జైలులో 8గం.లు.. ఇంట్లో 2 గం.లు స్టార్ హీరో నిద్ర!
అవును.. జైలులో ఉన్నప్పుడు 8 గంటలు.. ఇంట్లో ఉన్నప్పుడు 2 గంటలు నిద్రపోతాడు ఈ స్టార్ హీరో.
By: Tupaki Desk | 10 Feb 2025 5:30 AM GMTఅవును.. జైలులో ఉన్నప్పుడు 8 గంటలు.. ఇంట్లో ఉన్నప్పుడు 2 గంటలు నిద్రపోతాడు ఈ స్టార్ హీరో. అతడికి రోజూ 2 గంటలు మాత్రమే నిదురించే అలవాటు ఉంది. ఏ పనీ పాటా లేనప్పుడు ఎక్కువ సేపు నిదురిస్తాడు. 8గంటలు నిదురపోవడం అనేది చాలా అరుదు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
ఇదంతా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన గురించి చెప్పిన కఠోరమైన నిజం. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఇదే నిజమని చెప్పాడు. డాక్టర్లు రోజూ 8 గంటల నిద్ర లేనిదే ఆరోగ్యం సరిగా ఉండదని హెచ్చరిస్తున్నారు. కానీ అలా ఎనిమిది గంటల నిద్ర అనేది తనకు చాలా అరుదు అని సల్మాన్ చెప్పాడు.
జైలులో ఉన్నప్పుడు బాగా నిద్రపోయానని సల్మాన్ ఒప్పుకున్నాడు. తన సోదరుడు అర్బాజ్ ఖాన్ - మలైకా అరోరా కుమారుడు అర్హాన్ ఖాన్ తన పాడ్‌కాస్ట్ షో `డంబ్ బిర్యానీ`లో సల్మాన్ ఖాన్ ఈ సంచలన విషయాలు చెప్పారు. పాడ్ కాస్ట్ సమయంలో తన నిద్ర సైకిల్ గురించి చెబుతూ.. నెలకు ఒకసారి మాత్రమే రోజుకు 7-8 గంటలు నిద్రపోతానని అన్నారు. తనకు వేరే పని లేనప్పుడు మాత్రమే తాను నిద్రపోగలనని కూడా ఆయన పేర్కొన్నారు. పని ఉండదు కాబట్టి జైలులో ఉన్నప్పుడు బాగా నిద్రపోయాను. విమానంలో అల్లకల్లోలం ఉన్నప్పుడు నేను నిద్రపోతాను. ఎందుకంటే అలాంటి పరిస్థితిలో నేను ఏమీ చేయలేను! అని సల్మాన్ ఛమత్కరించారు.
యువకుడైన అర్హాన్ ఖాన్ అతడి స్నేహితులు చాలా కష్టపడి పనిచేయాలని .. విజయం సాధించిన తర్వాత, వారి ప్రయాణంలో సహాయం చేసిన వారందరితో క్రెడిట్ షేర్ చేయాలని కూడా సల్మాన్ సూచించాడు. ``మీ వైఫల్యాలకు మీరే పూర్తి బాధ్యత వహించండి. కానీ విజయం ఎప్పుడూ మీది కాదు. మీరు దానిని మీ తలకెక్కించుకోకపోతే సరిగా ఉన్నట్టు. లేదంటే మీరు ఖచ్చితంగా గందరగోళంలో పడతారు!`` అని సల్మాన్ అన్నారు. యూట్యూబ్ పాడ్‌కాస్ట్ ఛానెల్‌ను మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ కుమారుడు అర్హాన్ ఖాన్, అతడి స్నేహితులు దేవ్ రైయానీ, ఆరుష్ వర్మతో కలిసి నిర్వహిస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం సికందర్ షూటింగ్‌లో ఉన్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక. పోస్టర్ విడుదలై ఆకట్టుకుంది. తదుపరి షారూఖ్ తో కలిసి టైగర్ వర్సెస్ పఠాన్ లో నటించాల్సి ఉంది.