికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నా కానీ, వెంట‌నే కారు దొరకకపోవడంతో ఆటో ఎక్కించి తీసుకుని వెళ్లాడు. సమయం వృధా చేయకూడదని నిశ్చయించుకుని ఇబ్రహీం ఆటో రిక్షాలో బాంద్రా ఇంటి నుండి సైఫ్ ను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.

దాడి జరిగిన అనంత‌రం తీసిన వీడియోలో సైఫ్‌ ఖాన్ భార్య, నటి కరీనా కపూర్ ఖాన్ ఆటో రిక్షా పక్కన నిలబడి ఇంటి సిబ్బందితో మాట్లాడుతూ క‌నిపించిన‌ట్టు ఎన్డీటీవీ త‌న క‌థ‌నంలో పేర్కొంది. 54ఏళ్ల సైఫ్‌ప్ర‌స్తుతం సేఫ్‌. ఆరు క‌త్తిపోట్లు అత‌డి శ‌రీరంలోకి దిగాయి. ప్ర‌స్తుతం వైద్యులు శ‌స్త్ర చికిత్స‌లు చేస్తున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులందరూ సురక్షితంగా ఉన్నారని వారి టీమ్ ప్రకటనలో పేర్కొంది.

దర్యాప్తులో దొంగ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దొంగతనం చేయడానికి ప్రవేశించాడని తేలిందని పోలీసులు తెలిపారు.

దాడి జరగడానికి రెండు గంటల ముందు సైఫ్ ఖాన్ ఇంట్లోని సీసీటీవీ కెమెరాలు ప‌రిశీలిస్తే, ఎవరూ ఆ ప్రాంగణంలోకి ప్రవేశించిన‌ట్టు కనిపించలేదు. అంటే సైఫ్ ఖాన్ పై దాడి చేసిన వారు ముందుగా భవనంలోకి ప్రవేశించి దాడి చేయడానికి ప‌క్కా ప్లాన్డ్ గా వేచి ఉన్నారని భావిస్తున్నారు. దుండ‌గుడు ఎవ‌రో తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను స్కాన్ చేయ‌గా అందులో ఒక వ్య‌క్తి ఫోటో బ‌య‌ట‌ప‌డింది.

దాడి చేసిన వ్యక్తికి సైఫ్ ఖాన్ ఇంట్లో ప‌ని చేసే సహాయకులలో ఒకరితో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. ఆ స‌మ‌యంలో అతడు కూడా సైఫ్‌ ఇంట్లోకి ప్రవేశించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబైలోని అత్యంత సంపన్న ప్రాంతంలో ఈ దాడి అంద‌రినీ భ‌య‌పెడుతోంది. ప్ర‌స్తుతం పోలీసులు విచార‌ణ వేగ‌వంతం చేసారు. అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ ఘ‌ట‌న అనంత‌రం ప్రతిపక్షం ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర దాడి చేసింది. ప్రముఖులపై ఇలా దాడి జరిగితే సాధారణ ముంబైకర్ల ప‌రిస్థితి సుర‌క్షిత‌మేనా? అని ప్రశ్నించింది.