Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : సలార్

By:  Tupaki Desk   |   22 Dec 2023 3:46 AM GMT
మూవీ రివ్యూ : సలార్
X

'సలార్' మూవీ రివ్యూ

నటీనటులు: ప్రభాస్- పృథ్వీరాజ్ సుకుమారన్- శృతిహాసన్- జగపతిబాబు- ఈశ్వరీ రావు- శ్రియా రెడ్డి-బాబి సింహ- గరుడ రామ్- జాన్ విజయ్- మైమ్ గోపి- సంపత్ రాజ్- ఝాన్సీ తదితరులు

సంగీతం: రవి బస్రుర్

ఛాయాగ్రహణం: భువన్ గౌడ

నిర్మాతలు: విజయ్ కిరగంందూర్- కార్తీక్ గౌడ

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: ప్రశాంత్ నీల్

బాహుబలితో హీరోగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. కేజి ఎఫ్ సిరీస్ తో గొప్ప పేరు సంపాదించిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా సలార్. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

దేవా (ప్రభాస్) ఒరిస్సాలోని ఒక చిన్న గ్రామంలో అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మెకానిక్ గా పని చేస్తున్న అతన్ని ఒక హింసాత్మక గతం వెంటాడుతూ ఉంటుంది. తల్లి మాట మేరకు అతను హింసకు పూర్తిగా సాధారణ జీవితం గడుపుతుంటాడు. అలాంటి అతను అమెరికా నుంచి వచ్చి శత్రువులకు టార్గెట్ గా మారిన ఆద్య (శృతిహాసన్)ను కాపాడాల్సిన బాధ్యత తీసుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలోనే దేవా అత్యంత భయంకరమైన ఖాన్సార్ నేర సామ్రాజ్యానికి ఎదురు వెళ్లాల్సి వస్తుంది. ఇంతకీ ఆ సామ్రాజ్యం నేపథ్యం ఏంటి.. దాంతో దేవాకున్న సంబంధమేంటి... అతడి గతం ఏంటి.. ఆద్యను కాపాడే క్రమంలో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.

కథనం- విశ్లేషణ:

మాస్, యాక్షన్ సినిమాల్లో ఎలివేషన్ సీన్లు, యాక్షన్ ఘట్టాలు పండాలంటే హీరో ఇమేజ్ అన్నది చాలా కీలకమైన విషయం. మంచి కటౌట్ ఉండి, మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయి ఉంటేనే ఎలివేషన్లు క్లిక్ అవుతాయి. కానీ కేజీఎఫ్ సినిమాతో ఈ రూల్స్ అన్నిటిని బ్రేక్ చేసి పడేసాడు ప్రశాంత్ నీల్. అసలు కన్నడలో కూడా పెద్దగా మాస్ ఇమేజ్ లేని యశ్ ను హీరోగా పెట్టి.. అతనితో అస్సలు పరిచయం లేని మన ప్రేక్షకులను రోమాంచితులను చేసి విజిల్స్ కొట్టించడం ఒక సంచలనం. అలాంటి దర్శకుడు బాహుబలితో ఆకాశమంత ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అనగానే అందరి దృష్టి ఎలివేషన్ సీన్లు, యాక్షన్ ఘట్టాల మీదకే మళ్లింది. ఆ విషయంలో ప్రశాంతి ఏమి నిరాశపరచలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ ను తన అభిమానులే కాక మాస్ ప్రేక్షకులు చూడాలనుకుంటారో అలా చూపించింది ప్రశాంత్. ప్రభాస్ కటౌట్ ను సరిగ్గా వాడుకుంటే మాస్ కు ఎలా పూనకాలు తెప్పించవచ్చో ప్రశాంత్ చూపించాడు. కానీ మూడు గంటల సినిమాను కేవలం ఎలివేషన్ సీన్లు, పోరాట ఘట్టాలు మాత్రమే నడిపించేయవు కదా. ఇక్కడే సలార్ నిరాశ పరుస్తుంది. గేమ్ ఆఫ్ త్రోన్స్ స్ఫూర్తితో ఖాన్సార్ పేరుతో ప్రశాంత్ నీల్ సృష్టించిన కొత్త ప్రపంచం కేజిఎఫ్'కు ఎక్స్టెన్షన్ లాగా అనిపిస్తుంది తప్ప కొత్తదనం ఏమి కనిపించదు. ఇక నరేషన్ పరంగా కేజిఎఫ్ ని మించిన గందరగోళం వల్ల కథను ఫాలో అవడమే పెద్ద పరీక్షగా మారి శిరోభారం తప్పదు. మొత్తంగా సలార్ ఒక మిశ్రమానుభూతిని కలిగిస్తుంది.

