Begin typing your search above and press return to search.

స్టార్ హీరో తండ్రి రూ.55 అద్దెతో హాఫ్ రూమ్‌లోనే

రంగుల ప్ర‌పంచంలో మ‌నుగ‌డ అంత సులువైన‌ది కాదు. స్టార్ డ‌మ్ అందుకోవాలంటే దానికోసం చాలా త‌పించాలి

By:  Tupaki Desk   |   20 Aug 2024 7:06 AM GMT
స్టార్ హీరో తండ్రి రూ.55 అద్దెతో హాఫ్ రూమ్‌లోనే
X

రంగుల ప్ర‌పంచంలో మ‌నుగ‌డ అంత సులువైన‌ది కాదు. స్టార్ డ‌మ్ అందుకోవాలంటే దానికోసం చాలా త‌పించాలి. క‌ఠోరంగా శ్ర‌మించాలి. ఆర్థిక ఇబ్బందులు ఒడిదుడుకులు అన్నిటినీ త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌ల‌గాలి. చాలామంది స్టార్లు, సాంకేతిక నిపుణులు ఒక స్థాయికి వ‌చ్చాక కూడా త‌మ ఆరంభ జీవితంలో క‌ష్ట‌న‌ష్టాలను మ‌ర్చిపోలేరు. వాటి గురించి ఎలాంటి భేష‌జం లేకుండా బ‌హిరంగంగా మాట్లాడుతారు. ఇప్పుడు అలాంటి వారి జాబితాలో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ తండ్రి, ప్ర‌ముఖ ర‌చ‌యిత స‌లీంఖాన్ కూడా చేరారు.

స్టార్ రైట‌ర్స్ స‌లీం ఖాన్ -జావేద్ అక్త‌ర్ జోడీ సినీప్ర‌యాణంపై తెర‌కెక్కించిన డాక్యుమెంట్-సిరీస్ `యాంగ్రీ యంగ్ మెన్‌` చాలా సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. స‌ల్మాన్ తండ్రి సలీం ఖాన్ ముంబైకి మారినప్పుడు తన ప్రారంభ జీవితం, కెరీర్ పోరాటాల గురించి ఓపెన‌య్యారు. ఆర్థిక ఇబ్బందులు త‌న‌ను చిన్నా చిత‌కా పాత్రలను పోషించేలా చేశాయ‌ని కూడా అతడు వెల్లడించాడు. ప్రైమ్ వీడియో లో మోస్ట్ అవైటెడ్ డాక్యుసీరీస్ `యాంగ్రీ యంగ్ మెన్` ప్రీమియర్ చేయ‌గా దీనికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. సలీం ఖాన్ - జావేద్ అక్తర్ జీవితాలపై చాలా విష‌యాల‌ను ఈ సిరీస్ లో చూపించ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. సల్మాన్ ఖాన్ తండ్రి స‌లీంఖాన్ ముంబైకి వెళ్లి మెరైన్ డ్రైవ్‌లోని మెరీనా గెస్ట్ హౌస్‌లో రూ. 55 అద్దె గదిలో నివసించిన స‌మ‌యాన్ని గుర్తు చేసుకున్నారు.

నేను సగం గదికి నెలకు రూ. 55 అద్దె చెల్లించేవాడిని అని సలీం ఖాన్ వెల్లడించారు. మొదట మొత్తం గదిని రూ. 110 కి అద్దెకు తీసుకోవాలనుకున్నాడు.. కానీ ఆ కోరిక ఎప్ప‌టికీ నెరవేరలేదు. స‌లీంఖాన్ తన స్వస్థలమైన ఇండోర్‌లో చాలా సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపాడు. కానీ అతడు తన ఆకాంక్షల కోసం బయటకు వెళ్లడం తప్ప త‌న‌కు వేరే మార్గం లేదు! అని చెప్పారు. నేను ముంబయికి బయలుదేరినప్పుడు ఇదంతా అవసరం లేదని మా అన్నయ్య నాకు చెప్పాడు. కానీ నేను ఇంటి నుండి డబ్బు అడగాలనుకోలేదు.. కాబట్టి నేను కష్టపడ్డాను.. అని స‌లీంఖాన్ చెప్పారు. ప్రముఖ స్క్రీన్ రైటర్ స‌లీంఖాన్ కేవలం 17 సంవత్సరాల వయస్సులో ముంబైకి వెళ్లారు.

24 ఏళ్ల సలీం ఖాన్ సల్మా మాహిమ్ (స‌ల్మాన్ ఖాన్ త‌ల్లి) రెజి హౌస్- ముంబై భవనంలో నివసించేవారు. ఆ స‌మ‌యంలోనే వారి చూపులు క‌లిసాయ‌ని, సాయంత్రం ఆ ఇంటికి సమీపంలోని లేన్లలో కలుసుకునేవాళ్ళం! అని స‌లీంఖాన్ గుర్తుచేసుకున్నారు. అయితే సల్మా కుటుంబ సభ్యులు సలీమ్‌ను పెళ్లి చేసుకోవాలని లేదా వారు సంబంధం చూసే వారితో సెటిల్ అవ్వాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అదృష్టవశాత్తూ సలీం- సల్మా వారి ప్రేమ‌ను నిల‌బెట్టుకున్నారు. 1964లో వారికి పెళ్ల‌యింది. వివాహం అయిన‌ ప్రారంభంలో కుటుంబానికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌య్యాయి. డబ్బు లేదా ఉద్యోగ భద్రత గురించి ఎల్లప్పుడూ ఆందోళనలు ఉండేవి. తనకు అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అవసరం కాబట్టి అతడు సిగరెట్, దుస్తుల ప్రకటనల్లోను న‌టించారు.

అయితే సలీమ్ తన సృజనాత్మక‌త ప్ర‌కారం... కెమెరా వెనుక సీటుకు అర్హుడిని అని వెంటనే గ్రహించాడు. దిలీప్ కుమార్ లేదా అమితాబ్ బచ్చన్ వంటి నటులకు తాను వారు న‌టించే పాత్రల‌ను ఎలా వివరించగలడో కూడా ఖాన్ వెల్ల‌డించారు. కానీ తాను నటించలేకపోయాన‌ని తెలిపాడు. ఆ సమయంలోనే అతడు నటనకు స్వస్తి చెప్పి రచనపై దృష్టి పెట్టాలని నిర్ణ‌యించుకున్నాడు. ఆ త‌ర్వాత గొప్ప ర‌చ‌యిత‌గా ఎదిగారు.