Begin typing your search above and press return to search.

సలార్ (X) డంకీ: అద‌న‌పు స్క్రీన్ల కోసం ఫైట్?

ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ ఈ నెల 22న అంటే ఖాన్ న‌టించిన డంకీ రిలీజైన ఒక రోజు త‌ర్వాత విడుదలవుతోంది. స‌లార్‌తో షారుఖ్ ఖాన్ సినిమా అనూహ్యంగా క్లాష్ కానుంది.

By:  Tupaki Desk   |   12 Dec 2023 4:02 PM GMT
సలార్ (X) డంకీ: అద‌న‌పు స్క్రీన్ల కోసం ఫైట్?
X

వ‌రుస‌గా రెండు 1000 కోట్ల క్ల‌బ్ సినిమాల‌తో దూకుడుమీదున్న కింగ్ ఖాన్ షారూఖ్ తో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ పోటీప‌డుతున్నాడు. ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ ఈ నెల 22న అంటే ఖాన్ న‌టించిన డంకీ రిలీజైన ఒక రోజు త‌ర్వాత విడుదలవుతోంది. స‌లార్‌తో షారుఖ్ ఖాన్ సినిమా అనూహ్యంగా క్లాష్ కానుంది. ఈ రెండు సినిమాల‌ను నిర్మాత‌లు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించి భారీగా విడుద‌ల చేస్తున్నారు. దేశ విదేశాల్లో భారీగా స్క్రీన్ల‌ను లాక్ చేస్తున్నారు. అయితే 'సలార్' పూర్తిగా మాస్ యాక్ష‌న్ సినిమా కావ‌డంతో దీనికి భారీగా డిమాండ్ నెల‌కొంద‌ని ట్రేడ్ చెబుతోంది. ఇప్ప‌టికే స‌లార్ నిర్మాత కిరంగ‌దూర్ స్క్రీన్ కౌంట్ విష‌యంలో రాజీకి రావ‌డం లేద‌ని తెలిసింది.

నిజానికి సలార్ - డంకీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడానికి స‌న్నాహాలు సాగుతున్నాయి. సలార్ భారీ బజ్‌ని సృష్టిస్తోంది. ప్రభాస్ సినిమాపై ఆకాశాన్ని తాకే హైప్ ఉంది. సలార్ ట్రైలర్‌కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ప్రభాస్ భీక‌ర‌మైన యాక్ష‌న్ అవ‌తార్ లో క‌నిపిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి పెరిగింది. అయితే ఒక భారీ హాలీవుడ్ చిత్రం, షారూఖ్‌ డంకీ రెండూ స‌లార్ కి పోటీగా బ‌రిలో దిగుతుండ‌డం స్క్రీన్ల విష‌యంలో పోటీకి తెర లేచింద‌ని చెబుతున్నారు. హాలీవుడ్ చిత్రం ఆక్వామాన్ ఇదే సీజ‌న్ లో విడుద‌ల‌వుతుండ‌డంతో ఇది కొన్ని స్క్రీన్లను షేర్ చేస్కుంటోంది. దీంతో థియేట‌ర్ల‌ ప‌రంగా పోటీ నెల‌కొంద‌ని ట్రేడ్ చెబుతోంది.

ఇటీవ‌ల డంకీతో పోటీప‌డుతూ స‌లార్ భారీ స్క్రీన్ కౌంట్ కోసం నిర్మాత‌ల న‌డుమ‌ పోరాటం సాగుతోంద‌ని హిందీ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే స్క్రీన్ కౌంట్ పై స‌లార్ నిర్మాత విజయ్ కిరగందూర్ తాజాగా మౌనం వీడారు. ఇద్దరు పెద్దమనుషుల గొడవను ఉద్దేశించి విజయ్ కిరంగందూర్ మాట్లాడుతూ.. ఒక‌రిని చులకన చేయ‌డం ఇష్టం లేదని అన్నారు. ''ప్రస్తుతం ప్రోగ్రామింగ్ కీలకం. మేము అసహ్యకరమైన తగాదాలకు వెళ్ల‌కుండా మంచి ప్రోగ్రామింగ్ పైనే దృష్టి పెడుతున్నాము'' అని కిరంగ‌దూర్ వ్యాఖ్యానించిన‌ట్టు స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది. డిసెంబర్ 22ని ఎంచుకోవడానికి గల కారణాన్ని కూడా నిర్మాత‌ వెల్లడించిన‌ట్టు తెలిపింది.

సలార్ చాలాసార్లు ఆలస్యం అయింది. ఇది వాస్తవానికి 14 ఏప్రిల్ 2022న విడుదల కావాల్సి ఉండగా, ప్రొడక్షన్ డిలే, వీఎఫ్ఎక్స్ క్వాలిటీ కోసం ఆలస్యమైంది. 2023 రెండవ త్రైమాసికంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసారు. సెప్టెంబర్ 28ని విడుదల తేదీగా ప్రకటించారు. అయితే మళ్లీ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు డిసెంబర్ 22న సలార్ థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. డిసెంబర్ 22ని తేదీగా ఎంచుకోవడానికి కారణం ఉంది. జ్యోతిష్య కారణాల వల్ల ఈ తేదీని నిర్ణయించినట్లు విజయ్ కిరంగ‌దూర్ తెలిపార‌ని కూడా కొన్ని మీడియాలు వెల్ల‌డించాయి. 10 నుంచి 12 ఏళ్లుగా త‌న సినిమాల‌ను ఇలానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని కిరంగ‌దూర్ పేర్కొన్న‌ట్టు తెలిసింది.

డంకీ - ఆక్వామాన్ 21న విడుదలవుతున్నందున.. తేదీకి కట్టుబడి ఉన్నందున స‌లార్ కి వేరొక మార్గం లేదు. ఎవ‌రూ రిలీజ్ తేదీల‌ను మార్చుకునే ప‌రిస్థితి లేదు. ప్ర‌స్తుతం వీరంతా ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లతో సమావేశాలు ప్రారంభించారు. విడుదల సోలో అయితే స‌లార్ ఆక్యుపెన్సీ దాదాపు 60 నుండి 70 శాతం ఉంటుంది. అయితే ఈసారి 'డంకీ'తో పాటు జాసన్ మోమోవా 'ఆక్వామ్యాన్‌'కి కొన్ని స్క్రీన్‌లు కేటాయించాల్సి ఉంది. అందువల్ల సలార్ మేక‌ర్స్ ఉత్తమంగా 50-50 శాతం స్క్రీన్ పంపిణీని కలిగి ఉండాలని చూస్తున్న‌ట్టు తెలిసింది. ఇక టోటల్ ఆక్యుపెన్సీలో దాదాపు 90 నుంచి 100 శాతం వరకు వస్తే రెండు సినిమాలకు మంచి ఫలితాలు వస్తాయనేది వారి ఆలోచ‌న‌.

అయితే ప్రభాస్ సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వస్తే ఆక్యుపెన్సీ 60 నుంచి 70 శాతానికి తగ్గే అవకాశం ఉంది. సలార్ మేక‌ర్స్ వ్యూహం మరింత ఆక్యుపెన్సీని పొందడంపైనే అని తెలిసింది. సోలో విడుదల కంటే తక్కువ స్క్రీన్‌లు వ‌చ్చినా వారు దానిని పట్టించుకోవడం లేదు. విదేశాల్లోనూ పంపిణీ వ‌ర్గాల‌తో చర్చలు జరుపుతున్నార‌ని తెలిసింది. సలార్‌లో శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రీయా రెడ్డి, బాబీ సింహా, తిను ఆనంద్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.