కేజిఎఫ్ సినిమా చూస్తున్నపుడు ముందు ఏంటి సినిమా అంతా ఎలివేషన్లేనా.. ఫైట్లేనా.. కథ ఏమీ లేదా అనిపిస్తుంది. కానీ ఒకసారి రివైండ్ చేసుకుంటే అందులో గాఢమైన తల్లి కొడుకుల ఎమోషన్ ఉంటుంది. అలాగే హీరో క్యారెక్టర్ విషయంలో ఒక గ్రాఫ్ కనిపిస్తుంది. దీనికి తోడు విజువల్ గా ఎన్నడూ చూడనీ ఒక కొత్త ప్రపంచం చూసిన అనుభూతి ఒక హై ఇస్తుంది. హీరో ఎలివేషన్లు, యాక్షన్ బ్లాక్స్ పరంగా కేజిఎఫ్ ను మించి స్కోర్ చేసిన సలార్.. ఈ మూడు విషయాల్లో వెనుకబడిందనే చెప్పాలి. ఇందులో కూడా తల్లి కొడుకుల బంధాన్ని చూపించడానికి ప్రయత్నించారు. ఎమోషన్ తెప్పించడానికి బదులు చికాకు పెడుతుంది. ఇక మూల కథను ఇద్దరు స్నేహితుల మధ్య బంధం నేపథ్యంలో నడిపించాడు ప్రశాంత్. కానీ అందులో కూడా స్ట్రాంగ్ ఎమోషన్ అంటూ ఏమీ లేదు. స్నేహితుడితో హీరో బంధం గొప్పగా అనిపించాలి అంటే ఆ స్నేహితుడి పాత్ర ప్రత్యేకంగా ఉండాలి. పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి ఒక స్పెషల్ ఆర్టిస్టును ఆ పాత్రకు తీసుకున్నారు కానీ క్యారెక్టర్ డిజైన్ మాత్రం సరిగా జరగలేదు. అన్నిటికీ మించి హీరో క్యారెక్టర్ గ్రాఫే చాలా డిజప్పాయింటింగ్ గా అనిపిస్తుంది. ఈ పాత్రను చాలా డల్లుగా మొదలు పెట్టి సహనాన్ని చాలా సేపు పరీక్షిస్తాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ లాంటి మంచి కటౌట్ ఉండబట్టి సరిపోయింది కానీ జీవం లేని ఆ పాత్రలో మరో హీరో ఉంటే అది తేలిపోయేదే. ఇక కథ పరంగా, విజువల్ గా సలార్ కొత్తగా ఏమీ అనిపించదు. మాఫియా చెరబట్టిన ఒక సామ్రాజ్యం.. అందులో ఆధిపత్యం కోసం వివిధ వర్గాల పోరాటం.. అక్కడ హీరో అడుగు పెట్టి తన విశ్వరూపం చూపించడం.. ఇలా అంతా కేజిఎఫ్ ఫార్మాట్లోనే సాగిపోతున్నట్లు అనిపిస్తుంది. బ్లాక్ థీమ్ తో సాగే విజువల్స్ అన్నీ కూడా ఆల్రెడీ చూసినట్టే అనిపిస్తాయి. అందువల్ల ప్రేక్షకులు ఆశ్చర్యపోయేది అంటూ ఏమీ ఉండదు.

