ప్రభాస్ - ప్రశాంత్ నీల్ సలార్‌లో అసలు ట్విస్ట్ అదేనా?
సినిమా రిలీజ్‌కు రెండు నెలలకు పైనే సమయం ఉండటంతో ట్రైలర్ అయినా రిలీజ్ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు
By: Tupaki Desk | 17 Oct 2023 10:21 AM GMT'కేజీఎఫ్ చాప్టర్ 2' దేశ వ్యాప్తంగా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు.వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన ఈ సినిమా తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి చేస్తున్న మూవీ 'సలార్'. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. ఇక ఈ మూవీని రెండు భాగాలుగా చేస్తున్నారని, కేజీఎఫ్ వరల్డ్‌లో ఇది కూడా ఓ భాగం అని ప్రచారం ఊపందుకోవడంతో ఆ అంచనాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.
దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వచ్చేస్తుందా? ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ప్రభాస్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వీఎఫ్ ఎక్స్ కారణంగా వాయిదాపడి డిసెంబర్ 22కు మారింది. దీంతో అక్టోబర్, నవంబర్ ఎప్పుడు పూర్తవుతాయా?..ఎప్పుడెప్పుడు క్యాలెండర్‌లోని డేట్‌లని చించేయాలా? అని అభిమానులు, సినీ లవర్స్ రెండు నెలలుగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
సినిమా రిలీజ్‌కు రెండు నెలలకు పైనే సమయం ఉండటంతో ట్రైలర్ అయినా రిలీజ్ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి. అయితే ఈ రోజు మాత్రం ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే సినిమా రిలీజ్‌కు రెండు నెలల ముందు ట్రైలర్‌ని ఏ మేకర్స్ రిలీజ్ చేయరు. అదే విధంగా 'సలార్' టీమ్ కూడా ట్రైలర్‌ని రిలీజ్ చేయాలనుకోవడం లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన ట్విస్ట్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో ప్రభాస్ సలార్‌గా, దేవాగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఇందులో ప్రభాస్, పృథ్వీరాజ్ ప్రాణ స్నేహితులుగా కనిపించనున్నారని, పృథ్విరాజ్ సుకుమారన్‌కు తండ్రిగా రాజమన్నార్ పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే 'సలార్' ప్రధాన కథ అంతా ప్రాణ స్నేహితుల మధ్య సాగె యుద్ధ నేపథ్యంలో ఉంటుందని, ఇదే ఫస్ట్ పార్ట్ కు ప్రధాన ట్విస్ట్ అని తెలుస్తోంది. సెకండ్ పార్ట్‌లో అసలు సలార్ కథ మొదలవుతుందని, ఇద్దరి స్నేహం నేపథ్యంలో సాగే సీన్‌లు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.
ఇందులో రాజమన్నార్‌కు తనయుడిగా వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ కనిపిస్తారు. దేవా, వరదరాజ మన్నార్‌లు ప్రాణ స్నేహితులు, సలార్ గ్యాంగ్ ని అంతం చేయడానికి పూనుకునే గ్యాంగ్ గురించి తెలుసుకునే క్రమంలో అది వరదరాజ మన్నార్‌దేనని తెలుస్తుందట. ఆ విషయం తెలుసుకున్న దేవా తన ప్రేణ స్నేహితుడిపై ఎలాంటి యుద్ధానికి సిద్ధమయ్యాడు? ఆ తరువాత ఏం జరిగింది? ..'సలార్' సమ్రాజ్యాన్ని అంతం చేయాలని వరదరాజ మన్నార్ ఎందుకు పూనుకున్నాడు? అన్నదే అసలు కథ అని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే థియేటర్లలో పూనకాలు ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు.