సలార్ : ఈసారికి 'A' మినహాయింపు ఇవ్వండి ప్లీజ్
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో చాలా వరకు నిబంధనలు పట్టకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటారు.
By: Tupaki Desk | 26 Dec 2023 7:31 AM GMTతెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో చాలా వరకు నిబంధనలు పట్టకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ యాజమాన్యాలు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేసి వారి ఇష్టారాజ్యంగా రూల్స్ ను మార్చేస్తున్నారు.
ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సెన్సార్ బోర్డు సభ్యులు 'A' సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాకు 18 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించ వద్దు. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ఆ విషయాలను అసలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. కానీ కొన్ని మల్టీ ప్లెక్స్ లు ముఖ్యంగా ప్రధాన నగరాల్లో ఉన్న మల్టీ ప్లెక్స్ ల్లో ఆ సినిమాలకు చిన్న పిల్లలను అనుమతించడం లేదు.
తాజాగా ప్రభాస్ సలార్ సినిమాకి సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికెట్ ను పొందిన సలార్ సినిమాను చూసేందుకు చిన్న పిల్లలతో పెద్దలు వస్తున్నారు. కొన్ని మల్టీ ప్లెక్స్ ల్లో చిన్న పిల్లలను అనుమతించకుండా ఆపేస్తున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి గొడవలు సలార్ సినిమా నడుస్తున్న మల్టీప్లెక్స్ ల వద్ద కొనసాగుతున్నాయి.
చిన్న పిల్లలు థియేటర్ లోనికి రావడంతో ఏకంగా గంట పాటు సినిమాను ప్రదర్శించకుండా యాజమాన్యం ఆపేయడం జరిగింది. కొన్ని చోట్ల బుకింగ్ వద్ద, కొన్ని చోట్ల టికెట్ కలెక్ట్ కౌంటర్ వద్ద చిన్న పిల్లలను ఆపేయడం జరిగింది. దాంతో ప్రభాస్ సినిమా కనుక ఈ ఒక్కసారికి 'A' సర్టిఫికెట్ విషయంలో మినహాయింపు ఇవ్వాల్సిందిగా పిల్లల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
పెద్ద వారి కంటే కూడా చిన్న వారు ఎక్కువ శాతం ప్రభాస్ సినిమా సలార్ ను చూడాలని ఆశ పడుతున్నారు. వారి కోసం సింగిల్ స్క్రీన్ కు వెళ్లకుండా మల్టీ ప్లెక్స్ లకు వెళ్లాలని టికెట్లు బుక్ చేసిన ప్రేక్షకులకు అక్కడకు వెళ్లిన తర్వాత సీన్ రివర్స్ అవుతుంది. ఈసారికి మల్టీప్లెక్స్ వారు చూసి చూడనట్లుగా వదిలేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.