సలార్ ట్రైలర్ చూసి థియేటర్లో అడుగు పెట్టిన ప్రేక్షకులను ప్రశాంత్ నీల్ కొంత ఆశ్చర్య పరుస్తాడు. నేరుగా ఖాన్సార్ సామ్రాజ్యంలోకి అడుగు పెడతాం అనుకుంటే.. ట్రైలర్లో చూసిన దానికి భిన్నంగా కథను మరోలా నరేట్ చేశాడు ప్రశాంత్. శృతిహాసన్ పాత్ర చుట్టూ కథను మొదలు పెట్టి.. ఆ తర్వాత హీరో దగ్గరికి వస్తాడు. అయితే ఆరంభ సన్నివేశాలు ఏమంత ఆసక్తికరంగా అనిపించవు. ప్రభాస్ ఇంట్రో పేలిపోతుంది అనుకుంటే చాలా సాధారణంగా ఆ పాత్రను పరిచయం చేశాడు దర్శకుడు. ఆ తర్వాత కూడా హీరో పాత్ర ప్రేక్షకులు కోరుకున్న విధ్వంసం సృష్టించడానికి చాలా సమయమే పడుతుంది. హీరో- తల్లి- హీరోయిన్ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు మరీ డ్రమటిక్ గా.. ఓవర్ బిల్డప్ ఇస్తున్నట్లు అనిపిస్తాయి. హీరో తన బంధనాలు తెంచుకొని విలయానికి సిద్ధమయ్యాకే ప్రేక్షకుల్లోనూ ఊపు వస్తుంది. అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు ఒక హైతో నడుస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్లో ఎలివేషన్ పీక్స్ కు చేరుతుంది. అందుకు తగ్గట్లే ప్రభాస్ ను ఒక పెద్ద టవర్ లాగా చూపించడం.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తుంది. దీంతో ఖాన్సార్ సామ్రాజ్యం చుట్టూ నడిచే ద్వితీయార్థం మీద భారీ అంచనాలు పెట్టుకుంటాం. కానీ ఆ అంచనాలకు తగ్గట్లు ద్వితీయార్థం సాగదు. లెక్కకు మిక్కిలి క్యారెక్టర్లు.. వాళ్ల మధ్య కుట్రలు కుతంత్రాలు.. ఈ నేపథ్యంలో గజిబిజిగా సాగే కథాకథనాలు ఆసక్తిని సన్నగిల్లేలా చేస్తాయి. కథను అర్థం చేసుకోవడమే పెద్ద పరీక్షగా మారుతుంది. ఎప్పుడు, ఎక్కడ, ఏం జరుగుతోందో అర్థం కాని అయోమయం నెలకొంటుంది. కేజిఎఫ్ లో కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ.. అక్కడ ఇతర అంశాలు సినిమాను డ్రైవ్ చేస్తాయి. కానీ సలార్ లో ఆ మ్యాజిక్ మిస్సయింది. కానీ ద్వితీయార్థంలోను ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు అయితే బాగానే పేలాయి. ప్రభాస్ తెరపైకి వచ్చిన తీసుకొచ్చాడు. కథపరంగా సినిమా చివర్లో అనేక ప్రశ్నలు విడిచి పెట్టాడు ప్రశాంత్. అవన్నీ సలార్-2 లో చూడాల్సిందే. చివర్లో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఇచ్చిన ట్విస్టు, తనను ఎలివేట్ చేసిన తీరు అభిమానులను మెప్పిస్తాయి. రెండో భాగం ఇంకా మెరుగ్గా ఉండొచ్చు అన్న ఆశలు రేకెత్తిస్తుంది క్లైమాక్స్. కానీ సలార్ ఫస్ట్ పార్ట్ మాత్రం మిశ్రమానుభూతినే మిగులుస్తుంది.

నటీనటులు:

