`సలార్`కి కన్నడిగులు బిగ్ ఝలక్!
సలార్ మొదటి రోజు రూ.90.7 కోట్లు వసూలు చేగా తెలుగు నుంచి రూ 66.75 కోట్లు వసూలు చేసింది.
By: Tupaki Desk | 24 Dec 2023 6:36 PM GMTమోస్ట్ అవైటెడ్ `సలార్` ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు, హిందీ బెల్ట్ సహా విదేశాల్లో అద్భుతంగా రాణిస్తోంది. కానీ తమిళం, కన్నడలో ఆశించిన స్థాయి కలెక్షన్లను రాబట్టకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ ప్రభావం కన్నడ బాక్సాఫీస్ వద్ద పని చేయకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.
సలార్ మొదటి రోజు రూ.90.7 కోట్లు వసూలు చేగా తెలుగు నుంచి రూ 66.75 కోట్లు వసూలు చేసింది. మలయాళం నుంచి రూ.3.55 కోట్లు వసూలవ్వగా, తమిళం నుంచి రూ.3.75 కోట్లు కలెక్టయింది. కానీ ఇరుగు పొరుగు భాషల్లో ఎంతో కీలకమైన కన్నడ బాక్సాఫీస్ నుంచి కేవలం రూ.90 లక్షలు మాత్రమే వసూలైంది.
మరోవైపు హిందీ నుంచి రూ.15.75 కోట్లు వసూలు చేయగలిగింది. ప్రస్తుతానికి సలార్ అన్ని భాషలకు కలిపి భారతదేశంలో రెండవ రోజు దాదాపు రూ.57.61 కోట్ల నికర వసూళ్లను రాబట్టి తొలి రెండు రోజులకు ఈ సినిమా రూ.148.31 కోట్ల మేర ఇండియా వైడ్ నెట్ వసూలు చేసింది.
అయితే ఆశ్చర్యకరంగా కర్ణాటకలో సలార్ పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచింది. తెలుగు, హిందీ మార్కెట్లలో రికార్డులను బద్దలు కొడుతుండగా కన్నడ వెర్షన్ మాత్రం ప్రేక్షకుల్లో చెప్పుకోదగ్గ ఆసక్తిని రేకెత్తించడంలో విఫలమైంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ - కేజీఎఫ్ 2 కన్నడ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. కానీ బాహుబలితో గొప్ప ఇమేజ్ ఉన్న ప్రభాస్ కి ఎందుకని కన్నడ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు దక్కలేదు? కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ ప్రభావం ఎందుకని పని చేయలేదు! అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఇరుగు పొరుగు భాషల కంటే ఉత్తర అమెరికాలో రెండవ రోజు అద్భుత వసూళ్లు దక్కాయి. ఈ చిత్రం హిందీ వెర్షన్ 192K డాలర్ల కలెక్షన్ రాబట్టగా దీనికి విరుద్ధంగా తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌ల కలెక్షన్లు వరుసగా 18K డాలర్లు, 5K డాలర్లు, 2K డాలర్లు వసూలు చేసాయి. తమిళంలో లోకల్ సెంటిమెంట్ అనుకుంటే... మలయాళానికి ఉన్న సవాళ్లను అర్థం చేసుకోగలం. కానీ ప్రశాంత్ నీల్ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ కర్ణాటకలో ఇంత బేలగా వసూళ్లు రావడమే ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరు కర్నాటక నుంచి కనీసం 2-3 కోట్ల మేర ఓపెనింగులు తెస్తుందని ఆశిస్తే కేవలం 1.10 కోట్లు మాత్రమే రాబట్టిందని పంపిణీ వర్గాలు చెబుతున్నాయి. ఇది నిరాశ కలిగించే అంశం. అయితే ఈ క్రిస్మస్ సెలవుల్లో అలాగే , జనవరి 1 సెలవు.. ఆ తర్వాత సంక్రాంతి వరకూ సలార్ జనాల్ని థియేటర్లకు రప్పించగలుగుతుందేమో చూడాలి.