విమానంలో 45ని.లు అల్లకల్లోలం.. చావుకు దగ్గరగా స్టార్ హీరో!
అది ఆరోజు వాతావరణం, విమానంలో తలెత్తే సాంకేతిక లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం, ప్రయాణీకుల దురదృష్టం.. ఇలా రకరకాల కారణాలను అన్వేషించగలం.
By: Tupaki Desk | 10 Feb 2025 6:30 PM GMTఇటీవల వరుసగా విమాన ప్రమాదాల గురించి వినాల్సి వస్తోంది. గడిచిన నెలరోజుల్లో మూడు అంతర్జాతీయ విమానాలు కుప్పకూలి ప్రయాణీకులు మరణించిన వార్తలు కలచివేసాయి. దీనిని బట్టి విమాన ప్రయాణం అన్ని సందర్భాల్లో సురక్షితమేనని నమ్మలేని పరిస్థితి. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అది ఆరోజు వాతావరణం, విమానంలో తలెత్తే సాంకేతిక లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం, ప్రయాణీకుల దురదృష్టం.. ఇలా రకరకాల కారణాలను అన్వేషించగలం.
అలాంటి ఒక భయానక అనుభవాన్ని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, అగ్ర హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా ఎదుర్కొన్నారు. విమానంలో 45 నిమిషాల పాటు అల్లకల్లోలంగా ఉన్న సమయంలో తాము మరణానికి దగ్గరగా ఉన్నామని సల్మాన్ ఖాన్ అనుమానించారు. విమానంలో ప్రయాణీకులంతా టెన్షన్ టెన్షన్ గా గడిపిన క్షణాలను ఆయన నెమరు వేసుకున్నాడు. సల్మాన్ ఖాన్ ఇటీవల తన సోదరుడి కుమారుడు అర్హాన్ ఖాన్ యూట్యూబ్ ఛానెల్ డంబ్ బిర్యానీలో పాడ్‌కాస్ట్ ఆరంగేట్రం చేశాడు. ఈ కార్యక్రమంలో అతడు మాట్లాడుతూ.. విమానంలో తన చేదు అనుభవం గురించి వెల్లడించారు. సోనాక్షి సిన్హా, ఆమె తల్లి, తన తమ్ముడు సోహైల్ ఖాన్‌తో కలిసి సల్మాన్ ఖాన్ విమాన ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ భయంకరమైన అనుభవం ఎదురైందని సల్మాన్ తెలిపాడు.
ఒక అవార్డు షో నుండి తిరిగి వస్తున్నప్పుడు తాము ఎక్కిన విమానం దాదాపు 45 నిమిషాలకు పైగా అల్లకల్లోలంగా ఉందని సల్మాన్ వెల్లడించాడు. చాలా మంది ప్రయాణీకులు భయంతో ఒణికిపోతున్నారు. కానీ సోహైల్ ఆ సమయంలో అదేమీ పట్టనట్టు హాయిగా నిద్రపోయాడని సల్మాన్ గుర్తు చేసుకున్నాడు. ``ఐఫా అవార్డుల వేడుక ముగించి శ్రీలంక నుండి తిరిగి వస్తున్నాము. అందరూ నవ్వుతూ సరదాగా ఉన్నారు. అకస్మాత్తుగా గాల్లో అల్లకల్లోలం ఏర్పడింది. మొదట ఇది సాధారణంగా అనిపించింది.. కానీ తరువాత శబ్దం బిగ్గరగా పెరిగింది.. కొంత సమయానికి మొత్తం విమానం నిశ్శబ్దంగా మారింది. నేను, సోహైల్ ఒకే విమానంలో ఉన్నాం. నేను అతడి వైపు చూసేసరికి నిద్రపోతున్నాడు. ఆ అల్లకల్లోలం 45 నిమిషాలు కొనసాగింది`` అని సల్మాన్ ఖాన్ గుర్తుచేసుకున్నాడు.
ఆ సమయంలో పైలెట్ ముఖంలోకి చూసినప్పుడు అతడు ఉక్కిరిబిక్కిరిగా ఉన్నట్టు అనిపించాడు. ఎయిర్ హోస్టెస్ వైపు చూస్తే ప్రార్థిస్తూ కనిపించింది. అప్పుడు డౌట్ పుట్టింది. సాధారణంగా పైలెట్‌లు చాలా కూల్‌గా ఉంటారు. అప్పటికే ఆక్సిజన్ మాస్క్‌లు కిందికి పడిపోయాయి. నేను సినిమాల్లో మాత్రమే ఇలా జరగడం చూశాను! అని అనుకున్నాను. కానీ అదృష్ఠవశాత్తూ 45 నిమిషాల తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. అందరూ సాధారణ స్థితికి చేరుకున్నారు. మళ్ళీ నవ్వారు కూడా. సోనాక్షి , ఆమె తల్లి కూడా అక్కడే ఉన్నారు. కానీ అకస్మాత్తుగా మళ్ళీ అల్లకల్లోలం మొదలైంది. ఈసారి మరో 10 నిమిషాలు.. అందరూ వెంటనే నవ్వడం మానేశారు. ఆ క్షణం నుండి మేము దిగే వరకు ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ మేము దిగిన క్షణం.. అందరూ అకస్మాత్తుగా తేలిగ్గా మారిపోయారు అని తెలిపారు.
సల్మాన్ ప్రస్తుతం సికందర్ చిత్రీకరణలో ఉన్నారు. ఏ.ఆర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.