ప్రభాస్ పెర్ఫార్మెన్స్ అంటూ ఇందులో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఉన్నదంతా తన స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రమే. ప్రభాస్ ముఖ కవళికలు స్పష్టంగా కనిపిస్తూ డైలాగులు చెప్పే సన్నివేశాలు వేళ్ళ మీద వెతుక్కోవాల్సిందే. ప్రశాంత్.. ప్రభాస్ కు అలాంటి అవకాశం పెద్దగా ఇవ్వలేదు. ప్రభాస్ కటౌట్, స్క్రీన్ ప్రెజెన్స్ ను వాడుకొని ఆ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ను మాస్ కోణంలో ది బెస్ట్ గా చూపించింది ప్రశాంత్ అనడంలో సందేహం లేదు. యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ వావ్ అనిపిస్తాడు. కానీ ప్రభాస్ నుంచి ఒక పెర్ఫార్మన్స్ ఆశించిన వాళ్ళు మాత్రం సలార్ చూసి నిరాశ చెందుతారు. ప్రభాస్ లుక్స్ ఓకే. హీరోయిన్ శృతిహాసన్ సినిమాకు పెద్ద మైనస్ అయింది. తన పాత్ర కానీ, లుక్స్ కానీ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. పృథ్వీరాజ్ సుకుమారన్.. వరద పాత్రలో మెప్పించాడు. అయితే స్పెషల్ అనిపించేలా తన క్యారెక్టర్ లేదు. అతను అందరిలో ఒకడిలాగే కనిపించాడు. జగపతిబాబు ఉన్నంతసేపు తన ప్రత్యేకతను చాటుకున్నాడు గాని ఆయన స్క్రీన్ టైం తక్కువే. ఈశ్వరి రావు తల్లి పాత్రలో బాగానే చేసింది కానీ ఆ క్యారెక్టర్ చికాకు పెడుతుంది. ఝాన్సీ కూడా అంతే. శ్రియా రెడ్డి కీలక పాత్రలో రాణించింది. కొన్నిచోట్ల మాత్రం తన నటన అతిగా అనిపిస్తుంది. విలన్లు అందరిలో జాన్ విజయ్ డిఫరెంట్ గా కనిపిస్తాడు. బాబీ సింహా, గరుడ రామ్ మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు.

సాంకేతిక వర్గం:

రవి బస్రుర్ కేజిఎఫ్ స్టైల్ మ్యూజికే ఇందులోనూ కొనసాగించాడు. మొదట్లో కొత్తగా అనిపించిన తన బ్యాగ్రౌండ్ స్కోర్.. సలార్ కు వచ్చేసరికి ఒక రకమైన మొనాటనీ తెచ్చిపెట్టింది. యాక్షన్ బ్లాక్స్, ఎలివేషన్ సీన్లను ఆర్ఆర్ తో అతను బాగానే పైకి లేపినా ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. కేజిఎఫ్ లో మాదిరి ఉత్తేజితం కలిగించే బ్యాగ్రౌండ్ సాంగ్స్ ఇందులో పడలేదు. మిగతా చిన్న చిన్న బిట్స్ సాంగ్స్ కూడా ఏమంత ఆకట్టుకునేలా లేవు. మ్యూజిక్ పెద్ద ప్లస్ కాదు అలా అని మైనస్ కూడా కాదు. భువన్ గౌడ ఛాయాగ్రహణం అలవాటైన శైలిలోనే సాగింది. విజువల్స్ బాగున్నాయి. యాక్షన్ ఘట్టాలని అతను అద్భుతంగా చిత్రీకరించాడు. నిర్మాణ విలువలకు ఉత్తమ స్థాయిలోనే సాగాయి. సినిమా చాలా రిచ్ గా అనిపిస్తుంది. ఇక దర్శకుడు ప్రశాంత్ విషయానికి వస్తే అతను ఇప్పటికే ప్రేక్షకు అలవాటు చేసిన కేజీఎఫ్ శైలిలోనే ఇంకొక కొత్త ప్రపంచాన్ని సృష్టించి.. తన మార్కు ఎలివేషన్లతో సలార్ కథను నడిపించే ప్రయత్నం చేశాడు. ఎప్పటిలాగే అతని నరేషన్ గజిబిజిగా సాగింది. ద్వితీయార్థంలో ప్రేక్షకులను మరీ కన్ఫ్యూజ్ చేసేశాడు. అయితే ఎలివేషన్ సీన్లు, యాక్షన్ ఘట్టాలు తీయడంలో తనకు తిరుగు లేదని ప్రశాంత్ మరోసారి చాటాడు. కేజీఎఫ్ తర్వాత ప్రభాస్ తో ప్రశాంత్ సినిమా అంటే అతడి నుంచి ఇంకా బెటర్ అవుట్ పుట్ ఆశిస్తారు ప్రేక్షకులు. దర్శకుడిగా ఆ అంచనాలను ప్రశాంత్ అందుకోలేకపోయాడని చెప్పాలి.

చివరగా: సలార్.. యాక్షన్ అన్ లిమిటెడ్

రేటింగ్: 2.75/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater