సల్మాన్‌పై ఎటాక్‌కి ఎంత ఆఫర్ చేసారు?
సల్మాన్ ఖాన్ హౌస్ ఫైరింగ్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 April 2024 8:15 AM GMTసల్మాన్ ఖాన్ హౌస్ ఫైరింగ్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో సల్మాన్ కుటుంబం సహా ముంబై యావత్తూ ఉలిక్కిపడింది. అయితే ఈ ఫైరింగ్ వెనక అసలు ఉద్ధేశం ఏమిటో గ్యాంగ్ స్టర్లు ఇంతకుముందే వెల్లడించారు. తమ రేంజ్ ఏంటో చూపించేందుకే వారు ఇలా భయపెట్టామని వెల్లడించారు. నిజానికి సల్మాన్‌ఖాన్‌ను హత్య చేయాలని షూటర్లను పంపించలేదని, భయపెట్టేందుకు మాత్రమే కాల్పులు జరిపారని పోలీసులు కూడా ధృవీకరించారు.
సల్మాన్‌ఖాన్ ఇంటిపై తుపాకీ కాల్పుల కేసులో ఇప్పటికే ఇద్దరు అరెస్టయ్యారు. వారిపై విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ సమయంలోనే హర్యానా నుంచి మరో నిందితుడు పట్టుబడ్డాడు. ఈ వ్యక్తి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అలాగే.. షూటర్లు విక్కీ గుప్తా -సాగర్ కుమార్ పాలక్ మధ్య మధ్యవర్తిగా పనిచేశాడు. సల్మాన్ ఖాన్ నివాసం ఉంటున్న ముంబై బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల ఆదివారం తెల్లవారుజామున 4:55 గంటలకు కాల్పుల ఘటన జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు దుండగులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.
అనుమానితుల్లో ఒకరైన సాగర్ కుమార్ పాలక్ ఏప్రిల్ 13న బాంద్రా ప్రాంతంలో ఎవరూ గుర్తించలేని సోర్స్ నుండి సంఘటన జరగడానికి కొన్ని గంటల ముందు తుపాకీ అందుకున్నాడు. పాలక్ -గుప్తా ఇద్దరూ బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌కు చెందినవారు. ముంబై పోలీసులు వారిని ఆలయంలో పట్టుకుని అరెస్టు చేశారు. గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని ఆలయ ప్రాంగణంలో వారు చిక్కారు.
అయితే సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను భయపెట్టడానికి గన్‌మెన్ లకు ఎంత పెద్ద మొత్తాన్ని ఆఫర్ చేశారు? అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం వచ్చింది. పోలీసు వివరాల ప్రకారం, పాలక్ - గుప్తా సల్మాన్ ఇంటిపై దాడి చేయడానికి రూ. 4 లక్షలు ఆఫర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముందుగా రూ. 1 లక్ష చెల్లించారు. అయితే ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు చెప్పినట్లుగా .. వారి లక్ష్యం సల్మాన్ ఖాన్‌ను హత్య చేయడం కాదు.. అతడిని భయపెట్టడం.. ఈ పనిలో భాగంగానే నిందితులు పన్వెల్‌లోని సల్మాన్‌ఖాన్ ఫామ్‌హౌస్‌పై నిఘా పెట్టారు.
సల్మాన్ పై ఎటాక్ అనంతరం లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ప్రకటన కూడా సంచలనం అయిన సంగతి తెలిసిందే. అతడు కూడా ఇప్పుడు ముంబై పోలీసుల రాడార్ పరిధిలో ఉన్నాడు. వారు అతడిపై లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేయాలని యోచిస్తున్నారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP) సహా రకరకాల కాలింగ్ .. మెసేజింగ్ అప్లికేషన్‌ల ద్వారా అనుమానితులతో అన్మోల్ కమ్యూనికేషన్‌ను కొనసాగించాడు. అతడు హర్యానా నుండి అదుపులోకి తీసుకున్న వ్యక్తికి ఆదేశాలు అందించాడు. కాల్పుల ఘటనలో పాల్గొన్న నిందితులు పలు సిమ్‌కార్డులను కొనుగోలు చేసి, వాటిని గుర్తించకుండా తప్పించుకునేందుకు వివిధ ప్రాంతాల్లో తరచూ వాటిని మార్చేవారు.
ప్రభుత్వం అతడిని అంతం చేస్తుంది!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నిన్న సల్మాన్ ఖాన్‌తో సమావేశమై అవసరమైన అన్ని సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. షిండే న్యాయాన్ని అందించే ప్రయత్నంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కిచెప్పారు. ముఖ్యంగా లారెన్స్ బిష్ణోయ్‌ను లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ ఉద్దేశించిన 10 ప్రధాన లక్ష్యాల జాబితాలో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారని గత ఏడాది జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వెల్లడించింది. గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ 1998 కృష్ణ జింకల వేట సంఘటన అనంతరం సల్మాన్ పై కక్ష కట్టాడు. సల్మాన్ ని హిట్ లిస్ట్‌లో చేర్చడానికి కారణం బిష్ణోయ్ కమ్యూనిటీ ఆరాధ్యంగా భావించే జింక మరణాన్ని అవమానంగా భావించడమేనని కూడా హిస్టరీ చెబుతోంది. చాలా కాలం పాటు కోర్టు కేసులతో నలుగుతున్న దీనికి బిష్ణోయ్ సరైన సమాధానం కోసం వేచి చూస్తున్నాడు. సల్మాన్ నేరుగా క్షమాపణలు కోరాలని అతడు హెచ్చరించిన సంగతి తెలిసిందే.