సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ వర్గానికి డబ్బు ఆఫర్ చేశారా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ హత్యా బెదిరింపుల అనంతరం భారీ భద్రత నడుమ షూటింగులు చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 Oct 2024 10:19 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ హత్యా బెదిరింపుల అనంతరం భారీ భద్రత నడుమ షూటింగులు చేస్తున్న సంగతి తెలిసిందే. జైలు నుంచే స్టార్ హీరోని ఒణికిస్తున్న గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ ని ప్రపంచం రియల్ హీరోగా చూడటం ప్రారంభించింది. అతడిపై ఇటీవలి జాతీయ మీడియా కథనాలు దీనిని వెల్లడిస్తున్నాయి.
ఆసక్తికరంగా సల్మాన్ కు సంబంధించిన కృష్ణ జింక (బ్లాక్ బక్) ఘటనపై మొత్తం బిష్ణోయ్ సమాజం జైలుకెళ్లిన గ్యాంగ్‌స్టర్ కు అండగా నిలుస్తుందని లారెన్స్ బిష్ణోయ్ బంధువు రమేష్ బిష్ణోయ్ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో అన్నారు. ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రమేష్ మాట్లాడుతూ.. బిష్ణోయ్ వర్గానికి సల్మాన్ ఖాన్ డబ్బు ఆఫర్ చేశారని, అయితే వారు దానిని తీసుకునేందుకు నిరాకరించారని అన్నారు.
లారెన్స్ బిష్ణోయ్ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్ .. అతడిపై 30 పైగా తీవ్రమైన కేసులున్నాయి. దేశ విదేశాల్లో 700 మంది షూటర్లు అతడి కోసం పని చేస్తున్నారని కథనాలొచ్చాయి. లారెన్స్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. కృష్ణజింకను వేటాడిన ఘటన తర్వాత సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ , అతడి గ్యాంగ్ నుండి అనేక సందర్భాల్లో హత్య బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ను చంపేస్తామంటూ హెచ్చరించారు. బిష్ణోయ్ కమ్యూనిటీ పవిత్రంగా భావించే కృష్ణ జింకను వేటాడినందుకు సల్మాన్ ఖాన్ సారీ చెప్పాలని కూడా పదే పదే డిమాండ్ చేసింది బిష్ణోయ్ సమాజం. 2023లో ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లారెన్స్ బిష్ణోయ్ మాట్లాడుతూ.. కృష్ణజింకను చంపి సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ సమాజాన్ని అగౌరవపరిచి చాలా పెద్ద తప్పు చేసాడని అన్నారు. దీనికి ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తాజా పరిణామంలో... ఈ కేసులో మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది. సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ కమ్యూనిటీకి ఇంతకు ముందు డబ్బు ఆఫర్ చేశాడని లారెన్స్ కజిన్ రమేష్ ఎన్‌డిటివికి తెలిపారు. డబ్బు కోసమే లారెన్స్ గ్యాంగ్ ఇలా చేస్తోందని అతడి తండ్రి సలీం ఖాన్ అన్నారు. ``ఈ బ్లాంక్ చెక్ లో కావాల్సినది రాసుకోండి.. తీసుకోండి!`` అని అతడి(సలీంఖాన్) కొడుకు బిష్ణోయ్ సంఘం ముందు చెక్ బుక్ ఉంచాడనే విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. మాకు డబ్బు ఆకలి ఉంటే, ఆ సమయంలో ఆ డబ్బును తీసుకునేవాళ్లం.. కానీ లేదు! అని అతడు అన్నాడు. కృష్ణజింక ఘటన జరిగినప్పుడు బిష్ణోయ్ కమ్యూనిటీలోని ప్రతి ఒక్కరు ఆగ్రహంతో ఉన్నారని లారెన్స్ బంధువు రమేష్ అన్నారు. జంతువులను రక్షించేందుకు సమాజం త్యాగాలకు సిద్ధంగా ఉందన్నారు.
``...సల్మాన్ ఖాన్ కృష్ణజింకను చంపినప్పుడు, ప్రతి బిష్ణోయ్ రక్తం మరుగుతోంది. అయితే మేం దానిని కోర్టుకు వదిలేశాము. కానీ సమాజాన్ని ఎగతాళి చేస్తే, దానికి కోపం రావడం సహజం. ఈ రోజు ఈ విషయంలో బిష్ణోయ్ కమ్యూనిటీ మొత్తం లారెన్స్‌కు అండగా నిలుస్తోంది`` అని రమేష్ అన్నారు.
వరుసగా హత్యా బెదిరింపులు
ఈ ఏడాది ఏప్రిల్ 24న ముంబై సమీపంలోని పన్వెల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై నవీ ముంబై పోలీసులు బిష్ణోయ్ గ్యాంగ్‌లోని 18 మంది పై కేసు నమోదు చేశారు. ముంబైలోని సల్మాన్ నివశించే బాంద్రా ఇంటి వెలుపల బిష్ణోయ్ ముఠా సభ్యులు కాల్పులు జరిపిన తర్వాత పరిణామమిది.
అనంతరం కొన్ని నెలల గ్యాప్ తర్వాత సల్మాన్ స్నేహితుడు, రాజకీయ నాయకుడు సిద్ధిఖ్ హత్య అందరికీ షాకిచ్చింది. అటుపైనా 5 కోట్లు చెల్లించకపోతే చంపేస్తామంటూ సల్మాన్ కి మరో బెదిరింపు రాగానే, అతడి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం సల్మాన్ 100 మంది భద్రతా సిబ్బంది నడుమ షూటింగుల్లో పాల్గొనడం చూస్తుంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.