సైఫ్ దాడి కేసు: గార్డులు పనోళ్ల ఉద్యోగం పోయినట్టేనా?
ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నిద్రపోతున్న విషయం గమనించాకే ఇంటి ప్రధాన ద్వారం గుండా నిందితుడు భవనంలోకి ప్రవేశించాడని పోలీసులు నిర్ధారించారు.
By: Tupaki Desk | 22 Jan 2025 3:45 AM GMTసైఫ్ అలీఖాన్ పై అగంతకుడి దాడి కేసులో గార్డులు, మగ పనివాళ్ల నిర్లక్ష్యం ప్రధాన పాత్ర పోషించిందని అర్థమవుతోంది. నిజానికి ఆ రాత్రి బాంద్రా ఇంటి కి కాపలా కాస్తున్న గార్డులు మేల్కొన్నా, లేదా మగ పనివాళ్లు సైఫ్ ని రక్షించేందుకు వెంటనే స్పందించినా అంత ప్రమాదం జరిగి ఉండకపోవచ్చని పోలీసులు చెబుతున్నారు.
ముంబై పోలీసులు మంగళవారం సత్గురు శరణ్ భవనంలో నేరస్థలాన్ని పునఃసృష్టించినప్పుడు ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. సైఫ్ ఖాన్ (54) తన భార్య నటి కరీనా కపూర్ .. ఇద్దరు పిల్లలు తైమూర్ - జెహ్ లతో నివసిస్తున్నాడు. జనవరి 16న ఈ దాడి జరిగింది. నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ అలియాస్ విజయ్ దాస్ 12 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి, గొడవ జరిగాక సైఫ్‌ని పదేపదే పొడిచాడు.
ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నిద్రపోతున్న విషయం గమనించాకే ఇంటి ప్రధాన ద్వారం గుండా నిందితుడు భవనంలోకి ప్రవేశించాడని పోలీసులు నిర్ధారించారు. ఒక గార్డు క్యాబిన్‌లో .. మరొకరు ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నారు. ఇద్దరూ నిద్రమత్తులో ఉన్నారు. దీంతో దుండగుడు ఇబ్బంది లేకుండా లోనికి వెళ్లాడు. భవనం కారిడార్‌లో సిసిటివి కెమెరాలు లేకపోవడం, ప్రధాన ద్వారం దగ్గర నిఘా లేకపోవడం వల్ల ఫకీర్ తన షూలను నిశ్శబ్దంగా తీసేసి, శబ్దం చేయకుండా ఉండటానికి తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసాడు. లోనికి వెళ్లేప్పుడు ఒక సరిహద్దు గోడను దుండగుడు దాటాడు.
ముంబై పోలీసులు నిందితుడు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను బాంద్రాలోని సైఫ్ నివాసానికి తీసుకెళ్లి నేరం ఎలా జరిగిందో దానిని సీన్ రీక్రియేట్ చేసారు. సైఫ్ నివసిస్తున్న భవనంలోని 12వ అంతస్తుకు తీసుకెళ్లి ఆ తర్వాత ఎలా తప్పించుకున్నాడో తెలుసుకోవడానికి అతడిని గార్డెన్ బిల్డింగ్‌కు తీసుకెళ్లారు. ఆ భవనంలోని సీసీటీవీ కెమెరాల నుంచి దాదాపు రెండు గంటల పాటు అతడు ఎలా తప్పించుకోగలిగాడని పోలీసులు ప్రశ్నించారు. సైఫ్ ఇంట్లోని పలు చోట్ల అతడి వేలిముద్రలను కూడా తీసుకున్నారు. ఈ వేలిముద్రలు నేరస్థలంలో బాత్రూమ్ కిటికీ, అతడు ప్రవేశించిన, బయటకు వెళ్ళిన తలుపు, డక్ట్ షాఫ్ట్ , డక్ట్ ద్వారా భవనంలోకి ప్రవేశించడానికి అతడు ఉపయోగించిన నిచ్చెనపైనా లభించాయి.
స్థానిక పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ `సత్గురు శరణ్` భవనాన్ని సందర్శించి, దర్యాప్తులో భాగంగా వేలిముద్రలను సేకరించారు. ఫోరెన్సిక్ బృందం కూడా భవనాన్ని సందర్శించింది. కింది అంతస్తులో సంఘటన జరిగినప్పుడు ఇంటి పై అంతస్తులో నలుగురు మేల్ సిబ్బంది ఉన్నారని, దుండగుడు సైఫ్ ఖాన్ పై కత్తితో దాడి చేసేప్పుడు వారంతా తెల్లమొహం వేసి వినోదం చూసారు కానీ, ప్రతిఘటించలేదని, దుండగుడిని ఆపేందుకు ప్రయత్నించలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు మహిళా సిబ్బంది ధైర్యంగా వ్యవహరించి నిందితుడిని ఒక గదిలో బంధించి సైఫ్‌ను కాపాడారు. మగ సిబ్బంది వెంటనే స్పందించి ఉంటే సైఫ్ కి అన్ని గాయాలు అయ్యేవి కావని పోలీసులు వెల్లడించారు.