అన్నయ్య మరణంతో వదిన ఆరోగ్యం దెబ్బతింది!
దివంగత లెజెండరీ సింగర్ ఎస్.పి బాలసుబ్రమణ్యంతో సిస్టర్ కం గాయని శైలజ బాండింగ్ ఎంతో ప్రత్యేకమైనది.
By: Tupaki Desk | 7 Nov 2024 7:30 PM GMTదివంగత లెజెండరీ సింగర్ ఎస్.పి బాలసుబ్రమణ్యంతో సిస్టర్ కం గాయని శైలజ బాండింగ్ ఎంతో ప్రత్యేకమైనది. అన్నయ్య సారథ్యంలో చెల్లులు ఎన్నో పాటలు పాడారు. ఎస్పీజీ హోస్ట్ చేసిన ఎన్నో షోలను ఆమె ముందుండి నడిపించారు. అప్పుడప్పుడు ఒకరిపై ఒకరు సరదాగా జోకులు సైతం వేసి శ్రోతల్ని అలరించడం అన్నా-చెల్లికే దక్కింది. అయితే కరోనా వైరస్ తో బాలసుబ్రహ్మాణ్యం మరణించిన తర్వాత ఆ బుల్లి తెర షోలో ఏదో తెలియని వెలతి కనిపిస్తూనే ఉంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శైలజ..ఎస్పీబీ గురించి మరికొన్ని విషయాలు పంచుకున్నారు. ఆవేంటో ఆమె మాటల్లోనే.. `కరోనా అనేది ఒకటి వస్తుందనీ, అది మాకు అన్నయ్యను దూరం చేస్తుందని మేము ఎంతమాత్రం ఊహించలేదు. అది మా కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. అన్నయ్య 51 రోజుల పాటు ఇబ్బందిపడ్డారు. ఒక్కోరోజు ఆయన ఆరోగ్యం గురించి ఒక్కోటి చెప్పేవారు. తాను కోలుకున్న తరువాత మళ్లీ పాడగలుగుతానా? అని అన్నయ్య అక్కడివారిని అడుగుతూ ఉండేవారట.
ఆ సమయంలో కూడా ఆయన పాట గురించే ఆలోచించారు. ఆయన కోలుకోవాలని ప్రపంచమంతా ప్రార్ధించింది. కానీ ఆయన పాడలేని పరిస్థితి అనేది రాకుండా, అలా పాడుతూ వెళ్లిపోవడమే ఒక రకంగా మంచిదేమో అనిపిస్తుంది. నిజానికి మా అన్నయ్యతో పాటు మా వదినకి కూడా `కరోనా` వచ్చింది. ఆయన బెడ్ కి దగ్గరలోనే ఆమె బెడ్ ఉండేది. కానీ అక్కడ ఏం జరుగుతున్నది ఆమెకి తెలియదు. చరణ్ ను మాత్రమే అనుమతించేవారు.
ఆ తరువాత వదిన కోలుకున్నారు. కానీ అన్నయ్య విషయంలో అలా జరగలేదు. అన్నయ్య ఇక లేరని అంటే వదిన నమ్మలేదు . ఆయన లేస్తాడని అనేవారు. మా అందరికంటే ఎక్కువగా ఆమె ఎఫెక్ట్ అయ్యారు. చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఆరోగ్యపరంగా చాలా దెబ్బతిన్నారు` అని తెలిపారు.