400 కోట్ల బడ్జెట్ చిత్రం రీమేక్ సాధ్యమేనా?
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ గా `సికిందర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 Feb 2025 11:30 AM GMTబాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ గా `సికిందర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సాజిద్ నడియావాలా 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం `సర్కార్` చిత్రానికి రీమేక్ అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. రెండు సినిమాలకు సంబంధించిన కొన్ని రకాల హింట్స్ తో ఈ రకమైన ప్రచారం మొదలైంది. రెండు కథలు ఒకేలా ఉన్నాయని... `సికిందర్` లో విలన్ గా నటిస్తున్న సత్యరాజ్ రాజకీయ ప్రతి నాయకుడిగా నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది.
ధనవంతుడు ప్రజల కోసం, అవినీతిపై యుద్దం చేసే నాయకుడి పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. `సర్కార్` కూడా తమిళ్ లో మురగదాస్ తెరకెక్కించిన చిత్రమే. అతడి గత చిత్రాలు హిందీలోనూ రీమేక్ అయిన సందర్భాలున్నాయి. `గజినీ` బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో రీమేక్ చేసారు. అలాగే `తుపాకీ` చిత్రాన్ని అక్షయ్ కుమార్ తో హిందీలోనూ రీమేక్ చేసారు. ఈ రెండు సినిమాలు బాలీవుడ్ లోనూ సంచలన విజయం సాధించాయి.
`సర్కార్` కూడా కోలీవుడ్లో 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ నేపథ్యంలో మురగదాస్ `సర్కార్` నే `సికిందర్` గా రీమేక్ చేస్తున్నాడనే బలమైన ప్రచారం ఊపందుకుంది. అయితే ఓ రీమేక్ కోసం సాజిద్ నడియా వాలా 400 కోట్లు ఖర్చు పెడతాడా? అన్నది అతి పెద్ద సందేహం. రీమేక్ కథలో కోసం ఏ నిర్మాత ఈ రేంజ్ బడ్జెట్ ను ఇంతవరకూ ఎక్కడా కేటాయించింది లేదు. ప్రెష్ స్టోరీల విషయంలో నిర్మాత రిస్క్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
ఈ నేపథ్యంలో సికిందర్ పూర్తిగా మురగదాస్ కొత్తగా క్రియేట్ చేసిన స్టోరీ ..ఎలాంటి రీమేక్ కాదని బాలీవుడ్ నుంచి వినిపిస్తోంది. సినిమాలో ఎక్కడైనా సర్కార్ ఛాయలు కనిపించడానికి ఆస్కారం ఉంటే ఉండొచ్చు కానీ...సర్కార్ తో సంబంధం లేని కొత్త కాన్సెప్ట్ అన్నది బలంగా తెరపైకి వస్తోంది. `సర్కార్` రీమేక్ అయితే మురగదాస్ అధికారికంగా ఇప్పటికే ప్రకటించే వారని కోలీవుడ్ మీడియాలోనూ వార్తలొస్తున్నాయి.