వరుసగా సౌత్ డైరెక్టర్లతో సూపర్‌స్టార్
ఉత్తరాదిన సౌత్ సినిమా హవా ముందు బాలీవుడ్ చిన్నబోయింది. దీని పర్యవసానం మామూలుగా లేదు.
By: Tupaki Desk | 2 April 2025 4:26 AMఉత్తరాదిన సౌత్ సినిమా హవా ముందు బాలీవుడ్ చిన్నబోయింది. దీని పర్యవసానం మామూలుగా లేదు. బాలీవుడ్ లో దిగ్గజ దర్శకులను వదిలిపెట్టి సూపర్ స్టార్లు ఇప్పుడు సౌత్ లో రొటీన్ మాస్ యాక్షన్ దర్శకుల వెంటపడుతున్నారు. అట్లీ, మురుగదాస్, హరీష్ శంకర్ లాంటి దర్శకులు హిందీలో అగ్ర హీరోలకు ఆప్షన్ గా మారుతున్నారు.
గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ ఓ భారీ చిత్రానికి ప్లాన్ చేస్తోందని, దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి. పవన్ కల్యాణ్ తో `ఉస్తాద్ భగత్ సింగ్` కోసం చాలా కాలం వేచి చూసిన హరీష్ కల ఇప్పట్లో నెరవేరేట్టు లేదు. అదే క్రమంలో అతడు సల్మాన్ భాయ్ కి లైన్ వినిపించి ఓకే చేయించాడని కూడా గుసగుసలు వినిపించాయి. వంద శాతం బౌండ్ స్క్రిప్ట్ తో సల్మాన్ ని ఒప్పించి సెట్స్ పైకి వెళ్లేందుకు అతడు కసరత్తులో ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే మరో సౌత్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ రూపొందించిన సికందర్ ఫలితం ఆశాజనకంగా లేదు. సల్మాన్ స్టార్ డమ్ కారణంగా `సికందర్` ఆరంభ వసూళ్లలో ఫర్వాలేదనిపించినా కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయి వసూళ్లను తేవడం లేదని ట్రేడ్ చెబుతోంది. దీంతో ఇప్పుడు హరీష్ శంకర్ బాధ్యత మరింత పెద్దదైంది. ఓవైపు తన కెరీర్ ని గాడిలో పెడుతూనే సల్మాన్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం అతడు చాలా శ్రమించాల్సి ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ సరైన కథల్లేక ఇబ్బందిలో ఉంది. ఈ సమయంలో మంచి కథతో అతడు మెప్పించి తీరాలి. సల్మాన్ ఓ వైపు వరుస ఫ్లాపులతో ఇబ్బందుల్లో ఉన్నాడు గనుక, కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిందే.