Begin typing your search above and press return to search.

స‌ల్మాన్‌ని చంపేస్తాన‌న్న వ్య‌క్తి అరెస్ట్

గతంలో సల్మాన్ ఖాన్‌పై దాడులు ఏప్రిల్ 2024లో సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనను అనుసరించి తాజా అరెస్టు జరిగింది.

By:  Tupaki Desk   |   17 Jun 2024 12:48 PM GMT
స‌ల్మాన్‌ని చంపేస్తాన‌న్న వ్య‌క్తి అరెస్ట్
X

ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ని చంపేస్తామంటూ బెదిరించిన ఘ‌ట‌న‌లో ముంబై పోలీసుల విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని బుండీకి చెందిన భ‌న్వారీలాల్ లతుర్‌లాల్ గుజార్ అనే 25 ఏళ్ల వ్య‌క్తిని అరెస్ట్ చేసి జూన్ 18 వరకు పోలీసు కస్టడీ విధించారు. అత‌డు ఒక యూట్యూబ‌ర్ కూడా.

సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించే వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన తర్వాత నేరపూరిత బెదిరింపు ఆరోపణలపై గుజార్‌ను అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని హైవేపై రికార్డ్ చేసిన ఈ వీడియోలో గుజార్ గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్ - గోల్డీ బ్రార్‌లతో సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. ముంబై పోలీసులు రాజస్థాన్‌లోని ఐపి అడ్రస్‌ను ట్రేస్ చేసి, క్రైమ్ బ్రాంచ్‌లోని యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ సహాయంతో గుజార్‌ను పట్టుకున్నారు.

వీడియోను అప్‌లోడ్ చేసేటప్పుడు గుజార్ నకిలీ పేరు, ఇమెయిల్ చిరునామాను ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే అతడి మొబైల్ నంబర్ ఉపయోగించి అతనిని ట్రాక్ చేశారు. అతడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 506(2) (నేరమైన బెదిరింపులకు శిక్ష) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. అతడి నేర చరిత్రపై కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

గతంలో సల్మాన్ ఖాన్‌పై దాడులు ఏప్రిల్ 2024లో సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనను అనుసరించి తాజా అరెస్టు జరిగింది. ఆ కేసులో ఆరుగురు వ్యక్తులు గతంలో అరెస్టయ్యారు. ఒక అనుమానితుడు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే నవీ ముంబై పోలీసులు ఖాన్‌పై దాడికి కుట్ర పన్నుతున్నట్లు భావిస్తున్న ప్రత్యేక గ్యాంగ్ ని అదుపులోకి తీసుకున్నారు.

బెదిరింపులకు సంబంధించి ప్రశ్నించేందుకు ప్రస్తుతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బిష్ణోయ్‌ను కస్టడీకి తీసుకోవాలని ముంబై పోలీసులు యోచిస్తున్నారు. కెనడాలో ఉన్న అతడి సోదరుడు అన్మోల్ మెస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడు.