Begin typing your search above and press return to search.

స్టార్ హీరోకి హాని చేయొద్దంటూ గ్యాంగ్ స్ట‌ర్‌కి విన్న‌పం

క‌ర్మ ఫ‌లం గురించి భ‌గ‌వ‌ద్గీత‌లో శ్రీ‌కృష్ణ భ‌గ‌వానుడు చెప్పిన‌ది విస్మ‌రించ‌రాదు.

By:  Tupaki Desk   |   14 May 2024 12:30 PM GMT
స్టార్ హీరోకి హాని చేయొద్దంటూ గ్యాంగ్ స్ట‌ర్‌కి విన్న‌పం
X

క‌ర్మ ఫ‌లం గురించి భ‌గ‌వ‌ద్గీత‌లో శ్రీ‌కృష్ణ భ‌గ‌వానుడు చెప్పిన‌ది విస్మ‌రించ‌రాదు. క‌ర్మకు ప్ర‌తి క‌ర్మ ఫ‌లితం అనుభ‌వించాల్సిందేన‌నేది గీతా సారం. జ‌మానా కాలంలో కృష్ణ జింక‌ను వేటాడి త‌ప్పు చేసిన స‌ల్మాన్ ఖాన్ ని ఇప్ప‌టికీ క‌ర్మ ఫ‌లం వెంటాడుతుంద‌ని బిష్ణోయ్ క‌మ్యూనిటి న‌మ్ముతుంది. జోధ్ పూర్ అడ‌విలో కృష్ణ జింక వేట కేసులో స‌ల్మాన్ జైలుకు వెళ్లి వ‌చ్చాడు. అయితే త‌మ కుల దైవానికి క‌ళంకం క‌లిగించిన స‌ల్మాన్ ని విడిచిపెట్ట‌న‌ని బిష్ణోయ్ క‌మ్యూనిటీ యువ‌కుడైన లారెన్స్ బిష్ణోయ్ ప‌దే ప‌దే హెచ్చ‌రిస్తూనే ఉన్నాడు. ఇటీవ‌లే స‌ల్మాన్ ఖాన్ ఇంటిపై తుపాకుల‌తో త‌న అనుచ‌రులు దాడి చేసిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. ఈ కేసులో ఇప్ప‌టికే ఆరుగురిని పోలీసులు ప‌ట్టుకుని విచారిస్తున్నారు. వీళ్లంతా విస్తుపోయే నిజాలు చెబుతున్నారు. కాల్పులకు ముందు కాల్పుల‌కు త‌ర్వాత ఘ‌ట‌న‌లు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నాయి. కాల్పుల‌కు ముందు స‌ల్మాన్ ఇల్లు, గెస్ట్ హౌస్ ల‌ను ప‌క‌డ్భందీగా దుండ‌గులు రెక్కీ చేసారని విచార‌ణ‌లో తేలింది. ఘ‌ట‌న అనంత‌రం సల్మాన్ ఖాన్, అత‌డి కుటుంబం బిత్త‌ర‌పోయారు. ప్ర‌స్తుతం స‌ల్మాన్ చుట్టూ క‌ట్టుదిట్ట‌మైన సెక్యూరిటీ ఉంది. అత‌డు ఉప‌యోగించే కార్ స‌హా ప్ర‌తి ర‌క్ష‌ణ క‌వ‌చం బుల్లెట్ ప్రూఫ్ అని చెబుతున్నారు.

అదంతా అటుంచితే ఒక రోజు ముందే ముంబై పోలీసుల విచార‌ణ‌లో స‌ల్మాన్ పై కుట్ర‌ప‌న్నిన వారికి సాయం చేసిన మ‌రో ఐదుగురి గురించిన స‌మాచారం కూడా అరెస్ట‌యిన ఐదుగురు నిందితులు వెల్లడించార‌ని తెలిసింది. నిన్న‌నే ఆరో నిందితుడిని హ‌ర్యానాలో పోలీసులు అరెస్టు చేసారు. ఇలాంటి స‌మ‌యంలో సల్మాన్ ఖాన్‌కు హాని చేయవద్దని మాజీ గ‌ర్ల్ ఫ్రెండ్ సోమీ అలీ బిష్ణోయ్ కమ్యూనిటీని అభ్యర్థించారు.

మాజీ స్నేహితురాలు సోమీ అలీ స‌ల్మాన్ కి తన మద్దతును అందించింది. సోమీ తన కోసం ప్రార్థనలు చేసింది. నిజానికి సోమీతో స‌ల్మాన్ సంబంధం 90ల నాటిది..అత‌డితో బ్రేక‌ప్ తర్వాత సోమీ USకి వెళ్లారు. ఆ ఇరువురు ఎవ‌రికి వారు ప్రత్యేక మార్గాల్లో ప్ర‌యాణం సాగించారు. స‌ల్మాన్ పై తుపాకీ కాల్పుల‌ ఘటనపై సోమీ హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడారు. ``నా శత్రువు అయినా అత‌డికి ఏదో అవ్వాల‌ని నేను కోరుకోను. అత‌డి (స‌ల్మాన్) కోసం ప్రార్థిస్తున్నాను. ఏం జరిగినా, గతంగ‌తః.. సల్మాన్, షారుఖ్ లేదా నా పొరుగువారికి ఎవరికైనా అలాంటివి జరగాలని నేను ఎప్పుడూ కోరుకోను`` అని సోమీ అన్నారు. ``ప్రతి ఒక్కరూ ఇమేజ్ కాన్షియస్.. అది మీరు, నేను, సల్మాన్, షారూఖ్ లేదా ఎవరైనా కావచ్చు. కాబట్టి అత‌డు నా విష‌యంలో త‌న‌కు ఏది సరైనదనిపిస్తే అది చేశాడు. కానీ ప్రస్తుతం నా దృష్టి అతడు ఏం చేస్తున్నాడనే దానిపై ఉంది. అతడు ఇప్పుడు అనుభవిస్తున్న దానికి ఇత‌రులెవరూ అర్హులు కాదు`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సల్మాన్ ఖాన్‌కు హాని కలిగించవద్దని సోమీ బిష్ణోయ్ కమ్యూనిటీకి విజ్ఞప్తి చేసారు. ఒకరి ప్రాణం తీయడం ఆమోదయోగ్యం కాదు. అది సల్మాన్ అయినా లేదా సగటు సాధారణ వ్యక్తి అయినా. న్యాయం కావాలంటే కోర్టుకు వెళ్లాలి. సల్మాన్ ఖాన్‌కు హాని చేయడం కృష్ణజింకను తిరిగి తీసుకురాదని నేను బిష్ణోయ్ వర్గానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. ఏం జ‌రిగినా గతాన్ని మార్చలేం.. గతం గతంగా ఉండనివ్వండి. నాకు నేను శాంతి చేసుకున్నాను. నా జీవితం పూర్తిగా నో మోర్ టియర్స్‌కి అంకితం`` అని సోమీ అన్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సల్మాన్ త‌దుప‌రి సికిందర్ చిత్రంలో నటించనున్నారు. ఏ.ఆర్.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న క‌థానాయిక‌. ఈద్ 2025 కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కానుంది.