114 రోజుల్లో ఇంత భారీ సినిమా చుట్టేశారా?
కొన్ని వరుస పరాజయాల తర్వాత డార్లింగ్ ప్రభాస్ కి బిగ్ రిలీఫ్ కావాలి. ఇండస్ట్రీ దద్దరిల్లే రికార్డ్ బ్రేకింగ్ హిట్ అతడికి కావాలి
By: Tupaki Desk | 2 Dec 2023 1:53 AM GMTకొన్ని వరుస పరాజయాల తర్వాత డార్లింగ్ ప్రభాస్ కి బిగ్ రిలీఫ్ కావాలి. ఇండస్ట్రీ దద్దరిల్లే రికార్డ్ బ్రేకింగ్ హిట్ అతడికి కావాలి. ఇలాంటి సమయంలో ప్రభాస్ నటించిన సలార్ విడుదలకు వస్తోంది. ఈ సినిమా గురించి చాలా విషయాలు ఇప్పటికే లీకవుతున్నాయి.
ఆదిపురుష్ తర్వాత ఈ ఏడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ రెండో పెద్ద విడుదల. కేజీఎఫ్ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ తొలిసారి కలిసి పని చేస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల డిసెంబర్ 22కి వాయిదా పడింది.
తాజాగా సలార్ గురించిన ఒక అప్ డేట్ షాక్ కి గురి చేసింది. సలార్ షూటింగ్ 114 రోజుల పాటు సాగిందని ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిజానికి ఈ స్థాయి మూవీ కోసం ఈ నంబర్లు చాలా చిన్నవి. చిత్ర బృందం సమర్ధవంతంగా ప్లాన్ చేయడం వల్ల నిర్మాణం త్వరగా పూర్తవుతుంది. టాకీ త్వరగా పూర్తయినా కానీ నాణ్యమైన పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం వెచ్చించారు. ఎక్కువ భాగం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిందని దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించాడు.
సింగరేణి గనులు, వైజాగ్, మంగళూరు ఓడరేవుల్లో కొన్ని భాగాలు చిత్రీకరించారు. నీల్ సమాచారం మేరకు ఈ సినిమాలో కొంత భాగాన్ని యూరప్‌లో చిత్రీకరించారు. ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉంటాయని సమాచారం. రవి బస్రూర్ స్వరాలు సమకూర్చారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.
టికెట్ ధరలు దిగి రావాలి:
తాజా సమాచారం మేరకు సలార్ టీమ్ ఈ చిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇటీవలి ట్రైలర్‌కి సంబంధించి ఒక అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహం పెంచింది. ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 1న రాత్రి 7:19 గంటలకు విడుదల కానుందని టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఐమాక్స్ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని పంపిణీ చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. తాజా రిపోర్టు ప్రకారం, సలార్ ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో మోత మోగిస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల హక్కులు 165 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్లు సమాచారం. అలాగే ఈ సినిమా హక్కుల కోసం మైత్రీ మూవీ మేకర్స్‌తో 60 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కథనాలొస్తున్నాయి. పాపులర్ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిందని టాక్ ఉంది.
ఈ సినిమా మొదటి వారాంతంలోనే మంచి వసూళ్లు రాబట్టే విధంగా టిక్కెట్ రేట్లు పెంచుతారని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్లతో సావాసం కాబట్టి, కనీసం మొదటి వారాంతంలో టిక్కెట్ రేట్లను పెంచుకోవడం ద్వారా రిటర్నులను పెంచుకోవడానికి సలార్ మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. మల్టీప్లెక్స్‌లలో రూ.410, సింగిల్ స్క్రీన్‌లలో రూ.250 వరకు టిక్కెట్ ధరలు ఉంటాయని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే టికెట్ ధరల్ని తగ్గించడం ద్వారా థియేటర్లకు అందరినీ రాబట్టాలనే ఆలోచన చేస్తున్నారా లేదా? అన్నది వేచి చూడాలి.