'సలార్' క్రేజ్‌కి తగ్గట్టే టికెట్ పెంపు?
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా మొదటి వారాంతంలోనే మంచి వసూళ్లు రాబట్టే విధంగా టిక్కెట్ రేట్లు పెంచుతారని టాక్ వినిపిస్తోంది.
By: Tupaki Desk | 23 Nov 2023 4:17 PM GMT2023-24 మోస్ట్ అవైటెడ్ మూవీగా 'సలార్' డిసెంబర్‌లో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. విడుదలకు ఇంకొన్ని రోజులు మాత్రమే వేచి చూడాలి. ఇంతలోనే ప్రభాస్ ఫ్యాన్స్ లో ఎగ్జయిట్ మెంట్ ఊహించని రీతిలో అంతకంతకు పెరిగిపోతోంది. అయితే పెరుగుతున్న హైప్ దృష్ట్యా సలార్ లాంటి భారీ బడ్జెట్ సినిమాకి రిటర్నులు రాబట్టడంపై చిత్రనిర్మాతలు దృష్టి సారించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
డిసెంబరు 22న గ్రాండ్ ప్రీమియర్ కి రెడీ అవుతున్న సలార్ టికెట్ రేట్ల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. సలార్ ముందుగా సెప్టెంబర్‌లో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. షారుఖ్ ఖాన్ జవాన్‌తో పోటీకి దిగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని అభిమానులు భావించారు. కానీ మేకర్స్ ఆ వాదనను ఖండించారు. మంచి వీఎఫ్ఎక్స్ పని కోసం వాయిదా వేసినట్టు తెలిపారు. తాజా సమాచారం మేరకు సలార్ టీమ్ ఈ చిత్రానికి చివరి మెరుగులు దిద్దుతున్నారు.యు పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
ఇటీవలి ట్రైలర్‌కి సంబంధించి ఒక అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహం పెంచింది. ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 1న రాత్రి 7:19 గంటలకు విడుదల కానుందని టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఐమాక్స్ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని పంపిణీ చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. తాజా రిపోర్టు ప్రకారం, సలార్ ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో మోత మోగిస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల హక్కులు 165 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్లు సమాచారం. అలాగే ఈ సినిమా హక్కుల కోసం మైత్రీ మూవీ మేకర్స్‌తో 60 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కథనాలొస్తున్నాయి. పాపులర్ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిందని టాక్ ఉంది.
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా మొదటి వారాంతంలోనే మంచి వసూళ్లు రాబట్టే విధంగా టిక్కెట్ రేట్లు పెంచుతారని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్లతో సావాసం కాబట్టి, కనీసం మొదటి వారాంతంలో టిక్కెట్ రేట్లను పెంచుకోవడం ద్వారా రిటర్నులను పెంచుకోవడానికి సలార్ మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. మల్టీప్లెక్స్‌లలో రూ.410, సింగిల్ స్క్రీన్‌లలో రూ.250 వరకు టిక్కెట్ ధరలు ఉంటాయని కూడా టాక్ వినిపిస్తోంది.
అయితే టికెట్ రేట్లు పెంచడం అన్నది ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన భారీ బడ్జెట్ చిత్రాలైన బాహుబలి 1, బాహుబలి 2 కోసం టికెట్ ధరల్ని పెంచుకునే ఎత్తుగడను అనుసరించారు. ఆ తర్వాత కూడా చాలా భారీ చిత్రాల కోసం టికెట్ ధరల్ని తొలి వారంలో పెంచుకునే వెసులుబాటు కోసం నిర్మాతలు ప్రయత్నించిన సందర్భాలున్నాయి. ఇప్పటికీ దీనిని బిగ్ బడ్జెట్ చిత్రాల కోసం అనుసరిస్తున్నారు. అందువల్ల సలార్ లాంటి క్రేజ్ ఉన్న సినిమాకి టికెట్ ధరల్ని పెంచుకోవాలని ఆలోచించడం అసహజమైన ప్రక్రియ కాదు. సలార్ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్న ప్రత్యేక అభిమానులున్నారు. అందువల్ల ధరల్ని పెంచినా టికెట్ రేట్లను ఆలోచించని సెక్షన్ ఓపెనింగ్ వీకెండ్ లో మూవీని వీక్షిస్తారు. కొంత ధరలు అందుబాటులోకి రావాలని వేచి చూసేవారంతా తొలి వారం తర్వాత థియేటర్లకు కదిలే వీలుంటుంది. అలాగే సలార్ టికెట్ ధరల పెంపుతో ఓపెనింగ్ డే, ఓపెనింగ్ వీకెండ్ తొలివారం వసూళ్ల రికార్డులు నమోదయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.
బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ కేజీఎఫ్ కు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ తెరకెక్కింది. కేజీఎఫ్ చిత్రాల్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ రాజీ అన్నదే లేకుండా 'సలార్'ను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించారు. సలార్ తో పోటీపడుతూ క్రిస్మస్ బరిలో షారూఖ్ -హిరాణీల డంకీ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇక బాహుబలి చిత్రాల తర్వాత విజయవంతం కాని సినిమాలను అందించిన ప్రభాస్ తదుపరి సలార్ తో వస్తున్నాడు. కల్కి 2898, స్పిరిట్, రాజా డీలక్స్ వంటి అనేక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు క్యూలో ఉన్నాయి.