Begin typing your search above and press return to search.

సల్మాన్ ఖాన్ హౌస్ ఫైరింగ్ కేసులో కోర్టు ఏమంది?

ఇందులో నిందితులపై హత్యాయత్నం వంటి అనేక తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని పిటిఐ తాజా క‌థ‌నంలో వెల్ల‌డించింది

By:  Tupaki Desk   |   23 July 2024 3:09 PM GMT
సల్మాన్ ఖాన్ హౌస్ ఫైరింగ్ కేసులో కోర్టు ఏమంది?
X

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులకు సంబంధించిన కేసును సమీక్షిస్తున్న ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆరుగురు నిందితులకు వ్యతిరేకంగా తగిన ఆధారాలను కనుగొన్నారని తెలిపింది. ప్రత్యేక న్యాయమూర్తి బి.డి. షెల్కే ముంబై పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను అంగీకరించారు. ఇందులో నిందితులపై హత్యాయత్నం వంటి అనేక తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని పిటిఐ తాజా క‌థ‌నంలో వెల్ల‌డించింది.

నిందితులపై తగిన ఆధారాల‌తో మెటీరియల్ ల‌భించిందని ముంబై కోర్టు తెలిపింది. పిటిఐ నివేదిక‌ ప్రకారం.. IPC సెక్షన్ 307 (హత్య ప్రయత్నం), సెక్షన్ 34 (సాధారణ ఉద్దేశం), సెక్షన్ 120(B) (నేరపూరిత కుట్ర) కింద నేరాలకు నిందితులపై అభియోగాలు మోపడానికి తగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అలాగే MCO (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్) చట్టం, ఆయుధాల చట్టంలోని వర్తించే సెక్షన్‌లు వారికి అనువ‌ర్తిస్తాయ‌ని తెలిపింది. నిందితులపై విచారణకు తగిన ప్రాథమిక సమాచారం రికార్డుల్లో ఉంది. అందువల్ల (ఛార్జిషీట్) విచారణ కొన‌సాగుతోంది! అని పేర్కొంది.

ఈ కేసులో ఆరుగురు నిందితులు ఉన్నారు. విక్కీకుమార్ గుప్తా, సాగర్‌కుమార్ పాల్, సోనుకుమార్ బిష్ణోయ్, అనుజ్‌కుమార్ థాపన్ (ఆయన మరణించారు), మహ్మద్ రఫీక్ చౌదరి, హర్పాల్ సింగ్ పేర్లు ఇందులో ఉన్నాయి. పోలీసు కస్టడీలో థాపన్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అరెస్టుల అనంతరం మిగిలిన నిందితులు ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. వారిపై న్యాయస్థానం చట్టపరమైన చర్యలను ప్రారంభించింది. పోలీసులు 1,735 పేజీల ఛార్జిషీట్‌ను ప్రత్యేక MCOCA కోర్టుకు సమర్పించారు. ఇది మూడు వాల్యూమ్‌లుగా దర్యాప్తు పత్రాల బంచ్ లో రెడీగా ఉంది. ఇది MCOC (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్) చట్టం, 22 పంచనామాలు .. సాంకేతిక సాక్ష్యాధారాల కింద నిందితుల‌ ఒప్పుకోలు ప్రకటనలను కూడా కలిగి ఉంది.

ఏప్రిల్ 14న బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఐదుసార్లు కాల్పులు జ‌రిపారు. ఇది స‌ల్మాన్ కుటుంబం, అభిమానులు, మద్దతుదారులను షాక్‌కు గురి చేసింది. జూలై 8న ముంబై పోలీసులు ఈ కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ సహా తొమ్మిది మంది వ్యక్తుల జాబితాతో చార్జిషీట్‌ను సమర్పించారు. కెనడాలో ఉంటూ ప్రస్తుతం జైలులో ఉన్న బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ కాల్పులకు బాధ్యత వహించాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ప్ర‌తిష్ఠాత్మ‌క‌ చిత్రం `సికందర్`లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. A.R. మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. 2025 ఈద్ కానుక‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.