స్టార్ హీరోపై దుండగుడు కత్తి పోట్లు.. ఆస్పత్రిలో చికిత్స..
అదృష్ఠవశాత్తూ సైఫ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడని ఆసుపత్రి సిబ్బంది ధృవీకరించారు.
By: Tupaki Desk | 16 Jan 2025 4:22 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగింది. ముంబైలోని తన ఇంట్లోకి చొరబడిన ఒక దుండగుడు నాలుగుసార్లు కత్తితో పొడిచాడని కథనాలొస్తున్నాయి. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో జరిగింది. సైఫ్ ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదృష్ఠవశాత్తూ సైఫ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడని ఆసుపత్రి సిబ్బంది ధృవీకరించారు.
పోలీసులు ఈ ఘటనపై బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైఫ్ అలీ ఖాన్ నిద్రిస్తున్నప్పుడు ఒక దుండగుడు అతడి ఇంట్లోకి చొరబడ్డాడు. దుండగుడు లోపలికి చొరబడటానికి ప్రయత్నించిన తర్వాత గొడవ జరిగిందని పోలీసులు నిర్ధారించారు. అతడు సైఫ్ అలీ ఖాన్ ను నాలుగుసార్లు కత్తితో పొడిచి నేరస్థలం నుండి పారిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేసే ముగ్గురు సహాయకులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘర్షణలో ఒక సహాయకుడు గాయపడినట్లు సమాచారం. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం..ఈ దాడి వెనుక ఒక పనిమనిషి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సైఫ్ అలీ ఖాన్ బృందం అధికారిక ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం...''సైఫ్ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. ఇది పోలీసుల వ్యవహారం. పరిస్థితి గురించి మేము మీకు తెలియజేస్తాము. మీడియా , అభిమానులు ఓపిక పట్టాలని మేము అభ్యర్థిస్తున్నాం'' అని అందులో రాసి ఉంది. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ .. ఈ దంపతుల వారసులు స్విట్జర్లాండ్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. గత వారం ముంబైకి తిరిగి వచ్చారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... సైఫ్ అలీ ఖాన్ చివరిసారిగా 'దేవర పార్ట్ 1'లో నటించాడు. ఈ సినిమా 2024లో బ్లాక్ బస్టర్ల జాబితాలో నిలిచింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సహా బహుభాషలలో విడుదలైంది.