Begin typing your search above and press return to search.

సైఫ్ ఖాన్ కత్తిపోటు కేసు: ఆగంత‌కుడి గుర్తింపు టెస్ట్

ఈ గుర్తింపు త‌ర్వాత స‌మ‌స్య ప‌రిష్కారం మ‌రింత సులువు కానుంది.

By:  Tupaki Desk   |   6 Feb 2025 10:37 AM GMT
సైఫ్ ఖాన్ కత్తిపోటు కేసు: ఆగంత‌కుడి గుర్తింపు టెస్ట్
X

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు కేసులో తాజా ప‌రిణామం చ‌ర్చ‌గా మారింది. ఈ కేసులో నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ కోసం ముంబై పోలీసులు ఆర్థర్ రోడ్ జైలులో గుర్తింపు పరేడ్ నిర్వహించారు. సాక్షులు నిందితుడిని గుర్తించారు. పోలీసులు త‌మ‌కు సిసిటివి ఫుటేజ్ , ముఖ గుర్తింపు పరీక్ష సహా బలమైన ఆధారాలు అభించాయ‌ని చెబుతున్నారు. ఈ గుర్తింపు త‌ర్వాత స‌మ‌స్య ప‌రిష్కారం మ‌రింత సులువు కానుంది.

అధికారుల దర్యాప్తు ప్రకారం.. షరీఫుల్ ఇస్లాం షెహజాద్ దొంగ‌త‌నం చేయాలనే ఉద్దేశ్యంతో మాత్ర‌మే బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి ప్ర‌వేశించాడు. అయితే అతడి ప‌థకం పార‌లేదు. అనుకున్న‌ది అనుకున్నట్లుగా జరగలేదు. సైఫ్ ఖాన్ ధైర్యంగా అత‌డిని ప్ర‌తిఘ‌టించ‌డంతో అది గందరగోళానికి కార‌ణ‌మైంది. ఈ గ‌డ‌బిడ‌లోనే సైఫ్ కి గాయాలు అయ్యాయి.

దాదాపు ప‌ది నిమిషాల పాటు జరిగిన గుర్తింపు పరేడ్‌లో సైఫ్ అలీ ఖాన్ సిబ్బంది నుంచి ఎలియమ్మ ఫిలిప్ , ఇంటి సహాయకుడు జును హాజరయ్యారు. వారు నిందితుడిని గుర్తించారు. నిందితుడికి నేరంతో సంబంధం ఉంద‌ని నిరూపించే బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇందులో సీసీటీవీ ఫుటేజ్, పాజిటివ్ ఫేషియల్ రికగ్నిషన్ టెస్ట్ కూడా ఉన్నాయి. ఈ పరేడ్‌ను తహసీల్దార్ అత‌డి స‌హాయ‌కుల‌ సమక్షంలో నిర్వహించారు. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్న వారం తర్వాత గుర్తింపు పరేడ్ జరిగింది. ఈ ప‌రేడ్ లో ప‌ది మంది వేర్వేరు ప‌నిమ‌నుషులపై విచార‌ణ సాగించ‌గా, ష‌రీఫుల్ ఎవ‌రో గుర్తించారు.

ఇంత‌కుముందు ముంబై పోలీసులు నిందితుడి ముఖ గుర్తింపు పరీక్ష నిర్వహించారు. మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అస‌లైన నిందితుడు అని ఫేస్ రిక‌గ్నిష‌న్ తేల్చి చెప్పింది. అతడి ముఖ గుర్తింపు పాజిటివ్‌గా తేలింది. పరీక్ష ప్రకారం.. సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్న వ్యక్తి , మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ఒకే వ్యక్తి ఒక‌రేన‌ని తేలిందని పోలీసులు తెలిపారు.

భారతీయ న్యాయ్ సంహిత (బిఎన్‌.ఎస్‌) సెక్షన్ 311, 312, 331(4), 331(6), మరియు 331(7) కింద అత‌డిపై కేసు నమోదు చేశారు. బంగ్లాదేశ్ నివాసిగా గుర్తింపు ఉన్న ష‌రీఫుల్, తన స్వగ్రామానికి పారిపోవడానికి ప్రయత్నించే క్ర‌మంలో థానేలోని హిరానంద్ ఎస్టేట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.