హీరోతో నటి పెళ్లి క్యాన్సిల్ .. కారణం?
తెలుగు నటుడు సాయికిరణ్ తన సహనటి, తెలుగు హీరోయిన్ లయ జంట పెళ్లిపై కొన్ని పుకార్లు వచ్చాయి.
By: Tupaki Desk | 24 Jun 2024 1:30 AM GMTసెలబ్స్ జీవితాలు సాధారణ ప్రజలకు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయి. ఇద్దరు సహ నటులు ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలపైనా చాలా క్యూరియాసిటీ ఉంటుంది. అవి కొన్ని సార్లు కేవలం పుకార్లు మాత్రమే అయినా చాలా నిజాలు ఉంటాయి. చాలా మంది స్టార్ కపుల్స్ పెళ్లికి ముందు బ్రేకప్ వార్తలను విస్మరించలేం. నిజానికి మీడియాలో చాలా పుకార్లు వచ్చాక ఆ స్టార్ కపుల్ పెళ్లి ఆలోచన విరమించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.
తెలుగు నటుడు సాయికిరణ్ తన సహనటి, తెలుగు హీరోయిన్ లయ జంట పెళ్లిపై కొన్ని పుకార్లు వచ్చాయి. ఆ ఇద్దరి జోడీ బావుంది.. పెళ్లి చేసుకుంటే బావుంటుంది! అంటూ అభిమానులు భావించేవారు. అదే క్రమంలో ఆ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా ప్లాన్ చేస్తున్నారని మీడియాలో కథనాలొచ్చాయి. అయితే దురదృష్టవశాత్తు అది జరగలేదు. దానికి కారణం కూడా వింతైనది. 2001లో సాయికిరణ్ - లయ జంట `ప్రేమించు` చిత్రంలో నటించారు. ఈ సినిమా హిట్ కావడంతో ప్రేక్షకులు తెరపై ఈ జంటను ఎంతో మెచ్చుకున్నారు. వారి నడుమ రొమాన్స్, కెమిస్ట్రీ ఆశ్చర్యపరిచింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం సాగింది. కానీ అలా జరగలేదు.
గత సంవత్సరం ఓ ఇంటర్వ్యూలో లయతో తన పెళ్లి ప్రణాళిక గురించి సాయికిరణ్ ఓపెన్ అయ్యాడు. వారి కుటుంబాలు కూడా తాము జంటగా స్థిరపడాలని కోరుకున్నాయని, అయితే ఇరు కుటుంబాలకు కూడా జాతకాలపై కొన్ని నమ్మకాలు ఉన్నాయని సాయికిరణ్ తెలిపారు. చివరికి తమ జాతకాలు కలవకపోవడంతో వివాహ ప్రణాళికలను పక్కన పెట్టామని వెల్లడించారు. కారణం ఏదైనా కానీ ఆ పెళ్లి జరగలేదు. తర్వాత విధి ఏమిటో అందరికీ తెలిసినదే. హీరో సాయికిరణ్ 2010లో వైష్ణవి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. మరోవైపు లయ 2006లో డాక్టర్ శ్రీ గణేష్ గోత్రీని పెళ్లి చేసుకుని యుఎస్‌లో స్థిరపడ్డారు. ఈ దంపతులు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు.
సాయికిరణ్ 2000లో వచ్చిన నువ్వేకావాలి చిత్రంలో తన నటనకు అద్భుత ప్రశంసలు అందుకున్నాడు. తరువాత అతడు రావే నా చెలియా, డార్లింగ్ డార్లింగ్, మనసుంటే చాలు, ఆడంతే ఆదో టైపు వంటి తెలుగు చిత్రాలలో కనిపించాడు. సుడి గుండాలు, కోయిలమ్మ, అభిలాష, మౌనరాగం, ఇంటి గుట్టు లాంటి తెలుగు టీవీ సీరియల్స్‌లో కూడా కనిపించాడు. అతడు ప్రస్తుతం గుప్పెడంత మనసు అనే టీవీ సీరియల్లో మహేంద్ర పాత్రను పోషిస్తున్నాడు. మరోవైపు లయ యువహీరో నితిన్ తదుపరి చిత్రం `తమ్ముడు`తో 20 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్లోకి పునరారంగేట్రం చేస్తున్నారు.