చిరంజీవికి సజ్జల కౌంటర్...ఇద్దరికీ టాస్కులు!
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చిరంజీవి వ్యాఖ్యలు వాటికి వైసీపీ నేతలు ఇస్తున్న కామెంట్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 10 Aug 2023 4:37 AM GMTప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చిరంజీవి వ్యాఖ్యలు.. వాటికి వైసీపీ నేతలు ఇస్తున్న కామెంట్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చర్చ రసవత్తరంగా మారింది. ఈ సందర్భంగా చిరంజీవికి మద్దతుగా నిలిచే వారు నిలుస్తుంటే.. మరికొంతమంది మాత్రం వాయించి వదులుతున్న పరిస్థితి. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
అవును... మెగాస్టార్ చిరంజీవికీ చురకలు అంటించారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చిరంజీవి నటించిన భోళా శంకర్ టికెట్ల రేట్లపైనా స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. చంద్రబాబు హయాంలో బాలకృష్ణకు ఒక న్యాయం.. మిగిలిన వారికి ఒక న్యాయం అన్నట్లు తాము ఎప్పుడూ చేయలేదని గుర్తు చేశారు.
ఇదే సమయంలో... సినిమాల్లో కూడా బడ్జెట్ లింక్డ్ టికెటింగ్ వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని సజ్జల అన్నారు. ఎవరైనా సరే ఆధారాలు చూపించి టికెట్ ధరలు పెంచుకోవచ్చునని చెప్పారు. బడ్జెట్ ఆధారంగా టిక్కెట్ల ధరను నిర్ణయిస్తారని, అది పారదర్శకతలో భాగంగా తీసుకున్న విధానపరమైన నిర్ణయమని సజ్జల అన్నారు.
ఇందులో భాగంగా... నిర్మాణ వ్యయం 100 కోట్ల రూపాయల బడ్జెట్ ను దాటితే, అది ఏ సినిమా అయినా అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించి టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి తీసుకోవచ్చని సజ్జల స్పష్టం చేశారు. పారదర్శక వ్యవస్థ అమలు చేస్తోన్న వైఎస్ జగన్ ను ఇదే చిరంజీవి గతంలో ప్రశంసించారని గుర్తుచేశారు.
ఇలా అన్నీ పద్దతి ప్రకారం జరగాల్సి ఉన్నప్పుడు చిరంజీవి అలా మాట్లాడటంలో అంతర్యం ఏమిటో తనకు అర్ధం కావట్లేదని సజ్జల అన్నారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడినట్లు కనిపిస్తోందని అన్నారు. అలా మాట్లాడటం ద్వారా ఎవరి ప్రయోజనాలు కాపాడాలనుకున్నాడో చిరంజీవికే తెలియాలని సజ్జల వ్యాఖ్యానించడం గమనార్హం.
ఈ సందర్భంగా... చిరంజీవి కేంద్రమంత్రిగా పని చేశారని, ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుందనే విషయం ఆయనకూ తెలుసునని, అలాంటప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో అర్థం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విభజన సమయంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా పని చేశారని.. అప్పట్లో ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
ఈ క్రమంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి మోడీతో మాట్లాడి ప్రత్యేక హోదా తీసుకురావాలి.. లేదా, ఎన్డీయే లో ఉన్న పవన్ అయినా ఏపీకి హోదా తీసుకురావాలని సజ్జల సూచించారు!