'సలార్' రిలీజ్.. టికెట్ రేట్ల ట్విస్ట్ తప్పదా?
ఎందుకంటే ఇప్పుడున్న టికెట్ రేట్లకే ఆడియన్స్ థియేటర్స్ కు రావటం లేదంటే మళ్లీ రేట్లు పెంచితే మొదటికే మోసం వస్తుందని నిర్మాతల్లో భయం కనిపించింది.
By: Tupaki Desk | 21 Nov 2023 11:30 AM GMTథియేటర్లో ఓ స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు కానీ కామన్ ఆడియన్స్ కాస్త కంగారు పడుతున్నారు. అందుకు కారణం టికెట్ రేట్లు పెంచడమే. ఈమధ్య అగ్ర హీరోల సినిమాలకు టికెట్ రేట్లు పెరగడం ఆనవాయితీగా వస్తుంది. దాంతో ప్రేక్షకులు తమ కుటుంబంతో కలిసి సినిమాని థియేటర్స్ లో చూసేందుకు వెనకడుగు వేస్తున్నారు.
తాజాగా మరోసారి అదే రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. రీసెంట్ టైమ్స్ లో కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అయినా వాటికి టికెట్ రేట్స్ పెంచలేదు. ఎందుకంటే ఇప్పుడున్న టికెట్ రేట్లకే ఆడియన్స్ థియేటర్స్ కు రావటం లేదంటే మళ్లీ రేట్లు పెంచితే మొదటికే మోసం వస్తుందని నిర్మాతల్లో భయం కనిపించింది. అందుకే ఇటీవల కాలంలో విడుదలైన భోళాశంకర్, భగవత్ కేసరి సహా చాలా వరకు పెద్ద సినిమాలన్నీ సాధారణ టికెట్ రేట్లతోనే థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి.
కానీ ప్రభాస్ నటించిన 'సలార్' మూవీకి మాత్రం మరోసారి టికెట్ రేట్స్ పెంచాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'సలార్' డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో చెప్పనవసరం లేదు. సినిమాకున్న హైప్ చూస్తుంటే ఓపెనింగ్స్ తోనే రూ.200 కోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తుంది.
గతంలో ప్రభాస్ నటించిన సాహూ, ఆదిపురుష్ వంటి సినిమాలకి మొదటి రోజే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన 'లియో' కూడా రూ.140 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టింది. టాలీవుడ్ లో అయితే ఈ ఏడాది 'ఆదిపురుష్' రూ.137 కోట్లతో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. అలా టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ సినిమాలకు వందల కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి.
ఇదే విషయాన్ని గమనించిన సలార్ మేకర్స్ టికెట్ రేట్లు పెంచుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే ప్రభుత్వానికి రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నారు.
సినిమా బడ్జెట్ రూ.200 కోట్లకు పైగా ఉండడంతో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రకారం సలార్ సినిమాకి రూ.50 నుంచి రూ.80 వరకు రేట్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
తెలంగాణలో ఇప్పటికే మల్టీప్లెక్స్ టికెట్ రేట్ రూ.295 ఉంది. దాని రూ.350 కి పెంచే ఛాన్స్ ఉంది. అటు ఏపీలోనూ రూ.225 కి టికెట్ రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.