సలార్ వాయిదా.. యూఎస్ లో కూడా అదే టెన్షన్
అయితే పరిస్థితులు చూస్తుంటే అదే నిజం అని పక్కాగా అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు ఓవర్సీస్లో భారీ రేంజ్లో బుకింగ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 Sep 2023 6:11 AM GMTప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ మూవీ పుల్ హాట్ టాపిక్‌గా మారింది. అందుకు కారణం పోస్ట్‌పోన్ ప్రచారం. భారీ స్థాయిలో అంచనాలు పెంచి... విడుదల ఎప్పుడెప్పుడా అని ఆత్రుత కలిగించిన ఈ చిత్రం.. ఇప్పుడు ఒక్కసారిగా వాయిదా ప్రచారంతో తెరపైకి రావడం వల్ల సినీ ప్రియులు, ప్రభాస్ అభిమానులంతా షాక్ అవుతున్నారు. అయితే ఈ వాయిదా గురించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
అయితే పరిస్థితులు చూస్తుంటే అదే నిజం అని పక్కాగా అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు ఓవర్సీస్లో భారీ రేంజ్లో బుకింగ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. యూఎస్ బాక్సాఫీస్ ముందు ఇప్పటికే ప్రీమియర్స్ సేల్స్ భారీగా జరిగినట్లు కథనాలు కూడా వచ్చాయి. ఇప్పటికే 19 వేల టికెట్లు అమ్ముడుపోయినట్లు, హాఫ్ మిలియన్‌కు పైగా వసూళ్లు కూడా వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పుడు ఇలాంటి సమయంలో ఈ ప్రచారం బయటకి రావడం ఫ్యాన్స్‌కు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్‌కు పెద్ద షాక్‌ను ఇస్తోంది. దీంతో అక్కడి థియేటర్స్ తమ వెబ్సైట్ల నుంచి షోలకు సంబంధించిన వివరాలను తొలిగించేస్తున్నారట. రిఫండ్ ప్రాసెస్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.
వాస్తవానికి సెప్టెంబరు నెల మొదలైనా ప్రచార కార్యక్రమాలు ఊపందుకోకపోవడంతో రిలీజ్‌పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఇప్పుడదే నిజం కాబోతుందని అర్థమవుతున్న నేపథ్యంలో షాక్‌లో నుంచి సినీ ప్రియులు ఎవరూ కోలుకోలేకపోతున్నారు. దీంతో తదుపరి విడుదల ఎప్పుడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అయితే ఇప్పుడు మూవీటీమ్.. కొత్త రిలీజ్ డేట్ గురించి కూడా కసరత్తులు చేస్తుందని తెలుస్తోంది. సినిమాను వీలైనంత త్వరగా తీసుకురావాలని ట్రై చేస్తుందట. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12కు తీసుకొచ్చేలా చూడాలని ఆలోచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే సంక్రాంతికి భారీ బాక్సాఫీస్ వార్ జరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడు కమల్‌హాసన్ ఇండియన్ 2, మహేశ్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామి రంగ సహా పలు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.