సలార్ తో హోంబాలమ్మ గ్రామ దేవతకి రిలేషన్...!
గత ఏడాది వచ్చిన కేజీఎఫ్ 2, కాంతార సినిమాలతో పాటు ఇటీవల విడుదల అయిన సలార్ సినిమాలను నిర్మించిన నిర్మాణ సంస్థ హోంబాలే.
By: Tupaki Desk | 24 Dec 2023 1:30 PM GMTగత ఏడాది వచ్చిన కేజీఎఫ్ 2, కాంతార సినిమాలతో పాటు ఇటీవల విడుదల అయిన సలార్ సినిమాలను నిర్మించిన నిర్మాణ సంస్థ హోంబాలే. నిర్మాణ రంగంలో అడుగు పెట్టి పదేళ్లు కూడా కాకుండానే హోంబాలే నిర్మాణ సంస్థ ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ లో ఒక్కటిగా నిలిచింది అనడంలో సందేహం లేదు.
హోంబాలే నిర్మాణ సంస్థకు ఉన్నన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు కూడా మరే నిర్మాణ సంస్థకు లేదు అనేది కన్నడ మీడియా వర్గాల కథనం. ఆ విషయం పక్కన పెడితే హోంబాలే నిర్మాణ సంస్థ ఎలా పుట్టింది, ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సలార్ సినిమా తో మరో వెయ్యి కోట్ల వసూళ్లు చేసిన సినిమాను తమ ఖాతాలో వేసుకున్న హోంబాలే నిర్మాణ సంస్థ అధినేత నిర్మాత విజయ్ కిరగందూర్ ప్రముఖ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కి మంచి స్నేహితుడు. విజయ్ నిర్మాణ సంస్థ ను మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు పునీత్ రాజ్ కుమార్ ఆ పేరును సూచించాడట.
విజయ్ కిరగందూర్ ది కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామ దేవత పేరు హోంబాలమ్మ. ఆ గ్రామ దేవత పేరు మీదే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయాలని హీరో పునీత్ రాజ్ కుమార్ సూచించడం, విజయ్ అదే విధంగా తన నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి 2014 సంవత్సరంలో పునీత్ హీరోగా నిన్నిందలే అనే సినిమాను నిర్మించడం జరిగింది.
కేజీఎఫ్ తర్వాత పునీత్ రాజ్ కుమార్ తో ఓ భారీ సినిమాను నిర్మించాలని నిర్మాత విజయ్ ప్లాన్ చేశాడు. కానీ ఇంతలోనే పునీత్ చనిపోవడం జరిగింది. తన నిర్మాణ సంస్థ ఈ స్థాయిలో ఉంది అంటే పునీత్ వల్లే అని, ఆయనతో ఒక కన్నడ ఇండస్ట్రీ హిట్ తీయాలనే తన కోరిక నెరవేరకుండా అయిందని నిర్మాత విజయ్ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
సలార్ తో ఓ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హోంబాలమ్మ గ్రామ దేవత పేరు మీద ప్రారంభం అయిన హోంబాలే నిర్మాణ సంస్థ త్వరలో అంతకు మించిన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ఆరు సినిమాలను ప్రస్తుతం నిర్మిస్తోంది. అంతే కాకుండా మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. సలార్ 2 మరో వెయ్యి కోట్ల సినిమాగా హోంబాలే నిర్మాణ సంస్థలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.