కాల్పుల కలకలంపై సల్మాన్ తండ్రి స్పందన
బాంద్రా ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనపై సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ మౌనం వీడారు.
By: Tupaki Desk | 14 April 2024 5:31 PM GMTబాంద్రా ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనపై సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ మౌనం వీడారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు! అని చెప్పారు. ఈ ఉదయం ముంబైలోని బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వెలుపల జరిగిన షాకింగ్ కాల్పుల ఘటనపై సల్మాన్ ఖాన్ తండ్రి మరియు లెజెండరీ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్ స్పందించారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై దుండగులు తుపాకీ కాల్పులు జరిపిన భయంకరమైన ఘటన నేటి ఉదయం ముంబై-బాంద్రా ప్రాంతంలో కలకలం రేపింది. కాల్పుల శబ్దంతో సల్మాన్ కుటుంబసభ్యులు నిద్రలేచారు. దిగ్భ్రాంతికరమైన ఈ సంఘటన భాయ్ అభిమానులు, శ్రేయోభిలాషులందరినీ ఆందోళనకు గురి చేసింది. మరోవైపు ముంబైలోని బాంద్రా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు సల్మాన్ నివాసం వెలుపల కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంతలోనే ఘటనకు తామే కారకులమని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు ప్రకటించడంతో దీనిపై స్పష్ఠత వచ్చింది. తాజాగా ఈ దురదృష్టకర ఘటనలపై సల్మాన్ తండ్రి సలీం ఖాన్ స్పందించారు.
సల్మాన్ ఖాన్ ఇంటిపై తుపాకీ కాల్పుల భయంకరమైన సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత, సల్మాన్ తండ్రి , లెజెండరీ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్ ఈ విషయంపై తన మౌనాన్ని వీడారు. షూటర్లు పబ్లిసిటీని కోరుకుంటున్నారని తాను అభిప్రాయపడుతున్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ``ఇందులో చెప్పుకోవడానికి ఏమీ లేదు. వారికి కేవలం ప్రచారం కావాలి.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు``అని జాతీయ మీడియాతో అన్నారు. ఈ సంఘటనపై సల్మాన్ ఖాన్ ఇంకా స్పందించనప్పటికీ తాజా సమాచారం కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. భాయ్ చుట్టూ ఏం జరుగుతుందోనని అంతా ఆందోళనగా ఉన్నారు.
కొద్దిసేపటి క్రితం, సల్మాన్ ఖాన్ సన్నిహితులు, రాజకీయ నాయకులు బాబా సిద్ధిక్ - రాహుల్ నారాయణ్ కనల్ కూడా ఆందోళనకరమైన సంఘటన అనంతరం సల్మాన్ ను కలిసారు. గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ నుండి నిష్క్రమిస్తున్నప్పుడు రాహుల్ స్టిల్ ఫోటోగ్రాఫర్లకు చిక్కారు. వారంతా సల్మాన్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. భాయ్ ఎలా ఉన్నారు? అని ఫోటోగ్రాఫర్లు ప్రశ్నించగా.. ఇది సర్వశక్తిమంతుడి ఆశీర్వాదం.. భాయ్, అలాగే ఇతరులందరూ బాగున్నారు అని రాహుల్ నారాయణ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ వ్యవహారంలో గుర్తు తెలియని వ్యక్తులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానిత షూటర్ల సీసీటీవీ ఫుటేజీ కూడా బయటికి వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో బాంద్రాలోని నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. 3 రౌండ్ల కాల్పుల గురించి పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు అయింది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. అయితే కాల్పుల ఘటనలో ఎవరూ గాయపడలేదని డీసీపీ రాజ్ తిలక్ రౌషన్ ఏఎన్ఐతో అన్నారు. వృత్తిపరంగా, సల్మాన్ ఖాన్ ఈద్ శుభ సందర్భంగా AR మురుగదాస్‌తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. సికందర్ అనేది టైటిల్. ఇందులో భాయ్ టైటిల్ పాత్రలో కనిపిస్తారు.