మెగాస్టార్‌ని మించినోళ్లు.. ఆరోజుల్లోనే స్టార్ రేంజ్
నాటి మేటి పాపులర్ రచయితల అసాధారణ జర్నీని పరిశోధించే డాక్యుమెంట్-సిరీస్ 'యాంగ్రీ యంగ్ మెన్' ట్రైలర్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది.
By: Tupaki Desk | 15 Aug 2024 4:01 AM GMTస్టార్లను దర్శకులు నిర్ధేశించాలని దాసరి వంటి సీనియర్లు బాహాటంగా వ్యాఖ్యానించేవారు. దివంగత లెజెండ్ తన హయాంలో దానిని చేసి చూపించారు. సూపర్ స్టార్లు దర్శకరత్న కాల్షీట్ల కోసం వేచి చూసేవారు. ఆయనతో పని చేయాలని తపించేవారు. కానీ ఆ తర్వాత హీరోయిజం అన్నిటినీ డామినేట్ చేసింది. పారితోషికాలు, ప్యాకేజీలు అంటూ హీరోల హంగామా పీక్స్ కి చేరుకుంది. దీనిని దాసరి ప్రతిసారీ బహిరంగ వేదికలపైనే ఖండించేవారు. ఎవరు ఎంతగా ఆవేదన చెందినా కానీ, ఇప్పుడు పరిశ్రమల్ని శాసించేది కేవలం హీరోలు మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే హీరోయిజాన్ని ఒక లెవల్‌కి తీసుకెళ్లిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ని మించేలా ఎదిగిన దిగ్గజ రచయితల ద్వయం గురించి తెలసుకుని తీరాలి. క్లాసిక్ డేస్‌లో నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచిన రచయితలు సలీం-జావేద్. నాటి మేటి పాపులర్ రచయితల అసాధారణ జర్నీని పరిశోధించే డాక్యుమెంట్-సిరీస్ 'యాంగ్రీ యంగ్ మెన్' ట్రైలర్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. ఈ డాక్యు సిరీస్ పాపులర్ వెటరన్ రచయితలు సలీం ఖాన్ - జావేద్ అక్తర్ జోడీ అసాధారణ ప్రయాణం, ఎదుగుదల గురించి రివీల్ చేయనుంది. నిజానికి ఆ ఇరువురూ కలిసి పనిచేసిన 24 చిత్రాలలో 22 బ్లాక్‌బస్టర్ హిట్ లు. భారతీయ చలనచిత్ర పరిశ్రమను హీరోలు డామినేట్ చేసే సమయంలో కూడా రచయితలుగా తామేంటో నిరూపించారు. ఇది అరుదైన ప్రక్రియ. అసాధారణ ప్రజ్ఞ, ప్రతిభా పాటవాలతో మాత్రమే సాధ్యమైనది. అందుకే ఈ సిరీస్ పై అందరిలో ఉత్కంఠ నెలకొంది.
డెబ్బైల చివరిలో యాదోన్ కీ బారాత్, జంజీర్, దీవార్, షోలే వంటి మరపురాని చిత్రాలను అందించిన సలీం-జావేద్ విజయానికి పర్యాయపదంగా నిలిచారు. ఈ జోడీ ఎదుగుదల గురించిన వివరాలతో 'యాంగ్రీ యంగ్ మెన్' ట్రైలర్ దూసుకుపోతోంది. వారి ఉచ్ఛస్థితిని ఇది ఆవిష్కరించింది. స్టార్ రైటర్స్ తమ ప్రతి చిత్రానికి రూ. 21 లక్షల పారితోషికాన్ని డిమాండ్ చేసి అందుకునేవారు. ఆ రోజుల్లో భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన నటుడు అమితాబ్ బచ్చన్. ఆయన ఫీజు కంటే ఎక్కువ మొత్తం సలీం-జావేద్ అందుకున్నారు. ట్రైలర్‌లో దీన్ని హైలైట్ చేసారు. అమితాబ్ ఫీజు రూ. 20 లక్షలు.. రాజేష్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా వంటి ఇతర స్టార్‌లు చాలా తక్కువ సంపాదిస్తున్నారు. డాక్యుమెంటరీలో దిగ్గజ దర్శకనిర్మాత కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ఈ రోజు ఒక రచయిత సల్మాన్ ఖాన్ కంటే కోటి ఎక్కువ అడిగారనేది మీరు ఊహించగలరా? అది సలీం-జావేద్ లాంటి దిగ్గజాల శక్తి అని అన్నారు.
ఈ డాక్యు సిరీస్‌లో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఫర్హాన్ అక్తర్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, కరణ్ జోహార్ సహా అనేక మంది బాలీవుడ్ దిగ్గజాలతో ఇంటర్వ్యూలు ఉన్నాయి. వారు పరిశ్రమపై సలీం-జావేద్ చూపిన అపారమైన ప్రభావాన్ని వివరించారు. ఈ సిరీస్ బాలీవుడ్‌లో షాక్ వేవ్‌లను పంపిన రచయితల ద్వయం చివరికి విడిపోవడం గురించి కూడా ప్రస్థావిస్తుంది. ఈ ట్రైలర్ లాంచ్‌లో సలీం ఖాన్ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ కొన్ని మాటలు చెప్పారు.
''నేను కెమెరా ముందు నా కెరీర్‌ని ప్రారంభించాను. అయితే కథ చెప్పడంలో నా నిజమైన పనితనాన్ని కనుగొన్నాను. జావేద్, నేను రాయడంపై మక్కువను పెంచుకున్నాం. మేం కలిసి పరిశ్రమ నిబంధనలను సవాలు చేసాము. ప్రత్యేకమైనదాన్ని సృష్టించాము. మా ప్రయాణం భవిష్యత్ తరాల కోసం డాక్యుమెంట్ చేస్తున్నందుకు నేను థ్రిల్లింగ్‌గా ఉన్నాను. ఇది ఇతరులకు తమ అభిరుచులను నిర్భయంగా కొనసాగించేలా ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నాను'' అని అన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో స్క్రీన్ రైటర్‌ల పాత్రను పునర్నిర్వచించిన రచయితల గురించి లోతైన విషయాలను 'యాంగ్రీ యంగ్ మెన్' సిరీస్ అందించనుంది.