Begin typing your search above and press return to search.

బాంబ్ బెదిరింపుల‌తో స‌ల్మాన్ టీమ్ హైఅలెర్ట్

స‌ల్మాన్ ఖాన్ కి కొంత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ హ‌త్యా బెదిరింపులు ఎదుర‌య్యాయి. తాజా బెదిరింపుల‌తో స‌ల్మాన్ టీమ్ హై అలెర్ట్ అయింది. అత‌డి చుట్టూ అత్యున్న‌త‌ భ‌ద్ర‌త‌ను మోహ‌రించార‌ని స‌మాచారం.

By:  Tupaki Desk   |   14 April 2025 9:16 AM
Salman Khan Faces New Threats
X

స‌ల్మాన్ ఖాన్ కి కొంత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ హ‌త్యా బెదిరింపులు ఎదుర‌య్యాయి. తాజా బెదిరింపుల‌తో స‌ల్మాన్ టీమ్ హై అలెర్ట్ అయింది. అత‌డి చుట్టూ అత్యున్న‌త‌ భ‌ద్ర‌త‌ను మోహ‌రించార‌ని స‌మాచారం. సోమవారం ఉదయం ముంబైలోని ట్రాఫిక్ పోలీస్ హెల్ప్ లైన్ కు చెందిన వాట్సాప్ నంబర్ కు ఒక మెసేజ్ వ‌చ్చింది. ఈ మెసేజ్ లో తీవ్ర‌మైన బెదిరింపు సందేశం ఉంది. స‌ల్మాన్ ఇంట్లోకి ప్రవేశించి చంపేస్తామని, అతడి కారును బాంబుతో పేల్చివేస్తామని బెదిరిస్తూ మెసేజ్ వచ్చిందని మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. ముంబై పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తు తెలియని వ్యక్తి నుంచి ప్రాణాలకు ముప్పు ఉందని పలు వార్తా ఛానెల్స్ కథనాలు ప్రసారం చేయ‌డంతో స‌ల్మాన్ ఫ్యాన్స్ లో టెన్ష‌న్ మొద‌లైంది. స‌ల్మాన్ ప్ర‌స్తుతం తన కుటుంబంతో కలిసి ముంబై బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నాడు. గత సంవత్సరం బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న షూటర్లు సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత అత‌డి భద్రతను కట్టుదిట్టం చేశారు. అయినా బెదిరింపులు ఆగ‌లేదు. గత రెండేళ్లలో అత‌డి ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులు రావడం ఇది ఐదవసారి. ముంబై పోలీసులు తాజా హత్యా బెదిరింపులకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బెదిరింపు సందేశం ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? అనేది తెలుసుకోవడానికి పోలీస్ అధికారులు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు.

రెండేళ్లుగా సల్మాన్, అత‌డి తండ్రి సలీం ఖాన్‌ సహా కుటుంబ సభ్యులకు ప‌లుమార్లు హత్యా బెదిరింపులు ఎదుర‌య్యాయి. గత సంవత్సరం ముంబై పోలీసుల విచార‌ణ‌లో షాకిచ్చే నిజాలు ఎన్నో తెలిసాయి. స‌ల్మాన్‌పై గ్యాంగ్‌స్ట‌ర్స్ ప‌లుమార్లు రెక్కీ నిర్వ‌హించారు. అత‌డిని తన పన్వెల్ ఫామ్‌హౌస్‌లో హత్య చేయడానికి కుట్ర పన్నారని కూడా అధికారులు కనుగొన్నారు. లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుండి వచ్చిన షూటర్లు అత‌డిని వెంబడించి, ఫామ్‌హౌస్‌కు వచ్చి చంపడానికి ప్లాన్ చేస్తున్నారని వెల్ల‌డించారు. గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ అనుచ‌రులు స‌ల్మాన్ ని నిరంత‌రం వెంటాడుతున్నారు. ఇది 90ల నాటి వైరానికి సంబంధించిన క‌థ‌. స‌ల్మాన్ ఖాన్ జోధ్ పూర్ అడ‌వుల్లో కృష్ణ జింకలను వేటాడి చంప‌డంతో త‌మ ఆరాధ్య దైవాలైన కృష్ణ‌ జింక‌ల‌ను చంపినందుకు గ్యాంగ్ స్ట‌ర్ బిష్ణోయ్ తెగ క్ష‌మాప‌ణ‌లు కోరింది. కానీ దానికి స‌ల్మాన్, అత‌డి తండ్రి నిరాక‌రించారు. ఆ త‌ర్వాత ప‌ర్య‌వ‌సానాల్ని స‌ల్మాన్ ప్ర‌స్తుతం ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా సల్మాన్‌పై వేట కేసును కోర్టు కొట్టివేసినా గ్యాంగ్ స్ట‌ర్ బిష్ణోయ్ మాత్రం వ్య‌క్తిగ‌త వైరాన్ని న‌డిపిస్తున్నాడు. జైలు నుంచే బిష్ణోయ్ స‌వాల్ విసురుతుండ‌డం సంచ‌ల‌నంగా మారుతోంది.

సల్మాన్ ఇటీవల ఎ.ఆర్. మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో `సికందర్` లో న‌టించాడు. ఈద్ సందర్భంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది కానీ అంతగా ఆదరణ పొందలేదు. సికందర్ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వ‌సూలు చేయ‌గా, భారతదేశంలో రూ.109 కోట్లకు పైగా సంపాదించింది. కానీ ఇప్పుడు క‌లెక్ష‌న్లు లేవు. రూ. 250 కోట్ల కంటే తక్కువగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఇది సల్మాన్ ని తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది.